సమీక్ష : సినిమా చూపిస్త మావ – ప్రేక్షకులను బాగా నవ్వించే సినిమా మావ.!

cinema choopistha maava-review

విడుదల తేదీ : 14 ఆగష్టు 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

దర్శకత్వం : త్రినాథరావు నక్కిన

నిర్మాత : బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్‌, రూపేష్‌.డి, జి.సునీత

సంగీతం : శేఖర్ చంద్ర

నటీనటులు : రాజ్ తరుణ్, అవిక గోర్, రావు రమేష్..

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో సూపర్ హిట్ అనిపించుకున్న కొత్త జంట రాజ్ తరుణ్ – అవిక గోర్. వీరిద్దరి కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ రేసుగుర్రం సినిమాలో బాగా ఫేమస్ అయిన సాంగ్ లిరిక్ ని టైటిల్ గా పెట్టి చేసిన సినిమా ‘సినిమా చూపిస్త మావ’. ‘మేం వయసుకు వచ్చాం’ ఫేం త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించాడు. బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్‌, రూపేష్‌.డి, జి.సునీతలు కలిసి నిర్మించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమాతో హిట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట రెండవ సినిమాతో కూడా హిట్ పెయిర్ అనిపించుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ :

రేసుగుర్రం సినిమాలో బాగా అంటే బాగా ఫేమస్ అయిన సాంగ్ నుంచి తీసుకున్నదే ఈ సినిమా టైటిల్ ‘సినిమా చూపిస్త మావ’. ఇక సినిమా కథలోకి వస్తే.. చాలా తెలుగు సినిమాల్లోలానే.. చదువు సంధ్యలు పెద్దగా అబ్బవు, దాంతో ఇంటర్మీడియట్ కూడా రెండు సార్లు తప్పి తన తండ్రి చేత తిట్టించుకుంటూ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు మన హీరో కత్తి (రాజ్ తరుణ్). కట్ చేస్తే గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో మెడికల్ కౌన్సిల్ సెక్రెటరీగా పనిచేస్తూ ప్రతి దాన్లోనూ క్వాలిటీ ఉండాలని స్ట్రాంగ్ గా ఫీలయ్యే సోమనాథ్ చటర్జీ (రావు రమేష్) గారి అమ్మాయి, చదువుల తల్లి సరస్వతి అయిన పరిణీత(అవిక గోర్)నే మన హీరోయిన్. ఎప్పుడు చదువు చదువు అని అని ఫీలయ్యే పరిణీతని చూసి మన కత్తి ప్రేమలో పడతాడు. ఇక అక్కడి నుంచి రోజు తన వెంటపడి, అల్లరి పనులన్నీ చేసి ఫైనల్ గా పరిణీతని చూసి ప్రమలో పడేస్తాడు. ఇద్దరి లవ్ స్టొరీ బాగుంటుంది.

అక్కడి నుంచి కట్ చేస్తే వీరి ప్రేమ వ్యవహారం సోమనాథ్ చటర్జీ దగ్గరికి చేరుతుంది. సోమనాథ్ కి అల్లరి చిల్లరిగా బాధ్యతా లేకుండా తిరిగే కత్తి అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన కూతురు కూడా ఇష్టపడుతుందన్న కారణం చేత సోమనాథ్ కత్తికి ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తను ఇచ్చిన నెల రోజుల ఛాలెంజ్ లో గెలిస్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిస్తాడు. వీర లెవల్లో చాలెంజ్ ఓకే చేసిన మన హీరో కత్తి, అనుకున్న ఛాలెంజ్ లో గెలిచే దిశగా అడుగులేస్తున్న టైంలో కథలో అసలు సిసలైన ట్విస్ట్. అక్కడి నుంచి కథ అనుకోని మలుపులు తీసుకుంటుంది. మొదటగా సోమనాథ్ చటర్జీ కత్తికి ఇచ్చిన ఛాలెంజ్ ఏమిటి.? ఆ ఛాలెంజ్ కోసం కత్తి ఏం చేసాడు.? ఆ తర్వాత కథలో వచ్చిన అసలు ట్విస్ట్ ఏంటి.? ఆ ట్విస్ట్ వల్ల కథలో వచ్చిన మార్పులను మీరు వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

సినిమా కథ, కథనాలతో సంబంధం లేకుండా ఈ సినిమాకి బేసిక్ అండ్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచినవి మూడున్నాయి. అవే.. మొదటిది – రాజ్ తరుణ్ – అవిక గోర్ ల హిట్ పెయిర్ కాంబినేషన్, రెండవది – బాగా ఫేమస్ అయిన లైన్ ‘సినిమా చూపిస్త మావ’ అనే టైటిల్ పెట్టడం, మూడవది – దిల్ రాజు ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ గా మారడం. ఇక ఇవి పక్కన పెట్టి సినిమా విషయలోకి వస్తే.. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ సినిమాలో చాలా వరకూ వర్కౌట్ అయ్యాయి. కామెడీనే ఈ సినిమాకి మేజర్ హైలైట్ కావడం విశేషం.

