విడుదల తేదీ : 2 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : రమేష్ అరవింద్
నిర్మాత(తెలుగు) : సి. కళ్యాణ్
సంగీతం : జిబ్రాన్
నటీనటులు : కమల్ హాసన్, పూజా కుమార్, ఊర్వశి, బాలచందర్, కె. విశ్వనాథ్…
విలక్షణ సినిమాలతో, విభిన్న పాత్రలతో దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న నటుడు కమల్ హాసన్. తాజాగా ఆయన నటించి, నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా ‘ఉత్తమ విలన్’. మొదట్నుంచీ ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఈ సినిమా విడుదల విషయంలోనూ అయోమయానికి గురైంది. నిన్నే (మే 1న) విడుదల కావాల్సిన ఈ సినిమా గందరగోళం మధ్య ఈ సాయంత్రం విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మరి ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..
కథ :
మనోరంజన్ (కమల్ హాసన్).. సినీ పరిశ్రమలో కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఓ సూపర్ స్టార్. ఓ మామూలు స్థాయి వ్యక్తిని నటుడు మనోరంజన్‌గా అతడి గురువైన దర్శకుడు కె. మార్గదర్శి (కె. బాలచందర్) తీర్చిదిద్దితే, అతణ్ణి నటుడి స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి తీసుకొచ్చేది నిర్మాత పూర్ణ చంద్రరావు (కె. విశ్వనాథ్). మనోరంజన్ కెరీర్ ప్రారంభంలో అతడి జీవితం మొత్తం పూర్ణ చంద్రరావు చేతుల్లోకి వెళ్ళిపోతుంది. తాను ప్రేమించిన యామినిని కాదని పూర్ణ చంద్రరావు కుమార్తె వరలక్ష్మి(ఊర్వశి)ని మనో పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. తాను సూపర్ స్టార్ అయిపోయే క్రమంలో వీటన్నింటినీ మరిచిపోయి సాఫీగా జీవితాన్ని వెళ్ళదీస్తున్న క్రమంలోనే మనోరంజన్ జీవితం ఊహించని మలుపు తీసుకుంటుంది.
బ్రెయిన్ ట్యూమర్‌తో తాను ఎక్కువకాలం బతకలేనన్న విషయాన్ని తెల్సుకొని చాన్నాళ్ళకు మళ్ళీ తన గురువును ఓ సినిమా చేసిపెట్టమని అడుగుతాడు మనోరంజన్. తెయ్యమ్ కళ నేపథ్యంలో మృత్యుంజయుడిగా పేరు తెచ్చుకున్న ఉత్తముడి కథే మనోరంజన్-మార్గదర్శిల సినిమా కథ. మనోరంజన్ కథతో సమాంతరంగా ఉత్తముడి కథ నడుస్తుంది. నిజ జీవితంలో మృత్యువుకు దగ్గరైన వ్యక్తి సినిమాలో మృత్యుంజయుడుగా నటించడం అతడికి ఎలాంటి అనుభూతినిచ్చింది? తాను మృత్యువుకు దగ్గరయ్యే క్రమంలో మనో జీవితంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయ్? చివరకు ఈ సినిమా కథ, నిజ జీవిత కథ ఎక్కడ ముగిసాయన్నదే ‘ఉత్తమ విలన్’ కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గురించి చెప్పుకోవాలంటే అది కమల్ హాసన్ అందించిన కథే అని చెప్పాలి. ఓ సూపర్ స్టార్ తన జీవితంలో ఎదుర్కొనే సంఘర్షణ, సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న సమయంలోనే ఓ ప్రాణాంతక వ్యాధితో బాధ పడడం, నిజ జీవితానికి భిన్నమైన ఓ పాత్రను చనిపోయే ముందు ఓ సినిమాలో చేయాల్సి రాయడం.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘ఉత్తమ విలన్’ కథను ఓ బలమైన కథగానే చెప్పుకోవాలి. రెండు విభిన్న కథలను సమాంతరంగా నడిపించడం, ఓ వైపు ట్రాజెడీని, మరోవైపు కామెడీని ఒకేసారి చెప్పే ప్రయత్నం చేయడం.. జీవితాన్ని ఓ సినిమాగా చెప్పేయడానికి కావాల్సిన సరుకు కథలో ఉంది.
నటీనటుల విషయానికి వస్తే.. మనోరంజన్‌గా, ఉత్తముడుగా రెండు భిన్నమైన పాత్రల్లో కమల్ ఒదిగిపోయాడనే చెప్పాలి. రెండు పాత్రల్లో గల ఔచిత్యాన్ని, స్ట్రగుల్‌ను ఒడిసిపట్టి తాను తప్ప ఇంకెవరూ ఆ పాత్రలను చేయలేరేమో అనేంత అద్భుతంగా నటించాడు. ఆండ్రియా, పూజా కుమార్‌ల పాత్రలను కథలో చెప్పడానికి వీలులేని బలమైన పాత్రలుగా చెప్పుకోవాలి. వారి వారి పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. ఊర్వశి, కె.విశ్వనాథ్, బాలచందర్.. ఇలా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ సరైన ప్రాధాన్యం కల్పించడం దర్శకుడి పనితనం కాగా ఆ పాత్రలను అంతే అద్భుతంగా పోషించడం ఆ నటీనటుల గొప్పదనం.
