సమీక్ష : జ్యోతిలక్ష్మీ – పూరీ స్టైల్ సోషల్ మెసేజ్!

jyothi-lakshmi

విడుదల తేదీ : 12 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : పూరీ జగన్నాథ్

నిర్మాత : ఛార్మీ, సి. కళ్యాణ్

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు : సత్య దేవ, ఛార్మీ..

‘టెంపర్’ లాంటి సూపర్ హిట్ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ డిఫరెంట్ లేడీ ఓరియంటెడ్ సినిమాయే జ్యోతిలక్ష్మీ. ఛార్మీ లీడ్‌ రోల్ చేయడంతో పాటు ఈ సినిమాను స్వయంగా నిర్మించారు. కమర్షియల్ డైరెక్టర్‌గా సూపర్ అనిపించుకున్న పూరీ జగన్నాథ్, ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాను తెరకెక్కించడంతో ఈ సినిమాపై మెదట్నుంచీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాల నేపథ్యంలోనే నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? చూద్దాం..

కథ :

సత్య (సత్య దేవ) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఓ వేశ్యను ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్న అతను మొదటిచూపులోనే జ్యోతిలక్ష్మీ (ఛార్మీ) ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి అతని ప్రేమను తెలియజెప్పి పెళ్ళికి ఒప్పిస్తాడు. జ్యోతిలక్ష్మీని పెళ్ళి చేసుకొని తనతో పాటు తీసుకెళ్ళిన తర్వాత, సత్య – జ్యోతిలక్ష్మీల జీవితంలో అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులే వారిద్దరికీ సమస్యలను, ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ఈ సమస్యలన్నింటితో పాటు సమాజంలో కొన్నేళ్ళుగా వేళ్ళూనుకు పోయి ఉన్న సామాజిక సమస్యపై జ్యోతిలక్ష్మీ అన్నీ తానై పోరాటం చేయాల్సి వస్తుంది. అసలు జ్యోతిలక్ష్మీకి ఎదురైన ఇబ్బందికర పరిస్థితులేంటి? ఆ సామాజికి సమస్య ఏమిటి? ఈ సమస్యలపై జ్యోతిలక్ష్మీ చేసిన పోరాటం ఫలించిందా? అన్నది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే.. బలమైన కథాంశం గురించే చెప్పుకోవాలి. ఆ అంశం చుట్టూ అల్లుకున్న కథ కూడా అంతే బలమైనది కావడం మరో ప్లస్‌పాయింట్. ఆడవాళ్ళంటే అమితమైన గౌరవముండే ఓ వ్యక్తి వేశ్యను పెళ్ళి చేసుకోవాలనుకోవడం, అతడి నేపథ్యం, జ్యోతిలక్ష్మీ నేపథ్యం, సత్య ప్రేమను జ్యోతిలక్ష్మీ అర్థం చేసుకోవడం, చివరికి ఓ సమస్యపై పోరాడడం.. ఇలా ఓ బలమైన కథకు కావాల్సిన సబ్ ప్లాట్స్ ఈ కథలో చాలా ఉన్నాయి. వాటన్నింటినీ ఓ క్రమంలో పేర్చి కమర్షియల్ యాంగిల్‌లో చెప్పే ప్రయత్నం చేశారు.

ఇక హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ బాగుంది. నిర్దిష్ట అభిప్రాయాలున్న సత్యది సినిమా అంతా ఒకే క్యారెక్టరైజేషన్ కాగా, జ్యోతిలక్ష్మీది అందుకు భిన్నంగా తనను తాను అర్థం చేసుకొని మారిపోతూ ఉండే మరో క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టరైజేషన్‌ల మధ్య కథ నడపడం ఆసక్తికరంగా ఉంది. జ్యోతిలక్ష్మీగా ఛార్మీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించింది. సత్య దేవ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. నిలకడైన ఎక్స్‌ప్రెషన్‌తో తన క్యారెక్టర్‌ను చాలా బాగా క్యారీ చేశాడు. మిగతావారంతా తమ పరిధిమేరకు బాగానే నటించారు.

సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్‌ హీరో హీరోయిన్లు కలుసుకోవడం, హీరో యాంగిల్‌లో కథ నడుస్తూ పూరీ స్టైల్లో ఫన్నీగా సాగిపోతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకే మేజర్ హైలైట్. సెకండాఫ్‌లో జ్యోతిలక్ష్మీ పాత్ర తనను తాను అర్థం చేసుకోవడం అనే యాంగిల్‌లో సాగిపోతూ ఎమోషనల్‌గా ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే.. పూరీ స్పీడే అని చెప్పాలి. ఒక ఎమోషన్ నుంచి ఇంకో ఎమోషన్‌కు మారిపోయే సన్నివేశాలు వచ్చే క్రమంలో ఈ స్పీడే మైనస్‌గా నిలిచింది. సినిమాకు ప్రాణమైన జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్‌ ఆలోచనలు, భావోద్వేగాలనే మేజర్ పాయింట్‌గా కథను నడిపే అవకాశమున్నా, అనవసరంగా డైలాగులను జొప్పించి చెప్పాలనుకోవడం మరో మైనస్. ఓవరాల్‌గా జ్యోతిలక్ష్మీ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉన్నా, ఆమె పరిస్థితులను అర్థం చేసుకుంటూ మారిపోవడం చిన్న చిన్న సన్నివేశాలతో తేల్చేయడం బాలేదు.

ఇక పాటలు అసందర్భంగా వస్తూ సినిమా మూడ్‌ను చెడగొట్టాయి. చివర్లో వచ్చే ఐటెమ్ సాంగ్ లాంటిది ఒక్కసారిగా జ్యోతిలక్ష్మీ పోరాటాన్ని దారి తప్పించింది. క్లైమాక్స్ మరీ సినిమాటిగ్గా ఉంది. పోరాటమంటే దానికో పరిష్కారం ఉండి తీరాలన్న ఆలోచనలో క్లైమాక్స్‌ను తేల్చేసినట్టు స్పష్టమవుతుంది. బ్రహ్మనందం కామెడీ ట్రాక్ కథలోనిదే అయినా అతికించినట్టు కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి చెప్పుకుంటే.. ఓ బలమైన కథాంశాన్ని, తనకు బాగా అలవాటైన ఫార్మాట్‌లో చెప్పే ప్రయత్నం ఈ సినిమాలో చేశారు. కమర్షియల్‌గా వర్కవుట్ అవ్వడమనే యాంగిల్లో వచ్చే కొన్ని సినిమాటిక్ సన్నివేశాలను పక్కనపెడితే అనుకున్నది అనుకున్నట్టుగా, అందరికీ అర్థమయ్యేలా చెప్పడంలో పూరీ జగన్నాథ్ చాలా వరకు విజయం సాధించారు. డైలాగులు కొన్ని అనవసరంగా కనిపించినా పూరీ స్టైల్లో బలంగా ఉన్నాయి. దర్శకుడిగా పూరీ తన పంథా ఏమీ మార్చకుండానే ఓ మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు.

సునీల్ కశ్యప్ అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగానే ఉన్నా సినిమాలో అసందర్భంగా వచ్చాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకునే ఉంది. పీజీ విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఫస్టాఫ్‌లో ఫన్ మూడ్‌ను, సెకండాఫ్‌లో సీరియస్ మూడ్‌ను సినిమాటోగ్రాఫర్ పీజీ విందా సరిగ్గా క్యారీ చేశారు.

తీర్పు :

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ బలమైన మెసేజ్ ఉన్న లేడీ ఓరియెంటెడ్ సినిమా తెరకెక్కడమంటే అది విశేషమే! ఆ విశేషాన్ని పూరీ తన స్టైల్లో, తన మార్క్ సన్నివేశాలతో నడిపించాడు. ఛార్మీ, సత్య దేవల క్యారెక్టరైజేషన్, వారిద్దరి యాక్టింగ్, బలమైన మెసేజ్ ఈ సినిమాకు అనుకూల అంశాలు. ఇక బలమైన మెసేజ్‌నే సాగదీసి చెప్పినట్టు అనిపించడం, అతి సాధారణంగా, సినిమాటిగ్గా ముగిసే క్లైమాక్స్ ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. జ్యోతిలక్ష్మీ, పూరీ జగన్నాథ్ స్టైల్లో సాగిపోయే ఓ కమర్షియల్ టచ్ ఉన్న మెసేజ్ ఓరియంటడ్ సినిమా! జ్యోతిలక్ష్మీ ద్వారా పూరీ స్పృశించిన అంశం కోసమైనా ఈ సినిమాను ఓసారి చూడొచ్చు. ఇక పూరీ స్టైల్‌ను అభిమానించే వారినైతే ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version