నటీనటుల విషయానికి వస్తే.. రాజ్ తారుణ్ హీరోగా చాలా మంచి నటనని కనబరిచాడు. తనలోని ఎనర్జీ లెవల్స్, ఈజ్ తో కత్తి పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ఎప్పటిలానే తన డైలాగ్ డెలివరీనే ఇక్కడ హైలైట్ అయ్యింది. చివర్లో వచ్చే ఎమోషనల్ సీన్ కూడా చాలా బాగా చేసాడు. కానీ చాలా చోట్ల తను రవితేజని ఇమిటేట్ చేసినట్లు ఉంటుంది. అది కాస్త తగ్గించుకుని తన యునిక్ మార్క్ వేసుకునే ప్రయత్నం చేసుంటే బాగుండేది. హీరోయిన్ గా అవిక గోర్ చూడటానికి క్యూట్ గా ఉంది, అలాగే తన పాత్రలో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఎప్పటిలానే రాజ్ తరుణ్ – అవిక గోర్ కాంబినేషన్ మరియు కెమిస్ట్రీ చూడటానికి బాగుంది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ పాత్రలో నటించిన రావు రమేష్ తనకిచ్చిన పాత్రని అద్భుతంగా పోషించాడు. ప్రతి ఎపిసోడ్ కి తన టాలెంట్ తో పూర్తి న్యాయం చేసాడు. రాజ్ తరుణ్ – రావు రమేష్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ ఫాదర్ గా చేసిన తోటపల్లి మధు బాగా చేసాడు. రాజ్ తరుణ్ – తోటపల్లి మధు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ చాలా ఉన్నాయి.

ఇక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, ప్రవీణ్, చలాకి చంటి, సత్యం రాజేష్, జయలక్ష్మిలు తమ పాత్రల్లో నవ్విస్తే.. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ లో వచ్చే జబర్దస్త్ టీం అయిన శంకర్, శ్రీను, సుధీర్ లు బాగానే నవ్వించారు. ఇక సినిమా ఫ్లో విషయానికి వస్తే.. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది.. మొదటి 30 నిమిషాలు కథలోకి చాలా వేగంగా వెళ్ళడమే కాకుండా, ఫన్నీగా కూడా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ద్రౌపదీ వస్త్రాపహరణం సీన్ బాగా నవ్విస్తుంది. ఇక సెకండాఫ్ లో రాజ్ తరుణ్ – రావు రమేష్ ల మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్ మాస్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే కృష్ణ భగవాన్ – చలాకి చంటి- రాజ్ తరుణ్ మధ్య వచ్చే భోజనాల ఎపిసోడ్ నవ్విస్తుంది. క్లైమాక్స్ ఎప్పటిలానే ఎమోషనల్ గా ముగుస్తుంది.

మైనస్ పాయింట్స్ :

‘సినిమా చూపిస్త మావ’ సినిమాలో చెప్పుకోవడానికి మైనస్ పాయింట్స్ బాగానే ఉన్నాయి.. మొదటగా ఈ సినిమాకి ఈ రన్ టైం. సుమారు 2గంటల 20 నిమిషాలు ఉన్న ఈ సినిమాలో సుమారు ఇంకో 15 నిమిషాలు కట్ చేయచ్చు. ఎందుకంటే చాలా సీన్స్ బోరింగ్ గా అనిపించడమే కాకుండా కథని సాగాదీశాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే కథ చాలా రెగ్యులర్. ఇప్పటికే చాలా అంటే చాలా చాలా సినిమాల్లో వచ్చిందే.. మనం చూసిందే.. చెప్పాలంటే కథలో సరైన ఎస్టాబ్లిష్ మెంట్ లేదు. ఇలాంటి కథకి కథనంలో అన్నా కేర్ తీసుకొని ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ఏమైనా రాసుకోవాల్సింది. కానీ అలాంటి విషయాలు ఏమీ లేకపోవడం కూడా ఈ సినిమాకి మైనస్.

సినిమాలో దాదాపు మనం అనుకున్నవే జరుగుతూ ఉండడం వల్ల చూసే ఆడియన్స్ కి కంటెంట్ పరంగా పెద్ద కిక్ ఉండదు. శేఖర్ చంద్ర సాంగ్స్ బాగున్నాయి, పిక్చరైజేషన్ ఇంకా బాగుంది, కానీ అవి వచ్చే సందర్భం సరిగా లేదు. సెకండాఫ్ లో అయితే పాట తర్వాత పాట వస్తూ ఉంటుంది. ఏదో కమర్షియాలిటీ కోసం పెట్టారు తప్ప పెద్ద ఉపయోగం లేదు. కొన్ని చోట్ల కామెడీ బలవంతంగా ఇరికించినట్లు ఉంటుంది. అలాగే సెకండాఫ్ లో వచ్చే దెయ్యం ఎపిసోడ్ లో కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ప్రీ క్లైమాక్స్ లో రావు రమేష్ డీల్ మాట్లాడే విషయం ఆ సందర్భంలో కాస్త సిల్లీగా అనిపిస్తుంది. అందుకే క్లైమాక్స్ ని ఇంకా బెటర్ గా, ఇంకాస్త కన్విన్సింగ్ గా తీయాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో సినిమాకి బాగా హెల్ప్ అయిన అంశాలు చాలానే ఉన్నాయి. ముందుగా శేఖర్ చంద్ర మ్యూజిక్.. తను అందించిన పాటలు అన్ని బాగున్నాయి, అలాగే ఈ ఫన్ ఎంటర్టైనర్ కి పర్ఫెక్ట్ గా అనిపించే నేపధ్య సంగీతం ఇచ్చాడు. ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి లొకేషన్ మరియు ప్రతి పాత్రని చాలా బాగా చూపించాడు. లైటింగ్ ఎఫెక్ట్స్ ని బాగా వాడుకున్నాడు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ జస్ట్ ఓకే. ఇంకా చాలా చోట్ల ట్రిమ్ చేసి ఉంటే సినిమాకి బాగా హెల్ప్ అయ్యేది. ప్రసన్న జె కుమార్ రాసిన డైలాగ్స్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తను క్లైమాక్స్ లో రాసిన ‘రక్తం రావడం తెలియట్లేదు, కన్నీళ్లు రావడం మాత్రం తెలియడం లేదు’, ‘ప్రేమించడం అనేది మట్టి మీద మట్టి అని రాసినంత ఈజీ, కానీ ఆ ప్రేమని చివరి దాకా నిలబెట్టుకోవడం నీళ్ళ మీద నీళ్ళు అని రాసినంత కష్టం’ ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయి.

ఇక కథ – కథనం – దర్శకత్వం డీల్ చేసిన త్రినాథరావు నక్కిన విషయానికి వస్తే.. కథ – కొత్తదానం అనేది లేని ఓల్డ్ ఫార్మాట్ రొటీన్ స్టొరీ. కథనం – మహా అయితే ఒక్క క్లైమాక్స్ ట్విస్ట్ తప్ప మిగతా అంతా మీరు ఊహించిందే జరుగుతుంది. దర్శకత్వం – ఇందులో మాత్రం త్రినాథరావు సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే కథ – కథనం అంట రొటీన్ గా ఉన్నా కామెడీ అనే పాయింట్ ని బేస్ చేసుకొని బాగానే ఫన్ వర్కౌట్ చేసాడు. డైరెక్టర్ గా టాలెంట్ ఉంది కానీ మంచి కథ – కథనాలపై దృష్టి పెడితే ఇంకా మంచి సినిమాలు చేయగలడు. బి.అంజిరెడ్డి, బి.వేణుగోపాల్‌, రూపేష్‌.డి, జి.సునీతల నిర్మాణ విలువలు బాగా రిచ్ గా ఉన్నాయి.

తీర్పు :

‘ఉయ్యాలా జంపాలా’ సినిమాతో కెరీర్లో తొలి హిట్ అందుకున్న రాజ్ తరుణ్ – అవిక గోర్ లు ‘సినిమా చూపిస్త మావ’తో కూడా అదే మేజిక్ ని రిపీట్ చేసి మరోసారి హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘సినిమా చూపిస్త మావ’ అనే పాటలో ఫన్ ఫ్లేవర్ ఎంత బాగా వర్కౌట్ అయ్యిందో, ఈ సినిమాలో కూడా అంత బాగా కామెడీ వర్కౌట్ అయ్యింది. అదే ఈ సినిమాకి ది బెస్ట్ ప్లస్ పాయింట్. కంటిన్యూగా కామెడీ లేకపోయినా డైరెక్టర్ త్రినాథరావు రాసుకున్న కామెడీ ఎపిసోడ్స్ అన్నీ బాగానే పేలాయి. రాజ్ తరుణ్ – అవిక గోర్ కాంబినేషన్, రావు రమేష్ సూపర్బ్ పెర్ఫార్మన్స్, కామెడీ ఎపిసోడ్స్, సెకండాఫ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయితే రొటీన్ కథ – కథనం, రన్ టైం, సాంగ్స్ ప్లేస్ మెంట్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. ఓవరాల్ గా హిట్ కాంబినేషన్ లో వచ్చిన ‘సినిమా చూపిస్త మావ’ ప్రేక్షకులను బాగా నవ్వించి రాజ్ తరుణ్ – అవిక గోర్ లకి మరో హిట్ ఇచ్చింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version