సినిమా పరంగా చెప్పుకుంటే.. ఫస్టాఫ్‌లోని మొదటి ముప్పై నిమిషాలను, సెకండాఫ్‌లోని చివరి ముప్పై నిమిషాలను సినిమాకు ప్లస్‌పాయింట్స్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఉత్తమ విలన్ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా కథను సినిమాగా మార్చే క్రమంలో జరిగిన భారీ తప్పిదాన్నే చెప్పుకోవాలి. కథగా చెప్పుకుంటే ‘ఉత్తమ విలన్’ ఎంత బాగుందో, సినిమాగా చూసినపుడు అంతే బలహీనంగా తయారైంది. సినిమాకు ప్రాణంగా చెప్పుకునే రెండు సమాంతర కథలను కలిపే క్రమం ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఎంతో హైప్ సృష్టించిన ఉత్తముడి కథకు ప్రాణమైన కామెడీ పూర్తిగా కొరవడింది. కథలో ఉన్న గొప్పదనం స్క్రీన్‌ప్లేలో కొరవడిన విషయం అడుగడుగునా తెలుస్తుంది. మెయిన్ ప్లాట్ అద్భుతంగా ఉంటే.. సబ్‌ప్లాట్ బలహీనంగా ఉంది. నిజంగా సబ్‌ప్లాట్ కనుక బలంగా ఉండి ఉంటే ఈ సినిమా క్లాసిక్ అయి ఉండేది.
సబ్‌ప్లాట్‌ను పక్కనబెడితే.. ఈ సినిమా రన్‌టైమ్ కూడా మైనస్ పాయింట్‌గానే చెప్పుకోవాలి. విసుగు పుట్టించే కొన్ని సన్నివేశాలు కథను డిస్టర్బ్ చేస్తుంటే.. ఈ రన్‌టైమ్ మరింత ఇబ్బందిగా తయారైంది. ప్రతిదీ డీటైల్‌గా చెప్పాలన్న ప్రయత్నంలో అనవసర సన్నివేశాలను పేర్చుకుంటూ పోవడం విసుగు పుట్టిస్తుంది.
ఇక సాధారణ ప్రేక్షకులు కోరుకునే ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాలో కొరవడింది. సబ్‌ప్లాట్‌లో దీన్ని సమర్ధవంతంగా పట్టుకొని ఉంటే సినిమాకు ఉపయోగపడేదే! సబ్‌ప్లాట్ మొత్తంలో గ్రిప్పింగ్ సన్నివేశాలు చాలా తక్కువ అనే చెప్పాలి.
సాంకేతిక విభాగం :
ముందుగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడి గురించి చెప్పుకుంటే.. రమేష్ అరవింద్‌కు ఓ గొప్ప సినిమా తీయడానికి సరిపడే బలమైన కథ, నటీనటులు, బడ్జెట్ ఇలా అన్నీ కలిసివచ్చాయి. వాటన్నింటినీ దర్శకుడు సరిగ్గా అందిపుచ్చుకొని సన్నివేశాల పరంగా చాలా బాగా తెరకెక్కించాడు. ఫిల్మ్‌మేకింగ్ టెక్నిక్స్ ద్వారా మాత్రమే చెప్పడానికి వీలయ్యే కొన్ని భావోద్వేగాలను ఈ సినిమా ద్వారా తెలుగు తెరపై చూడడం మనకో కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో అతిశయోక్తి లేదు.
అయితే సబ్‌ప్లాట్ విషయంలో ఏమాత్రం ఆలోచించి ఉన్నా.. సినిమా ఎక్కడో ఉండేది. సినిమాటోగ్రాఫర్ శాందత్ పనితనం సినిమా మూడ్‌ను కరెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. ఫ్రేంను కొన్ని చోట్ల నిలకడగా ఉంచడం, కొన్ని చోట్ల అతిగా కదపడం సినిమా ఎమోషన్‌ను క్యారీ చేసే ప్రయత్నమే అని చెప్పాలి. జిబ్రాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగానే కలిసి వచ్చే అంశం. అన్ని పాటలూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనే కలిసిపోయేలా రావడం ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్. ఆర్ట్ డైరెక్షన్ పనితనం చాలాచోట్ల అబ్బురపరుస్తుంది. ఎడిటింగ్ విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. క్రాఫ్ట్ ద్వారా సినిమా కథను చెప్పే ప్రయత్నం తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశం కాకపోయినా భవిష్యత్ మాత్రం అలాంటి సినిమాలదే!
తీర్పు :
ఓ బలమైన కథ, కమల్ హాసన్‌తో పాటు సినిమాలోని ప్రతి పాత్రా అద్భుతంగా నటించిన విధానం, రెండు విభిన్న కథలను సమాంతరంగా చెప్పే ప్రయత్నం, ఓ వైపు కామెడీ – మరోవైపు ట్రాజెడీని జీవితంతో ముడిపెట్టిన విధానం ఈ సినిమాకు ప్రధాన బలాలు. ఇక మెయిన్ ప్లాట్‌ను సబ్‌ప్లాట్‌తో కనెక్ట్ చేయడంలో తేలిపోవడం, సబ్‍ప్లాట్‌లోని ఆత్మను గాలికొదిలేయడం, లెంగ్తీ రన్‌టైమ్ ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఓ జీవితాన్ని సినిమాగా చెప్పేంత బలమున్న కథను అంతే బలంగా తెరపై ఆవిష్కరించడానికి కావాల్సిన ఎసెన్స్ ఏదో మిస్ చేసిన సినిమా ఉత్తమ విలన్. నిజంగానే ఆ ఎసెన్స్‌ను పట్టుకొని ఉంటే సినీ చరిత్రలో మర్చిపోలేని సినిమాల్లో ఒకటిగా నిలిచే సామర్థ్యమున్న సినిమాగా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. సినిమాకు ఆత్మ అయిన ఆ ఎసెన్స్‌నే మిస్ చేయడంతో గుర్తుంచుకోదగ్గ సినిమాగా కూడా మిగలలేకపోయింది ‘ఉత్తమ విలన్’.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం