విడుదల తేదీ : 5 జూన్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : రాజ్ మాదిరాజు
నిర్మాత : రమేష్ ప్రసాద్
సంగీతం : జ్యోశ్యభట్ల శర్మ
నటీనటులు : పూరీ ఆకాష్, ఉల్కా గుప్తా..
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు పూరీ ఆకాష్ ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో బాలనటుడిగా మంచి ప్రతిభ కనబరిచాడు. ‘ధోని’ సినిమా ద్వారా ప్రధాన పాత్రలోనూ మెప్పించిన ఆకాష్, తాజాగా ‘ఆంధ్రాపోరి’ అనే టీనేజ్ లవ్‌స్టోరీ ద్వారా పూర్తి స్థాయి హీరోగా మన ముందుకొచ్చాడు. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. మరాఠీలో ఘన విజయం సాధించిన టైమ్‌పాస్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఆంధ్రాపోరి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మరాఠీ టైమ్‌పాస్ చేసిన మ్యాజిక్ ఈ సినిమా కూడా చేసిందా? చూద్దాం…
కథ :
కొత్తగూడెం పవర్ ప్లాంట్ పరిసరాల్లో కాలనీ, మార్కెట్ ఇలా రెండు విభిన్న నేపథ్యాలున్న ప్రపంచాలను వేరు చేసేది ఓ పెద్ద గోడ. కాలనీలో ఆఫీసర్లుంటే, మార్కెట్‌లో పేద కుటుంబాలుంటాయి. మార్కెట్‌లో అందరికీ పరిచయమైన కుర్రాడు నిజామాబాద్ నర్సింగ్ (పూరీ ఆకాష్). గోడను దాటి ఎప్పటికైనా కాలనీలోకి మారిపోవాలన్నది నర్సింగ్ తల్లి యాదమ్మ(ఈశ్వరి) కల. అందుకు తగ్గట్టుగానే కొడుకుని పెద్ద చదువులు చదివించాలనుకుంటుంది. అయితే నర్సింగ్ మాత్రం చదువును పక్కన పడేసి అల్లరిగా తిరుగుతూంటాడు.
ఈ క్రమంలోనే నర్సింగ్, కాలనీలో ఉండే ప్రశాంతి (ఉల్కా గుప్తా)ను ప్రేమిస్తాడు. కొన్నాళ్ళకే ప్రశాంతి కూడా నర్సింగ్ ప్రేమను అంగీకరిస్తుంది. ఇక నర్సింగ్, ప్రశాంతి ఇద్దరూ తొలిప్రేమలోని అనుభవాలను రుచి చూస్తూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ప్రశాంతి తండ్రి గోపాల్ రావు (శ్రీకాంత్)కు తన కూతురు ప్రేమ వ్యవహారం తెలిసాక అతడేం చేశాడు? నర్సింగ్ తల్లి కల ఏమైంది? నర్సింగ్, ప్రశాంతిల కథ ఏమైంది? వారిద్దరి జీవితాల్లో చివరకు ఏమేం మార్పులొచ్చాయ్? అన్నది మిగతా కథ.
ప్లస్‌పాయింట్స్ :
పైన చెప్పినట్టుగానే చెప్పుకుంటూ పోతే ఈ కథ సినిమాగా మారే అవకాశమే లేదు. సినిమాలో అంతర్లీనంగా నడిచే ఎన్నో కథలున్నాయి. నర్సింగ్, ప్రశాంతిల ప్రేమకథలో అద్భుతమైన ఇన్నోసెన్స్ ఉంది. వాటన్నింటినీ సరిగ్గా పట్టుకొని తెరకెక్కించడం వల్లే ‘టైమ్‌పాస్’ సినిమా అంతటి ఫీల్‌నిచ్చింది. టైమ్‌పాస్ కథలోని ఇన్నోసెన్స్‌ను ఆంధ్రాపోరి కూడా సరిగ్గా పట్టుకుందనే చెప్పాలి. ఇదే సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్‌గా నిలుస్తుంది. ప్రేమకథల్లో అందమైన సంఘటనలు అలా వస్తూంటాయే కానీ, బలమైన అంశాలంటూ ప్రత్యేకంగా ఉండవు. అలాంటి అందమైన సంఘటనలన్నీ అంతే అందమైన పాటల్లో చెప్పడం మరో ప్లస్‌పాయింట్. డైలాగులు సందర్భానికి తగ్గట్టుగా అర్థవంతంగా ఉన్నాయి.
నర్సింగ్‌గా పూరీ ఆకాష్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. ఓ పదిహేడేళ్ళ కుర్రాడిలో సహజంగానే ఉండే అయోమయాన్ని, అదే పదిహేడేళ్ళ కుర్రాడిలో ఉండే ఉత్సాహాన్ని చాలా చక్కగా పలికించాడు. డైలాగులు చెప్పడంలో ఎంతో నైపుణ్యమున్న నటుడిలా యాక్టింగ్‌తో బ్యాలెన్స్‌డ్ డైలాగులు చెప్పడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఉల్కా గుప్తా ప్రశాంతిగా తన పాత్రలో సరిగ్గా ఒదిగిపోయింది. ఇద్దరూ పోటీ పడి నటించారని చెప్పొచ్చు. హీరోయిన్ తండ్రిగా నటించిన శ్రీకాంత్ ఆద్యంతం కట్టిపడేస్తాడు. అతడి లుక్స్, డైలాగ్ డిక్షన్ సినిమా మూడ్‌కు సరిగ్గా సరిపోయాయ్! నర్సింగ్ తల్లిగా ఈశ్వరి బాగా నటించింది.
సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల ప్రేమకథ మొదలయ్యాక ఆ కథలో ఉండే సున్నితమైన అమాయకత్వం, సెకండాఫ్‌లో వచ్చే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ఒక అర్థాన్ని తెచ్చిపెట్టాయి. సెకండాఫ్‌ని మేజర్ ప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధాన మైనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా ఫస్టాఫే! ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే లవ్ సన్నివేశాల్లో ఇన్నోసెన్స్‌ను బాగానే పట్టుకున్నా, ఆ సన్నివేశాల్లో ఉండే అంతర్లీనమైన ఫన్‌ను మాత్రం వదిలేసినట్టు కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో కామెడీ అనే అంశం పైకి కనిపిస్తున్నా ఇక్కడ ఆ సమయానికి కావాల్సింది హృదయానికి హత్తుకునే ఫన్ కానీ, బలవంతంగా ఇరికించే కామెడీ కాదు. ఈ చిన్న విషయంలో చేసిన తప్పిదం మూలంగా ఫస్టాఫ్ మొత్తం అలా సాగుతూ పోతుందంతే! ఇక ఈ టీనేజ్ ప్రేమకథలో సహజంగానే ప్రేమజంటలో ఉన్న అయోమయాన్ని బలమైన సన్నివేశాలతో కాక, పాత్రల ద్వారా మాత్రమే చెప్పడం నిరుత్సాహపరుస్తుంది.
కమర్షియాలిటీ పేరుతో సినిమాలో వచ్చే సన్నివేశాలు ఫ్లోను దెబ్బతీయడమే కాక సినిమాను గాడి తప్పించాయి. సినిమాకు ప్రధాన బలమైన సెకండాఫ్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మరీ తెలుగు సినిమా ఫార్ములా సన్నివేశాల్లా ఉండడం పెదగా ఆకట్టుకోదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా దర్శకుడు రాజ్ మాదిరాజు గురించి చెప్పుకోవాలి. ఆంధ్రాపోరి మాతృకలోని అతి సాధారణమైన కథను, దానిచుట్టూ ఉండే అనుభూతిని కథగా ఏమాత్రం చెడగొట్టలేదు. స్క్రీన్‌ప్ల్లే విషయంలో మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను మార్చే క్రమంలో తప్పటడుగు వేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దర్శకుడిగా రాజ్ మాదిరాజు చాలా చోట్ల మెరిశాడు. క్యారెక్టర్లను పరిచయం చేయడం, ఒక్కో క్యారెక్టర్‌ను మరో క్యారెక్టర్‌తో లింక్ చేయడం వంటి విషయాల్లో దర్శకుడి ప్రతిభను గమనించవచ్చు. తల్లి-కొడుకు, తండ్రి-కూతురు బంధాలను చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు.
సినిమాటోగ్రఫీ బాగుంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా కావడం, టీనేజ్ లవ్‌స్టోరీ కావడంతో సినిమా మూడ్‌ను సరిగ్గా క్యాప్చర్ చేయడంలో సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ పనితనం బాగుంది. జ్యోశ్యభట్ల శర్మ అందించిన సంగీతం బాగా ఆకట్టుకుంటుంది. పాటలన్నీ తెరపై చూసినప్పుడు లవ్‌స్టోరీ ప్లేవర్ బాగా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఫర్వాలేదనిపించేలా ఉంది.
తీర్పు :
పూరీ ఆకాష్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన ఆంధ్రాపోరిలో మేజర్ అట్రాక్షన్ ఆకాషే అన్న విషయం సినిమా చూశాక స్పష్టంగా అర్థమవుతుంది. తన పాత్రను అద్భుతంగా పోషించి సినిమాకు ఒక అందాన్నిచ్చాడు ఆకాష్. టీనేజ్ లవ్‌స్టోరీలో ఉండే ఇన్నోసెన్స్, సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలం. ఇక కమర్షియాలిటీ కోసం అనవసరంగా ఇరికించిన సన్నివేశాలు, కథలో అంతర్లీనంగా సాగే ఫన్‌ను వదిలేసి ఫోర్స్‌డ్ కామెడీని నమ్మడం ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్కమాటలో చెప్పాలంటే.. టీనేజ్ లవ్‌స్టోరీ అంటే సెక్స్ చుట్టూ తిరిగే కథలనే ఎక్కువగా చూసి ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతి. టీనేజ్ లవ్‌స్టోరీలోని ఇన్నోసెన్స్‌ను అర్థం చేసుకొని కనెక్ట్ అయ్యేవారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. మిగతా వారికి మాత్రం అతి సాధారణంగా కనిపించే ఈ సినిమా ఇచ్చే ప్రత్యేక అనుభూతులు ఏమీ లేవు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం