సమీక్ష : పెసరట్టు – బాగా మాడింది, తినడం కష్టమే..

 Pesarattu-movie-review విడుదల తేదీ : 6 ఫిబ్రవరి 2015
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5
దర్శకత్వం : కత్తి మహేష్
నిర్మాత : డి.జి.సుకుమార్‌, కిరణ్‌ గూడుపల్లి, శ్రీనివాస్‌ గునిశెట్టి, ఏడుపుగంటి శేషగిరి, స్వప్నరాణి తక్కెళ్ళని
సంగీతం : ఘంటసాల విశ్వనాధ్
నటీనటులు : నందు, నిఖిత నారాయణ, సంపూర్నేష్ బాబు


నందు, నిఖిత నారాయణ జంటగా కత్తి మహేష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పెసరట్టు’. సంపూర్నేష్ బాబు అతిధి పాత్రలో నటించారు. తెలుగులో తెరకెక్కిన తొలి క్రౌడ్ ఫండెడ్‌ మూవీగా నిర్మాతలు ప్రచారం చేస్తున్నారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ ఒక్కసారి చూడండి.

కథ :
అమెరికా నుండి పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఎన్నారై హరినాథ్ రావు అలియాస్ హ్యారికు (నందు).. భావనతో (నిఖిత నారాయణ) పెళ్లి నిశ్చయమవుతుంది. నిశ్చితార్ధం ఇంకొన్ని క్షణాలలో జరుగుతుంది అనగా.. భావన ఇంట్లో కనిపించకుండా పోతుంది. ఆమె తండ్రి చక్రపాణి మరియు ఇతర కుటుంబ సభ్యులు కంగారు పడతారు. గతంలో భావన ఇద్దరు యువకులను ప్రేమించిందని.. వారు పెళ్ళి చేసుకుంటాం అనేసరికి తెగతెంపులు చేసుకుందని కుటుంబ సభ్యులకు తెలుస్తుంది.

భావనకు ప్రేమ, పెళ్లిపై ఎటువంటి అభిప్రాయం ఉంది..? అసలు భావన ఎక్కడికి వెళ్ళింది..? నిశ్చితార్ధం జరిగే సమయానికి పెళ్లి కూతురు మండపంలోకి వచ్చిందా..? లేదా..? నిశ్చితార్ధం, పెళ్లికి ‘పెసరట్టు’తో లింక్ ఏంటి..? అనే ప్రశ్నలకు సమాధానం సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :

బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు అతిథి పాత్రలో కనిపించింది కాసేపే అయినా.. ఆయన గెస్ట్ అప్పియరెన్స్, నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది. సినిమాటోగ్రాఫర్ కమలాకర్ ప్రతి ఫ్రేమును అందంగా తీర్చిదిద్దాడు. సినిమా అంతా ఒకే ఇంటిలో జరిగింది. అయినా.. ప్రేక్షకుల మదిలో ఆ భావన ఎక్కడా రానివ్వలేదు. ప్రతి సన్నివేశంలో లైటింగ్, ఫ్రేమింగ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా ప్రారంభంలో వచ్చే టైటిల్ సాంగ్ బాగుంది. హీరో హీరోయిన్లు నందు, నిఖిత నారాయణలు పాత్రల పరిధి మేరకు నటించారు.

మైనస్ పాయింట్స్ :

కథ, మాటలు, కథనం, దర్శకత్వం.. నాలుగు విభాగాలలో ఏ ఒక్కటి ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేవు. ముఖ్యంగా సినిమా ప్రారంభం నుండి ప్రతి సన్నివేశంలో మాటల ప్రవాహం, ఆనకట్ట తెంచుకున్న గోదారిలా ప్రేక్షకుల మీదకు వరదలా వచ్చి పడింది. ప్రేక్షకులు కళ్ళు మూసినా తెరపై ఎం జరుగుతుందో.. ఈజీగా చెప్పేయొచ్చు. విజువల్ గా అర్ధమయ్యే సన్నివేశాలను సైతం మాటల్లో చెప్పాలని దర్శక రచయితలు ప్రయత్నించారు. దీని ఫలితంగా.. అనవసరపు సంభాషణలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్ లలో కొత్త టెక్నాలజీ ఉపయోగించినట్టు ఉన్నారు. దిక్కులు పిక్కటిల్లేలా అనే సామెత చెప్పినట్టు థియేటర్లో ప్రేక్షకుల చెవులు భరించలేని రీతిలో శబ్ద కాలుష్యం సృష్టించింది.

ఇక ‘పెసరట్టు’ టైటిల్ కు దర్శకుడు ఇచ్చిన జస్టిఫికేషన్ మరీ సిల్లిగా ఉంది. మొదటి నుండి ప్రేమ, పెళ్లిలపై హీరోయిన్ ఓ అభిప్రాయానికి రాలేక సందిగ్ధంలో ఉంటుంది. పతాక సన్నివేశాలలో సైతం ప్లేటులో ‘పెసరట్టు’ తింటూ కూర్చున్న ఆమెలో అదే ధోరణి కనపడుతుంది. ఇంటర్వెల్ తర్వాత హీరోయిన్ స్నేహితురాళ్ళతో కలిసి మందు పార్టీ చేసుకునే కీలక సన్నివేశంలో సగటు అమ్మాయిల అభిప్రాయాల గురించి చర్చించారు. ఇక్కడ మోడరన్ కల్చర్ ఎక్కువ, మెయిన్ మేటర్లో క్లారిటీ తక్కువ అయ్యింది. దర్శకుడు ఆమెకు ఓ దారి చూపడంలో విఫలం అయ్యాడు.

దర్శకుడు ‘పెసరట్టు’ సినిమా ద్వారా ఎం చెప్పాలనుకున్నాడో..? మెజారిటీ ప్రేక్షకులకు అర్ధం కాలేదు. మన వివాహా వ్యవస్థ, ప్రేమ, పెళ్లి, సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూపాలని ప్రయత్నించినట్టు ఉన్నారు. సామెతలు ఎక్కువ చెప్పడం, అనవసరపు సంభాషణలు, హీరో హీరోయిన్లు మినహా ఇతర పాత్రధారులు అతి చేయడంతో అసలు సినిమా థీమ్ మరుగున పడిపోయింది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ బాగుందని ముందుగా చెప్పుకున్నాం. తర్వాత ఇంటి ప్రాంగణాన్ని అద్బుతంగా తీర్చిదిద్దిన కళా దర్శకుడిని (ఆర్ట్ డైరెక్టర్) మెచ్చుకోకుండా ఉండలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఘంటసాల విశ్వనాధ్ సంగీతంలో ఆకట్టుకునే బాణిలు లేవు. నేపధ్య సంగీతంలో హోరు ఎక్కువయింది. బహుశా సౌండ్ మిక్సింగ్ సమస్య అయ్యిండొచ్చు.

‘కత్తి’ మహేష్ దర్శకత్వంలో క్లారిటీ లోపించింది. స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేయలేకపోయింది. సినిమాలో ప్రతి ఒక్కరికి యునీక్ క్యారెక్టరైజేషన్ ఇవ్వాలని ప్రయత్నించారు. కంగారు పడేవాడు ఒకడైతే, ఎంతసేపు ఫోనుకు అంకితమైన వ్యక్తి మరొకరు, అసందర్భంగా సామెతలు చెప్పే వ్యక్తి ఇంకొకరు. ఇలా సిల్వర్ స్క్రీన్ పై ఒకే సన్నివేశంలో భిన్నమైన వ్యక్తులు చేరి ‘పెసరట్టు’ను కిచిడీ చేసి పారేశారు. దాంతో తినడానికి ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు.

తీర్పు :

‘పెసరట్టు’ అంటూ నోరూరించిన కత్తి మహేష్ & కో.. ఈ వీకెండ్లో ప్రేక్షకులకు మంచి బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. సంపూర్నేష్ బాబు గెస్ట్ అప్పియరెన్స్, సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. కథ, కథనం, దర్శకత్వం ఆకట్టుకునేలా లేవు. ప్రతి సన్నివేశంలో అనవసరపు సంభాషణలు ఎక్కువ కావడంతో.. మంట ఎక్కువ పెట్టిన స్టవ్ మీద వదిలేసిన ‘పెసరట్టు’లా సినిమా మాడిపోయింది. తినడం కష్టమే.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
123తెలుగు టీం

Exit mobile version