సమీక్ష : పంచమి – పరమ బోరింగ్!

Surya vs Surya

విడుదల తేదీ : 6 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

దర్శకత్వం : సుజాత బౌరియా

నిర్మాత : డి. శ్రీకాంత్

సంగీతం : శ్రీకోటి

నటీనటులు : అర్చన…

ఈ సారి హోళీ పండుగను క్యాష్ చేసుకోవడానికి ఒకరోజు ముందే(నిన్న) క్రేజున్న సినిమాలు ‘సూర్య vs సూర్య’, ‘అనేకుడు’ విడుదలయ్యాయి. ఇక ఈ రోజు ఏకంగా మూడు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి. ఆ సినిమాల్లో ఒకటే.. ‘పంచమి’. నటి అర్చన ఏకపాత్రాభినయం చేయగా.. సుజాత బౌరియా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం..

కథ :

గ్లోబల్ ఫోటోగ్రఫీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలన్నది పంచమి (అర్చన) ఆశయం. ఆ క్రమంలోనే వెలువడ్డ పోటీ ప్రకటనతో తన ఆశయ సాధన వైపు అడుగులు వేస్తుంది. ప్రకృతి అందాల్ని తన కెమెరాలో బంధించి, విజేతగా నిలవాలని ఒక అడవికి బయలుదేరి తన పని మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో విచిత్ర అనుభవాలకు లోనవుతుంది. ‘మనిషి చావనేదే లేకుండా జీవించడం ఎలా..?’ అన్న ప్రశ్న ఎదురవ్వడం, దానికి సమాధానాలు వెతికే క్రమంలో పంచమి ఎదుర్కొన్న కష్టాలు, సవాళ్ళే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవాలంటే.. ఒకే ఒక్క పాత్రతో సినిమాని నడపాలనుకోవడాన్ని చెప్పుకోవచ్చు. ఓ రకంగా ఇది పెద్ద ప్రయోగమే! సినిమాలో ఉన్నది ఒకే ఒక పాత్ర.. అదే పంచమి. ఆ పాత్రకు న్యాయం చేసే క్రమంలో అర్చన తన శక్తిమేర ప్రయత్నించారు. కొన్ని చోట్ల పేళవమైన నటనను ప్రదర్శించినా.. కొన్ని అడ్వెంచర్ దృశ్యాల్లో ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగా పాటల్లో అందాల ప్రదర్శన ఆకట్టుకుంటుంది. పేళవమైన ఫస్టాఫ్ తర్వాత వచ్చే సెకండాఫ్ కొంత మేరకు ఫరవాలేదనిపిస్తుంది. చివర్లో వచ్చే ఆలోచింపదగ్గ విషయం కొంతవరకు బాగుంది. రచయిత, నటుడు అయిన తనికెళ్ళ భరణి ఈ సినిమాకి అందించిన వాయిస్ ఓవర్ గొప్ప రిలీఫ్. అలాగే సెకండాఫ్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ప్రయోగంతో కూడిన ఆలోచన ఎంత బాగుందో.. ఆ ఆలోచనను కథగా చెప్పే క్రమం అంట బాలేదు. మొదటి పది నిమిషాలకే కథాంశం తెలిసిపోగా, ఇక ఇంటర్వెల్ వరకూ చెప్పడానికి ఏమీ మిగల్లేదు. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలన్నీ వృథానే! ఈ సన్నివేశాలన్నీ ఆసక్తి కలిగించకపోగా, విసుగూ, అసహనం కలిగిస్తాయి. ఇంటర్వెల్‌లో చిన్న విషయాన్ని జొప్పించడం చూస్తే.. ఇంతవరకూ నడిపింది.. ఇందుకా? అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కూడా సినిమా గొప్పగా ఉండే అవకాశాలేవీ లేవని ముందే తెలిసిపోతుంది. ఇలాంటి ఒక దారీతెన్నూ లేని ఫస్టాఫ్ తర్వాత వచ్చే సన్నివేశాల్లో కొంత అడ్వెంచర్ జొప్పించే ప్రయత్నం చేశారు. అది ఒకింత ఉపశమనమే అయినా.. అసలెందుకీ జర్నీ అనిపించక మానదు. క్లైమాక్స్ సాదాసీదాగా ముగిసిపోయింది.

కథా, కథనంలో కనీస మెరుపులు కూడా లేవు. ఉన్న ఒకే ఒక్క పాత్రకు కూడా ఒక ఔచిత్యాన్ని, పాత్ర బలాన్ని చూపగలిగే సన్నివేశం ఒక్కటీ లేదు. అర్చన అందంతో ఆకట్టుకున్నా, దారీతెన్నూ లేని పాత్రలో ఆమెకు నటించడానికి పెద్దగా ఆస్కారం లేకుండా పోయింది.

సాంకేతిక విభాగం :

కథా, కథనాల్లో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకత్వంలోనైనా ప్రతిభ చూపగలిగే సన్నివేశం ఒక్కటీ లేదు. దర్శకులు సుజాత బౌరియా ఒక ప్రయోగాన్ని తెరకెక్కించే క్రమంలో ఆదిలోనే చేతులెత్తేశారు. ఒకే ఒక్క పాత్ర ఉన్న సినిమాలో సంభాషణలు ఏముంటాయ్ ? అనుకున్నారో ఏమో.. అర్చన తనలో తానే మాట్లాడుకునేలా పాత్రను రూపొందించారు. ఇది ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. సినిమాటోగ్రఫీ నాసిరకంగా ఉంది. ఫ్రేమింగ్ ఎక్కడా నిలకడగా ఉన్న దాఖలాలు లేవు. ఎడిటింగ్ మరీ నాసిరకంగా ఉంది. ఇంకా బేసిక్స్ దగ్గరే ఆగిపోయారా ? అన్నట్టుంది ఎడిటింగ్. విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అయితే.. లో బడ్జెట్ సినిమాలో అంతకుమించి విజువల్స్‌ని ఊహించలేం. పాటలు ఒక్కటీ వినసొంపుగా లేవు. విజువల్స్‌తో కలిసి చూసినప్పుడు కాస్త ఆకట్టుకున్నా రణగొణ ధ్వనులే ఎక్కువయ్యాయ్! నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా లేదు. టెక్నికల్‌గా చూసుకుంటే విజువల్స్ నాసిరకంగా ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో కూడా చక్కటి విజువల్స్‌ని తెరకెక్కించవచ్చు. ఆ నేర్పును ఇక్కడ విస్మరించినట్టే కనిపిస్తుంది.

తీర్పు :

ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రయోగం పేరుతో ఎటువంటి సినిమా చేసినా చెల్లుతుందనుకొని రూపొందే చాలా చిత్రాల కోవలోకి వచ్చే సినిమా పంచమి. అర్చన అందచందలూ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. దారితెన్నూ లేని కథలతో, ఎప్పుడు వచ్చాయో.. ఎప్పుడు వెళ్ళాయో కూడా తెలియని సినిమాల జాబితాలో చేరే సినిమా.. పంచమి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version