విడుదల తేదీ : 8 మే 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ప్రసాద్ రామర్
నిర్మాత(తెలుగు) : ప్రకృతి
సంగీతం : సంతోష్ నారాయణ్
నటీనటులు : సిద్ధార్థ్, దీపా సన్నిధి..
సిద్ధార్థ్ హీరోగా ప్రసాద్ రమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఎనక్కుల్ ఒరువన్’. తమిళంలో మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ‘నాలో ఒకడు’ పేరుతో తెలుగులో డబ్ అయి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసియా’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. గత కొంతకాలంగా తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సిద్ధార్థ్‌కు ఈ సినిమా ద్వారా ఆ ఎదురుచూపులకు ఎండ్ పడుతుందా? లేదా.? అనేది చూద్దాం..
కథ :
క్లుప్తంగా చెప్పాలంటే.. ప్రతీ వ్యక్తి తన జీవితాన్ని తక్కువ చేసుకుంటూ ఊహల్లో తనది కాని మరో ప్రపంచంలో బతికేస్తుంటాడు. అలాంటి జీవితాలను వెళ్ళదీస్తున్న ఇద్దరి కథల్లో ఎలాంటి మార్పులు వచ్చాయన్నదే ఈ ‘నాలో ఒకడు’ కథ.
విక్కీ అలియాస్ విజ్ఞేష్ (సిద్ధార్థ్) ఓ చిన్న థియేటర్లో టార్చ్‌లైట్ బాయ్‌గా పనిచేస్తుంటాడు. అంద వికారంగా ఉన్నానని, జీవితాన్ని జాలీగా గడపడానికి డబ్బులు లేవని బాధ పడుతూ కూడా కష్టపడి పనిచేసుకునే మంచి వ్యక్తి. సాధారణంగా సాగిపోయే అతడి జీవితంలో లూసియా పేరుగల ఒక డ్రగ్ విపరీతమైన మార్పులు తీసుకొస్తుంది. ఆ కాప్సిల్ తీసుకున్న తర్వాత అతడు తాను కోరుకునే జీవితాన్ని కలలో బతికేయొచ్చు. కలలో విక్కీ (సిద్ధార్థ్) ఓ స్టార్ హీరో. సమాజంలో ఎంతో డబ్బు, పేరు ఉన్న అలాంటి స్టార్ జీవితాన్ని కలలో గడిపేస్తుంటాడు.
రెండు కథలు సమాంతరంగా సాగుతూండే ఈ క్రమంలో ఇటు థియేటర్లోని విక్కీ జీవితంతో పాటు, అటు స్టార్ హీరో విక్కీ జీవితంలో కూడా అనుకోని సంఘటనలు వెనువెంటనే జరిగిపోతుంటాయి. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి దివ్య (దీపా సన్నిధి) రెండు కథల్లోనూ తనని విడిచి పోవడం, జీవితంలో ఇంతకుముందెన్నడూ చూడని ఓ స్ట్రగుల్ పీరియడ్‌ను రెండు కథల్లోనూ చూడడం ఇలా నడుస్తుంది కథ. చివరకు వచ్చేసరికి విక్కీ తన జీవితంలో తాను ఊహించనంత హ్యాపీగా గడిపే పొజిషన్‌కు వస్తాడు. ఆ తర్వాతే కథలోని అసలు ట్విస్ట్ బయటపడుతుంది. చివర్లో కలలోని విక్కీని నిజజీవితంలోని విక్కీ ఏం చేశాడు? కథలో అసలైన ట్విస్ట్ ఏంటన్నదే ఈ సినిమా.
ప్లస్పాయింట్స్ :
కథా, కథనాల పరంగా చూసుకుంటే ఈ సినిమా ఓ సరికొత్త ఎక్స్పీరియన్స్. ఇలాంటి తరహా కథలను హాలీవుడ్ సినిమాల్లో చూసి ఉన్నా, తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఇది చాలా కొత్తదనమున్న కథ. ఓ సైకలాజికల్ థ్రిల్లర్‌ను ప్రధానంగా బతికించేది స్క్రీన్‌ప్లే. ఈ సినిమాలోని అసలైన థ్రిల్‌ను చివరివరకూ క్యారీ చేయడంలో స్క్రీన్‌ప్లే బాగా ఉపయోగపడింది. ‘మనకు అతి సాధారణంగా కనిపిస్తున్న మన జీవితమే మరొకరికి అతిపెద్ద కల కావచ్చు’ అన్న పాయింట్‌తో సినిమాను తెరకెక్కించడం, ఆ పాయింట్‌ను ఓ మెసేజ్‌లా కాకుండా కథానుగుణంగా, ఇంటర్నల్ స్టోరీగా తెరకెక్కించడం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్.
