సమీక్ష : ఎర్రబస్సు – ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే మూవీ.!

Erra-Bus_review విడుదల తేదీ : 14 నవంబర్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : దాసరి నారాయణరావు
నిర్మాత : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రి
నటీనటులు : దాసరి నారాయణరావు, మంచు విష్ణు, కేథరిన్…


దర్శకరత్న దాసరినారాయణరావు తన 151వ సినిమాగా దర్శకత్వం వహించిన సినిమా ‘ఎర్రబస్సు’. తమిళంలో విజయం సాధించిన ‘మంజపై’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు విష్ణు, కేథరిన్ ట్రేస హీరోయిన్స్ గా నటించారు. దాసరి దర్శకత్వ బాధ్యతలతో పాటు మంచు విష్ణుకి తాతయ్య పాత్రలో కనిపిస్తాడు. మొదటిసారి దాసరి విష్ణు కాంబినేషన్ లో వచ్చిన తాతా మనవళ్ళ కాన్సెప్ట్ ఎర్రబస్సు ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది మనం ఇప్పుడు చూద్దాం…

కథ :

రాజేష్(మంచు విష్ణు) హైదరబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడమే రాజేష్ లక్ష్యం. తను అమెరికా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్న టైంలో డాక్టర్ రాజీ(కేథరిన్) ని చూసి ప్రేమలో పడతాడు. కొద్ది రోజులకి రాజీ కూడా రాజేష్ ని ప్రేమిస్తుంది. అ టైంలోనే రాజేష్ అనుకున్నట్టుగానే మరో మూడు నెలల్లో అమెరికా వెళ్లాలనే ఆఫర్ వస్తుంది.

కట్ చేస్తే చిన్నప్పటి నుంచి రాజేష్ ని తన తాతయ్య నారాయణరావు అలియాస్ బుచ్చితాత(దాసరి నారాయణరావు) పెంచి ఉంటాడు. రాజేష్ కి తాతయ్య అంటే ప్రాణం. మరో మూడు నెలల్లో ఎలాగో యుఎస్ వెళ్ళిపోతున్నాం అందుకే తాతయ్యని విలేజ్ నుండి సిటీకి తీసుకొచ్చి సంతోషంగా ఉండేలా చూసుకోవాలని అనుకుంటాడు. అనుకున్నట్టుగానే తాతయ్యని రాజేష్ సిటీకి తీసుకొస్తాడు. కానీ తాతయ్య సిటీకి వచ్చినప్పటి నుండి రాజేష్ కి కష్టాలు మొదలవుతాయి. తన తాతయ్య వల్ల రాజేష్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి.? ఆ ఇబ్బందుల వల్ల రాజేష్ తన లైఫ్ లో ఏమేమి కోల్పోయాడు.? ఈ సమస్యల వల్ల రాజేష్ కి తాతయ్యకి మధ్య జరిగిన సంఘర్షణ ఏమిటి.? అనేది మీరు వెండితెరపై చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

‘ఎర్రబస్సు’ సినిమాకి ప్రధాన బలం నటీనటుల పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. ముందుగా దాసరి నారాయణరావు గురించి చెప్పాలి.. ముందుగా దాసరి లాంటి సీనియర్ నటుడు, దర్శకుడు గురించి నేను పెద్దగా చెప్పడానికి ఏమీ ఉండదు. ఈ సినిమా విషయానికి వస్తే దాసరి నారాయణరావు ఈ వయసులో కూడా చాలా సెటిల్ గా పెర్ఫార్మన్స్ చేసాడు. తన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఫస్ట్ హాఫ్ లో తన పాత్రతో అక్కడక్కడా నవ్విస్తే సెకండాఫ్ లో తన ఎమోషనల్ సీన్స్ లో ఆడియన్స్ చేత కంటతడి పెట్టించాడు. ఇక మంచు విష్ణు చేసింది చిన్న పాత్రనే చెప్పాలి. ఎందుకంటే ఈ కథ మొత్తం హీరో అయిన విష్ణు కంటే దాసరి పాత్ర చుట్టూనే తిరుగుతుంది. కానీ ఉన్నంతలో ప్రతి సీన్ లోనూ దాసరితో పోటీపడి చేసారు. విష్ణు ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు పైకి ఎక్కాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ మరియు దాసరితో వచ్చే కాంబినేషన్ సీన్స్ సూపర్బ్ గా చేసాడు. అన్నిటికంటే మించి తన పాత్ర చుట్టూ కథ తిరగకపోయినా ఇలాంటి సినిమాని ఒప్పుకొని చేసినందుకు విష్ణుని మెచ్చుకోవాలి.

బాగా పొగరున్న గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కేథరిన్ ట్రేస కనిపించింది. ఆ పాత్రకి తను పూర్తి న్యాయం చేసింది. అలాగే ఈ సినిమాలో కేథరిన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది. వీరందరి తర్వాత పెర్ఫార్మన్స్ పరంగా చెప్పుకోవాల్సిన నటీనటులు ఎవరూ లేరు కావున వాళ్ళ గురించి చెప్పడం లేదు. ఇకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ బాగుంటుంది. మొదట్లో విష్ణు – కేథరిన్ ల లవ్ ట్రాక్ బాగుంటుంది. అలాగే ఇంటర్వల్ ఎపిసోడ్ బాగుంది. ఇకపోతే సెంటిమెంట్ క్లైమాక్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది. క్లైమాక్స్ ఎపిసోడ్ లో విష్ణు – దాసరిలు పోటీపడి నటించారు. ప్రస్తుత జెనరేషన్ లో ఎవరన్నా తమ తాతయ్యలతో మంచి కనెక్షన్ ఉంటే వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పాల్సింది.. ఈ సినిమా రన్ టైం. తమిళంలో ఈ సినిమాని చాలా సింపుల్ గా కేవలం 130 నిమిషాల్లో చెప్పేయడం వల్ల మరియు అలాంటి కాన్సెప్ట్ లు వారికి కాస్త కొత్త కావడం వలన అక్కడి ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. మన తెలుగుకి వచ్చే సరికి నటీనటుల ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పాత్ర రన్ టైంని పెంచేశారు. దానివల్ల 130 నిమిషాల సినిమా కాస్త 158 నిమిషాలు అయ్యింది. దాంతో ఆడియన్స్ చాలా చోట్ల బోర్ ఫీలవుతారు. రన్ టైం పెంచాలనే ఉద్దేశంతో కథలో బ్రహ్మానందం పాత్రని దూర్చడం జరిగింది. ఆ పాత్ర ఆడియన్స్ ని నవ్విస్తుంది అనుకున్నారు కానీ బ్రహ్మానందం ట్రాక్ నవ్వు తెప్పించకపోగా బాగా చిరాకు తెప్పిస్తుంది. ఇలానే చాలా సీన్స్ ని పెంచేశారు, అవి సినిమాకి పెద్ద ఉపయోగపడలేదు. ఇదొక సెంటిమెంట్ సినిమా కావడం వలన ఎప్పటిలానే లాజికల్ గా చాలా మిస్టేక్స్ కనిపిస్తాయి.

ఇకపోతే సినిమాలో చాలా పాత్రలకు సరైన ప్రారంభం, పరిచయం ఉండదు. కానీ చివర్లో మాత్రం అందరూ దాసరి పాత్రకి కనెక్ట్ అవుతారు. ఒకరు ఒకరితో కనెక్ట్ అవ్వాలి అంటే వారిద్దరి మధ్య ఏదో ఒక ఎమోషన్ తో లింక్ స్టార్ట్ అవ్వాలి అది కోపం అయినా లేదా ప్రేమ అయినా.. కానీ ఇందులో చాలా పాత్రలు ఎందుకు దాసరి పాత్రతో కనెక్ట్ అయ్యాయో సరిగా చూపించలేదు. ఉదాహరణకి.. గర్భంతో ఉండే ఓ లేడీ పాత్రకి – దాసరి పాత్రకి మధ్య ఎలాంటి సీన్ ముందు ఉండదు, కానీ ఒకరోజు తను దాసరితో సొంత తాతయ్యలాగా మాట్లాడుతుంది. ఆయనేమో శ్రీమంతం కూడా చేసేస్తాడు. చూసే ఆడియన్స్ సడన్ గా అసలు ఈ పాత్ర ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారు. సెకండాఫ్ పూర్తిగా ఎమోషనల్ గానే సాగడం వలన క్లైమాక్స్ వరకూ కాస్త బోరింగ్ గా సాగుతుంది. ఇకపోతే చివరి నిమిషంలో తెలుగు ఆడియన్స్ కి పెద్దగా నచ్చని విధంగా ముగించడం కాస్త నిరాశ పరుస్తుంది. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ఆడియన్స్ కి కామెడీ కోడా లేకపోవడం వలన సినిమాకి పెద్దగా కనెక్ట్ కారు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా కథ విషయం గురించి చెబుతా.. తమిళం నుంచి అలానే తీసుకున్న కథలో ఎలాంటి మార్పులు చేయకుండా ఇంకా ఎక్కువ సీన్స్ ని జత చేసారు. చెప్పాలంటే ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. ఇక దర్శకరత్న దాసరి స్క్రీన్ ప్లే – మాటలు – నిర్మాత – దర్శకత్వ విభాగాలను డీల్ చేసాడు. స్క్రీన్ ప్లే – తమిళంలో లానే ఉంటుంది, ఎక్కడా పెద్దగా మార్పులు చేయలేదు. మన తెలుగుకి తగ్గట్టు మార్పులు చేసుకొని ఉంటే బాగుండేది. మాటలు – కథకి తగ్గట్టు ఉన్నాయి. నిర్మాణం – సినిమా చూడటానికి చాలా రిచ్ గా ఉండడమే కాకుండా విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇకపోతే దర్శకుడిగా దాసరి మరోసారి పర్ఫెక్ట్ గా సెంటిమెంట్ సినిమాని పర్ఫెక్ట్ గా డీల్ చేసాడు. దర్శకుడిగా చేసిన తప్పు ఏమిటి అంటే ఇప్పటి ఆడియన్స్ కి కమర్షియల్ అంశాలు ఇవ్వాలని ఇలాంటి సెంటిమెంట్ సినిమాలో ఎక్స్ట్రా సీన్స్ జత చేసి దెబ్బతిన్నాడు.

ఇకపోతే అంజి సినిమాటోగ్రఫీ సినిమాకి చాలా హెల్ప్ అయ్యింది. విజువల్స్ అన్ని చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ లో భాగంగా కత్తెరకి పనిచెప్పి బోరింగ్ సీన్స్ ని కట్ చేసి పారేయాల్సింది. ఇక చక్రి అందించిన పాటలు ఓకే, కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సీన్స్ కి కావాల్సినట్టు లేదు. చాలా సెంటిమెంట్ సీన్స్ లో లౌడ్ మ్యూజిక్ ఇచ్చి కాస్త ఇబ్బంది పెట్టాడు.

తీర్పు :

తాత మనవళ్ళ మధ్య ఉండే అనుభందం గురించి చెప్పే కాన్సెప్ట్ తో వచ్చిన ‘ఎర్రబస్సు’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. దర్శకరత్న దాసరి నారాయణరావు ఇప్పటి జెనరేషన్ మరిచిపోతున్న మానవతా విలువల్ని, తాత – మనవళ్ళ అనుబంధాన్ని చాలా బాగా చూపించాడు. దాసరి నారాయణరావు, మంచు విష్ణు, కేథరిన్ ల పెర్ఫార్మన్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్స్ అయితే కామన్ ఆడియన్స్ కోరుకునే కామెడీ లేకపోవడం, రన్ టైం చాలా ఎక్కువ అయిపోవడం మరియు లాజికల్ గా చాలా తప్పులు ఉండడం ఈ సినిమాకి పెద్ద మైనస్.. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కోరుకునే వారికి ఈ సినిమా పెద్దగా నచ్చకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమా ‘ఎర్రబస్సు’.

123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version