విడుదల తేదీ : 12 జూన్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
దర్శకత్వం : జై శ్రీ శివన్
నిర్మాత : సత్య మోహన్, ప్రకాష్
సంగీతం : రమేష్ నారాయణ్
నటీనటులు : వరుణ్ సందేశ్, రిచా పనాయ్, రుచి త్రిపాఠి
గత కొంతకాలంగా సరైన హిట్ లేని వరుణ్ సందేశ్, తాజాగా ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ‘లవకుశ’ పేరుతో ఓ కిడ్నాప్ డ్రామా ద్వారా మరో ప్రయత్నంతో మన ముందుకొచ్చాడు. కొత్త దర్శకుడు జై శ్రీ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ కిడ్నాప్ డ్రామా ఏ మేరకు ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం..
కథ :
పవన్ కుమార్ (వరుణ్ సందేశ్) జాలీగా జీవితాన్ని గడిపే ఓ యువకుడు. లవ అంటూ తనకు తానే ఓ పేరు పెట్టేసుకున్న పవన్, తాగి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను తన క్యాబ్‌లో వాళ్ళ ఇంటి వద్ద దించేస్తుంటాడు. ఈ ప్రయాణంలో అతనికి తనలాగే ఉండే కుషాల్ కుమార్ (వరుణ్ సందేశ్) కనిపిస్తాడు. అతి కొద్దికాలంలోనే వాళ్ళిద్దరు మంచి స్నేహితుల్లా మారిపోతారు. ఈ క్రమంలోనే పవన్, సుబ్బలక్ష్మీ (రిచా పనాయ్)ని, కుషాల్ సత్య( రుచి త్రిపాఠి)ని ప్రేమిస్తారు.
ఇదిలా ఉండగా.. డబ్బుల కోసం ఎవరినో ఒకరిని కిడ్నాప్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో అనుకోకుండానే ఓ చిన్న పిల్లాణ్ణి పవన్, కుశాల్‌లు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకొని ఆ బాబును తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడే సినిమాలో అసలైన ట్విస్ట్. ఆ ట్విస్ట్ ఏంటి? పవన్, కుశాల్‌లు ఆ బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారా? అన్నది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ హైలైట్ అంటే ఆసక్తికరంగా కనిపించే కథాంశం గురించి చెప్పుకోవాలి. సినిమాలో కొన్ని ఇంటరెస్టింగ్ ట్విస్ట్‌లు బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలోని ఆ ఆసక్తికర ట్విస్ట్ రివీల్ అయ్యే సన్నివేశాలను కూడా బాగా రూపొందించారు.
వరుణ్ సందేశ్ రెండు రోల్స్‌లో బాగా కనిపించాడు. రెండు పాత్రల్లో చక్కటి వేరియేషన్‌ను చూపించి బాగా ఆకట్టుకున్నాడు. అతడి డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. హీరోయిన్లు ఇద్దరూ గ్లామర్ పరంగా ఆకట్టుకోగా, యాక్టింగ్ విషయంలోనూ ఫర్వాలేదనిపించారు. కమెడియన్ ప్రభాస్ శ్రీను సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమాకు మంచి ప్లస్ పాయింట్
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. అర్థం పర్థం లేని సన్నివేశాలు, అసందర్భంగా వచ్చే కామెడీ సన్నివేశాలు అన్నీ కలిపి ఫస్టాఫ్‌ను ఏమాత్రం ఎంజాయ్ చేయనీకుండా చేశాయి. ఇంటర్వెల్ వరకూ ఒక్కటైనా థ్రిల్ చేసే సన్నివేశం లేకపోవడం నిరుత్సాహపరుస్తుంది.
ఇక ఈ సినిమాకు తీసుకున్న బేసిక్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉన్నా దాన్ని బలమైన కథగా, సినిమాగా మలిచే క్రమంలో పూర్తిగా విఫలమయ్యారు. హీరోయిన్లు గ్లామర్ పరంగా ఆకట్టుకున్నారే తప్ప వారికి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కొన్ని పాటల్లో గ్లామర్ మరీ ఎక్కువైంది.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు జై శ్రీ శివన్ గురించి చెప్పుకుంటే.. సినిమాకు మంచి పాయింట్‌నే ఎంచుకున్నా, దాన్ని సినిమాగా మలచడంలో మాత్రం విఫలమయ్యాడు. అయితే అక్కడక్కడా కొన్ని ట్విస్ట్‌లతో మెరిశాడు. ఓవరాల్‌గా దర్శకుడు కథ విషయంలోనూ, దర్శకత్వం విషయంలోనూ పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. రామ్ నారాయణ్ అందించిన సంగీతం బాగుంది.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. లొకేషన్లను, పాటలను అందంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ విజయం సాధించారు. ఎడిటింగ్ ఫర్వాలేదనలా ఉంది. ఫస్టాఫ్ విషయంలో మరికొంత శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
ఓ కిడ్నాప్ డ్రామా ద్వారానైనా ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని అనుకున్న వరుణ్ సందేశ్‌కు ఈ సినిమా కూడా ఆశించిన రేంజ్ ఫలితం తెచ్చిపెట్టేలా లేదు. ఓ ఇంటరెస్టింగ్ సినిమాగా తెరకెక్కగల మంచి పాయింట్‌నే ఎంచుకున్నా, దర్శకుడు సినిమాగా ఆ పాయింట్‌ను చెప్పడంలో విఫలమయ్యాడు. ఇంటరెస్టింగ్ పాయింట్, కొన్ని కామెడీ సన్నివేశాలు, ఆసక్తి కలిగించే ట్విస్ట్ మినహా ఈ సినిమా ద్వారా పెద్దగా ఆశించడానికి ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో వరుణ్ సందేశ్ చేసిన సినిమాల్లోకెల్లా ఇదో మంచి ప్రయత్నమనే చెప్పాలి. అయితే ఆ ప్రయత్నం సినిమాగా మాత్రం సాదాసీదాగా నిలిచింది. ఏమాత్రం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా వెళితో ఒకసారి ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
123తెలుగు టీం