‘స్వామిరారా’ సినిమాతో తెలుగులో క్రైమ్ కామెడీ సినిమాలకు ఒక కొత్త దారిని ఏర్పరచిన దర్శకుడు సుధీర్ వర్మ. తాజాగా తన రెండో ప్రయత్నానికి కూడా క్రైమ్ కామెడీ నేపథ్యాన్నే ఎంచుకున్నాడు. లవర్ బాయ్ నాగ చైతన్యను ఓ దొంగతనాలు చేసే వ్యక్తిగా చూపెడుతూ సుధీర్ వర్మ తెరకెక్కించిన సినిమా ‘దోచేయ్’. భారీ అంచనాల మధ్య నిన్న (ఏప్రిల్ 24న) విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి స్పందననే రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్ వర్మతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ప్రశ్న) దొంగతనాల వైపే మీరు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టున్నారు?
స) (నవ్వుతూ..) నేను ఎక్కువగా క్రైమ్, దొంగతనాలకు సంబంధించిన డాక్యుమెంటరీలను చూస్తూంటా. అంత పెద్ద దొంగతనాలు చేశాక కూడా వాళ్ళెలా తెలివిగా తప్పించుకుంటారనేది నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. అవే నన్ను ఇన్స్‌పైర్ చేస్తూ ఉంటాయేమో! నాకు కూడా ఇలాంటి కథలను చెప్పడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
ప్రశ్న) ఈ సినిమాకు నాగ చైతన్యను హీరోగా పెట్టడానికి కారణం?
స) ‘స్వామిరారా’ విజయం సాధించిన తర్వాత నాగ చైతన్య తనతో ఓ సినిమా చేయమని ఆఫర్ ఇచ్చారు. ఆయన ఆఫర్ ఇచ్చిన కొన్నాళ్ళకు దోచేయ్ కథతో వెళ్ళి కలిశా. ఆయనకు ఈ కథ వెంటనే నచ్చేయడంతో సినిమా అలా సెట్స్‌పైకి వెళ్ళింది.
ప్రశ్న) ‘దోచేయ్’కి, ‘స్వామిరారా’కి దగ్గరి పోలికలు ఉన్నట్టున్నాయ్?
స) రెండూ ఒకే జానర్లో రూపొందిన సినిమాలు కావడంతో అలా అనిపిస్తుందేమో! అయితే దోచేయ్‌కి, స్వామిరారాకి ఎలాంటి సంబంధం లేదు. దోచేయ్ స్వామిరారా కంటే ఎక్కువ బడ్జెట్‌లో రూపొంది అన్ని కమర్షియల్ హంగులు కలగలిసిన సినిమా.
ప్రశ్న) కృతీ సనన్ క్యారెక్టర్‌ను కొంత బోల్డ్‌గా డిజైన్ చేశారే?
స) నేను బయట ఉన్నదే చూపించా. ప్రస్తుతం సమాజం చాలా స్పీడ్‌గా దూసుకెళుతోంది. దాంతో పాటే అమ్మాయిలూ మారిపోతున్నారు. అమ్మాయిలు సిగరెట్ తాగడమనేది ఇప్పుడు పెద్ద విషయమేమీ కాదు. అదే సినిమాలోనూ చూపించా.
ప్రశ్న) ఛేజ్ సీక్వెన్స్‌కు మంచి స్పందన వస్తోంది కదా? దాని గురించి చెప్పండి?
స) ఈ విషయంలో క్రెడిట్ మొత్తం బీవీఎస్‍ఎన్ ప్రసాద్ గారికే దక్కుతుంది. పీటర్ హెయిన్ సారథ్యంలో తెరకెక్కిన ఆ సీక్వెన్స్ రిచ్‌గానూ, స్టైలిష్‌గానూ ఉన్నాయ్. తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఆ సీక్వెన్స్ ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు.
ప్రశ్న) నాగచైతన్య పర్ఫామెన్స్ గురించి చెప్పండి?
స) నాగచైతన్య అద్భుతంగా నటించారనే చెప్పాలి. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. నాగచైతన్య తన స్టైల్‌తో క్యారెక్టర్‌కు డెప్త్ తీసుకొచ్చారు.
ప్రశ్న) ఈ సినిమాకు ఫన్నీ క్లైమాక్స్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది?
స) ఈ సినిమాలో హీరో ఓ మోసం చేసే వ్యక్తి. చివర్లో కూడా అతడే విలన్‌ను మోసం చేసేలా చూపిస్తే బాగుంటుందన్న ఆలోచనతో అలా చేశాం. క్లైమాక్స్‌లో పోసాని గారు చాలా బాగా నటించి మంచి క్రెడిట్ కొట్టేశారు.
ప్రశ్న) ఈ సినిమా చూసిన తర్వాత నాగార్జున ఏమన్నారు?
స) ఆయనకీ సినిమా చాలా బాగా నచ్చేసింది. తన ఎగ్జైట్‌మెంట్‌ని ఆపుకోలేక వెంటనే ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన నాకో అవకాశం కూడా ఇచ్చారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చి నేను దర్శకత్వం వహించాల్సి వస్తే.. నాకు అంతకన్నా ఏం కావాలి!
ప్రశ్న) ఇప్పటివరకూ అందుకున్న వాటిల్లో బెస్ట్ కాంప్లిమెంట్?
స) మాస్ మహారాజ రవితేజ నాకు ఫోన్ చేసి అభినందించారు. ఆయన అభినందనలు మంచి ఉత్తేజాన్ని ఇచ్చాయి.