ఇక సినిమా పరంగా చూస్తే.. ఫస్టాఫ్‌లో రెండు కథలను చాలా ఆసక్తికరంగా ఎస్టాబ్లిష్ చేయడంతో ఎక్కడా బోర్ కొట్టదు. అలాగే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్. రెండు కథల్లో విక్కీగా నటించిన సిద్ధార్థ్ తన మార్క్ యాక్టింగ్‌తో అబ్బురపరుస్తాడు. థియేటర్ బాయ్‌గా అతడి అమాయకత్వాన్ని, సినిమా స్టార్‌గా అతడి దర్పాన్ని సమాంతరంగా ఒకేసారి చూడడం కట్టిపడేస్తుంది. ఇక రెండు కథల్లోను దివ్యగా నటించిన దీపా సన్నిధి చాలా బాగా నటించింది. ఒక కథలో హీరోయిన్గా, మరో కథలో ఓ మధ్య తరగతి అమ్మాయిగా ఆమె చూపించిన వేరియేషన్ ఆకట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే.. ముందుగా సినిమాలోని కన్ఫ్యూజన్ గురించి చెప్పుకోవాలి. మొదటి సీన్ నుంచే మొదలయ్యే ఈ కన్ఫ్యూజన్ క్లైమాక్స్‌లో గానీ తీరిపోదు. ఈ సమయంలో రెండు ప్రధాన కథలతో పాటు, మరో ఉపకథ సమాంతరంగా నడుస్తూ సాధారణ ప్రేక్షకుడిని గజిబిజికి గురిచేస్తాయి. సినిమా పరంగా స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్ కానీ గజిబిజి లేని సినిమాలు చూడటానికి అలవాటుపడని సాధారణ ప్రేక్షకుడి పరంగా స్క్రీన్ ప్లేనే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్.
ఇక సినిమా నడుస్తున్నప్పుడు తలెత్తే ప్రతీ ప్రశ్నకి చివర్లో సమాధానాలు దొరికినా, ఈ క్రమంలో సాధారణ ప్రేక్షకుడు ఎక్కువగా అయోమయంలోనే గడిపే పరిస్థితులు ఉండడంతో సినిమాపై కొంత ఆసక్తి తగ్గుతుంది. మాస్, కమర్షియల్ సినిమాలను బాగా ఎంజాయ్ చేసేవారికి ఈ సినిమా పెద్దగా నచ్చే అవకాశం లేదు. అలాగే ఎక్కువగా కామెడీని కోరుకునే వారికి ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలా తక్కువ. ఇక సెకండాఫ్‌లో కొంత భాగం వేగం తగ్గి సినిమా పేస్ దెబ్బతినడం ఓ మైనస్.
సాంకేతిక విభాగం :
సాంకేతిక పరంగా చూసుకుంటే సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముందుగా దర్శకుడు ప్రసాద్ రామర్ గురించి చెప్పుకుంటే.. మొదటి సినిమా అయినా చాలా బాగా తీశాడు. కథలోని ఎమోషన్‌ను దాదాపుగా సినిమాలోనూ క్యారీ చేయగలిగాడు. పాత్రలు, పాత్ర వ్యక్తిత్వాల ద్వారా సినిమా నడపడం, హీరో విక్కీ కథను బ్లాక్ అన్డ్ వైట్‌లో చెప్పడం దర్శకుడి ప్రతిభగా చెప్పుకోవచ్చు.
స్క్రీన్‌ప్లేలో కొన్ని మార్పులు చేసి సినిమాలోని కన్ఫ్యూజన్ను కొంత తగ్గించి ఉంటే మరింత బాగుండేది. ఇక సినిమాటోగ్రాఫర్ సినిమా మూడ్‌ను సరిగ్గా క్యాప్చర్ చేయగలిగారు. చాలా చోట్ల సినిమాలో లీనమైపోవడానికి సినిమాటోగ్రఫీ బాగా ఉపయోగపడింది. సంతోష్ నారాయణ్ అందించిన నేపథ్యం సంగీతం చాలా బాగుంది. అయితే పాటల్లో ఒకటి రెండు చోట్ల తప్ప పెద్దగా కొత్తదనం లేదు. ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. మూడు కథలను ఒకేసారి చెప్పే ప్రయత్నం చేసినా, ప్రేక్షకుడు కన్ఫ్యూజన్కి గురైనా, స్ట్రెస్‌కి గురికాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
తీర్పు :
ఒక మంచి పాయింట్‌తో, రెండు సమాంతరంగా నడిచే బలమైన కథలతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘నాలో ఒకడు’. తెలుగు తెరపై ఇలాంటి కథలు పెద్దగా రాకపోవడం ఈ సినిమాకు బాగా కలిసివచ్చే అంశం. సిద్ధార్థ్, దీపా సన్నిధిల నటన, చివరివరకూ థ్రిల్లింగ్‌గా సాగే స్క్రీన్‌ప్లే, రెండు కథల్లోని బలమైన ఎమోషన్ ఈ సినిమాకు మేజర్ ప్లస్పాయింట్స్. ఇక కన్ఫ్యూజింగ్ స్క్రీన్‌ప్లే సాధారణ ప్రేక్షకుడిని పెద్దగా ఆకట్టుకునేలా లేకపోవడం, సెకండాఫ్ లో బోర్ కొట్టే కొంత భాగం చెప్పదగిన మైనస్ పాయింట్. ఒక్కమాటలో చెప్పాలంటే.. రొటీన్ సినిమాలకు అలవాటు పడి, చివరివరకూ థ్రిల్‌ను ఎంజాయ్ చేయలేని వారికి ఈ సినిమా ఎంటర్టైన్ చేయడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక థ్రిల్లింగ్ సైకలాజికల్ డ్రామాతో పాటు, బలమైన ఎమోషన్ ఉన్న రెండు కథలను చెప్పిన ఈ సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం అర్థవంతమైన థ్రిల్‌నిస్తుంది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం