ఇంటర్యూ : మంచు విష్ణు – హాలీవుడ్ డిస్నీ మూవీ ఫార్మాట్ లానే ‘ఎర్రబస్సు’ ఉంటుంది.

Manchu-Vishnu
మంచు వారబ్బాయిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు విష్ణు హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఒక నటుడిగానే కాకుండా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. మంచు విష్ణు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో చేసిన సినిమా ‘ఎర్రబస్సు’. ఈ సినిమా చిల్డ్రన్స్ కానుకగా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంచు విష్ణు తో కాసేపు ముచ్చటించాము. ఆయన ఎంతో ఓపెన్ గా చెప్పిన కొన్ని విశేషాలు మీ కోసం..

ప్రశ్న) అసలు దసరిగారితో ఈ ‘ఎర్రబస్సు’ సినిమా మొదలయ్యింది.?

స) నేను ఓ వర్క్ పనిమీద యుఎస్ లో ఉన్నాను.. అప్పుడు దాసరి గారు ఫోన్ చేసి విష్ణు నీకో గిఫ్ట్ ఇస్తున్నాను. త్వరలోనే మన ఇద్దరం కలిసి ఓ సినిమాలో నటించానున్నామని చెప్పి పెట్టేసాడు. అంతకు మించి ఏమీ చెప్పలేదు. మళ్ళీ నేను ఇండియా వచ్చాక ఇలా ‘మంజపై’ అనే తమిళ రీమేక్ చేస్తున్నామని తెలిపారు. ఓకే చెప్పను, సెట్స్ పైకి వెళ్ళింది.

ప్రశ్న) మొదటిసారి దర్శకరత్న దాసరితో కలిసి పనిచేయడం ఎలా ఉందో చెప్పండి.?

స) కచ్చితంగా అదొక అద్భుతమైన అనుభవం అనే చెప్తాను. ఇక నటుడిగా వస్తే సెట్లో మా ఇద్దరికీ పోటీ ఉంటుంది. ఎప్పుడైనా సమ ఉజ్జీతో తలపడేటప్పుడే మన బలాబలాలు తెలుస్తాయి అంటారు. అలాంటిదే ఈ సినిమాలో జరిగింది. ఈ సినిమా అంతా నేను చేసింది ఒక ఎత్తైతే ఆయన ఒక్క క్లైమాక్స్ లో చేసిన నటన ఒక ఎత్తు. దాంతో ఆయన ఫుల్ మార్క్స్ కొట్టేస్తాడు. ఆ సీన్ చేసేటప్పుడు ఆయన నటన చూసి నేను సెట్ నుంచి పక్కకి వెళ్లి నాకు నేనే ధర్యం చెప్పుకొని వచ్చి ఆయనతో పోటీపడి ఆ సీన్ చేసాను. నన్ను నేను రీ ఇన్వెంట్ చేసుకునే అవకాశం ఈ సినిమాలో దక్కింది. అలాగే ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను.

ప్రశ్న) ‘ఎర్రబస్సు’ సినిమా కోసం దాసరితో కలిసి పనిచేసారు. మీరు దాసరి గారిని ఒక నటుడిగా, ఒక దర్శకుడిగా ఆయన టాలెంట్ గురించి చెప్పాలంటే ఏమి చెప్తారు.?

స) డైరెక్టర్ గా దాసరిగారు ఎప్పుడో ట్రెండ్ సెట్ చేసారు. ఫ్యామిలీ జోనర్ లో ఆయన హిస్టరీ క్రియేట్ చేసారు. ఆయన జోనర్ ని ఇప్పటికీ ఎవరూ టచ్ చేయలేకపోతున్నారు. ఒక డైరెక్టర్ గా ఆయనకున్న క్లారిటీ ఎవ్వరిలో చూడలేదు. ఇంతకన్నా డైరెక్టర్ గా అయన గురించి చెప్పలేను. ఇక నటుడిగా అంటే సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఆయన నటన, దర్శకత్వం గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్పడానికి నా అనుభవం సరిపోదు.

ప్రశ్న) ‘ఎర్రబస్సు’ తెలుగు వెర్షన్ లో చేసిన మార్పులేమిటి.? అలాగే మీ పరంగా ఈ సినిమాకి మేజర్ హైలైట్స్ ఏమవుతాయి.?

స) చాలా మార్పులు చేసాము. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా క్లైమాక్స్ ని మార్చాము. తమిళంకి తెలుగుకి ఉన్న మేజర్ చేంజ్ అంటే దానికన్నా ఇందులో నటీనటుల యాక్టింగ్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇక హైలైట్స్ అంటే చివరి 20 నిమిషాలు ఎక్స్ట్రార్డినరీ గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు.

ప్రశ్న) గత సినిమాల కంటే మీరు మూవీలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మీ పాత్ర గత సినిమాలకంటే ఎంత డిఫరెంట్ గా ఎర్రబస్సులోఉంటుంది.?

స) అవును మీరన్నట్టు లుక్ పరంగా చాలా స్టైలిష్ గా కనిపిస్తాను. అలాగే ఈ సినిమాలో నేను ఎర్రబస్సులో చేసిన పాత్రకి గత సినిమాలకి చాలా తేడా ఉంటుంది. ఇందులో నేను తాతయ్య దగ్గర పెరిగే మనవడిగా కనిపిస్తాను. ముఖ్యంగా ఒక ప్రేమికురాలు – తాతయ్య ప్రేమల మధ్య నలిగిపోతూ ఉండే పాత్ర. నటనకి ఎంతో స్కోప్ ఉన్న పాత్ర. ఇక నేను ఎలా చేసాను అనేది ప్రేక్షకులే చూసి చెప్పాలి.

ప్రశ్న) ఈ సినిమా చేస్తున్న టైంలో మీకు బాగా కష్టంగా అనిపించిన సీన్స్ ఏమున్నాయి.?

స) సినిమాలో అక్కడక్కడా కొన్ని కామెడీ సీన్స్ కష్టంగా అనిపించాయి. ఎందుకంటే కొన్ని కామెడీ సీన్స్ లో ఓవరాక్ట్ చెయ్యకూడదు అలాగే ఫన్నీగాను ఉండాలి. అలాంటి కాస్త కేర్ తీసుకొని చేసాం. వీటన్నిటికంటే క్లైమాక్స్ సీన్ చెయ్యడం చాలా టఫ్ గా ఫీలయ్యాను.

ప్రశ్న) దేవకట్టాతో చేస్తున్న సినిమా మరియు మీ ప్రొడక్షన్ లో చేస్తున్న సినిమాల గురించి చెప్పండి.?

స) దేవకట్టా తో కలిసి చేస్తున్న తమిళ రీమేక్ కి సంబదించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. మరో సినిమా గురించి త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ఇకపోతే ‘సింగం 123’ నిర్మిస్తున్నాను. సంపూర్నేష్ బాబులోని సరైన యాంగిల్ ని ఎవరూ వాడుకోలేకపోతున్నారు. అతని టాలెంట్ ని నేను ఈ సినిమాలో చూపించబోతున్నాను.

ప్రశ్న) ప్రస్తుతం కొంత మంది నుంచి దాసరి గారు ఒకప్పటి ట్రెండ్ కి సరిపోతారు, ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు సినిమా చెయ్యలేరు అనే వార్తలు వినిపిస్తుంటాయి. వీటిపై మీ కామెంట్.?

స) ఈ విషయంలో ఒకటే చెబుతాను.. మనం యుగాల నుండి అన్నం తినే బతుకుతున్నాం, ఇప్పుడు అదే తిని బతుకుతున్నాం. క్రియేటివిటీ మరియు టాలెంట్ అనేది కూడా అంతే. ఎందుకంటే క్రియేటివిటీ, టాలెంట్ కి ఇంత జీవితకాలమే అనేది ఉండదు. దాసరి గారి లాంటి జీనియస్ టాలెంట్ కి, క్రియేటివిటీ కి కూడా ఎండ్ లేదు. నా పరంగా నేను దాసరి నారాయణరావు ని హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క్లింట్ ఈస్ట్ వుడ్ తో పోల్చుతాను. ఎందుకంటే క్లింట్ ఈస్ట్ వుడ్ దాసరి కంటే 10 ఏళ్ళు పెద్ద కానీ ఇప్పటికీ సినిమాలు చేస్తూ, నటిస్తూ ఉన్నాడు. దాసరి గారు కూడా అంతే..

ప్రశ్న) మనం ఎన్ని అనుకున్న సినిమా ఫైనల్ రిజల్ట్ చెప్పేది ప్రేక్షకులే, అది పక్కన పెడితే.. ఈ సినిమా పరంగా మీకు అవార్డ్స్ ఏమన్నా వస్తాయని అనుకుంటున్నారా.?

స) నాకు అవార్డ్స్ మీద నమ్మకం లేదు. అవార్డ్స్ వస్తేనే గ్రేట్ యాక్టర్ అనేది నేను నమ్మను. కావాలంటే అవార్డు వచ్చిన ఏ నటుడినైనా నా ముందు పెట్టండి తన కంటే నేను బాగా చెయ్యగలనని నిరూపిస్తాను. ఎందుకంటే అది నా మీద నాకున్న కాన్ఫిడెంట్. ఒకవేళ నేను నిరూపించుకోలేకపోతే నేను చెప్పింది తప్పు అని ఒప్పుకుంటాను. నా యాక్టింగ్ మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది. ఉదాహరణకి వరల్డ్ కప్ గెలిస్తేనే సచిన్ గ్రేట్ ప్లేయర్ కాదు.. గెలవకపోయినా సచిన్ ఈస్ గ్రేట్ ప్లేయర్.

ప్రశ్న) ‘ఎర్రబస్సు’ చూడాలనుకునే ఆడియన్స్ కి మీరేమి చెబుతారు.?

స) ప్రతి ఒక్క ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా ‘ఎర్రబస్సు’. ప్రతి ఒక్కరూ మన పెద్దవారిని లైట్ గా తీసుకుంటూ ఉంటాము. అలా లైట్ గా తీసుకుంటే ఏమి జరుగుతుంది.? వాళ్ళు మనం కోసం ఏమేమి త్యాగం చేస్తారు అనేది ఇందులో చూపించాం. నాకు తెలిసి ఇలాంటి సినిమాని ఇంగ్లీష్ లో తీసే సంస్థ ఒక్కటే అదే డిస్నీ. డిస్నీ ఫిల్మ్ ఫార్మాట్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ గుడ్ కామెడీ మరియు ఫీల్ గుడ్ మూవీస్. డిస్నీ వాళ్ళ సినిమా ఫార్మాట్ లా ‘ఎర్రబస్సు’ ఉంటుంది.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి మంచు విష్ణు అనుకున్నట్టే ‘ఎర్రబస్సు’ పెద్ద హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము…

CLICK HERE FOR ENGLISH INTERVIEW

Exit mobile version