ఇంటర్వ్యూ : సీరత్ కపూర్ – కథ నచ్చితేనే సినిమా చేయడానికి ఇష్టపడతాను.

Seerat-Kapoor
‘రన్ రాజా రన్’ సినిమాతో రింగుల రింగుల జుట్టుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ సీరత్ కపూర్. ఈ ఏడాది ‘టైగర్’ సినిమాతో మరో హిట్ ని అందుకున్న సీరత్ కపూర్ అప్పుడే మరో సినిమా ‘కొలంబస్’ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ కొలంబస్ సినిమా అక్టోబర్ 22న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సీరత్ కపూర్ తో కాసేపు ముచ్చటించి కొలంబస్ సినిమా విశేషాలను తెలుసుకున్నాం. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘కొలంబస్’ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.?
స) ఈ సినిమాలో నేను నీరు అలియాస్ నీరజ అనే పాత్రలో కనిపిస్తాను. చాలా జోవియల్ గా ఉంటూ, తను ఫీల్ అయ్యింది ఉన్నది ఉన్నట్టుగా చెప్పే అమ్మాయి. అలాగే ఫ్యామిలీకి, కుటుంబ విలువలకి గౌరవం ఇచ్చే అమ్మాయి. తన లవ్ లోని ప్రాబ్లమ్స్ ని కూడా అర్థం చేసుకొనే అమ్మాయి. ఎమోషనల్ గా బాగా డెప్త్ ఉన్న పాత్ర అని చెప్పాలి.

ప్రశ్న) యంగ్ హీరో సుమంత్ అశ్విన్ తో మొదటి సారి పనిచేయడం ఎలా ఉంది.?
స) సుమంత్ అశ్విన్ వెరీ టాలెంటెడ్ యంగ్ యాక్టర్. చాలా సపోర్ట్ ఇస్తాడు, అందరితో బాగా కలిసిపోతాడు. ఈ సినిమా టైంలో నేను తెలుసుకుంది ఏమిటి అంటే సుమంత్ అశ్విన్ చాలా ఫోకస్ ఉన్న హీరో. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.

ప్రశ్న) కో స్టార్ మిస్తితో పనిచేయడం ఎలా ఉంది.?
స) మిస్తి వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఇద్దరం చాలా కంఫర్టబుల్ గా వర్క్ చేసాం. నా జర్నీ స్టార్టింగ్ లో ఇండస్ట్రీలో ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటే వారి మధ్య సంబంధాలు బాగుండవు అని అనేవారు. కానీ ఒకరి స్కిల్స్ గురించి ఒకరికి కచ్చితంగా తెలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మేము ఇద్దరం అలా ఆలోచించే వాళ్ళమే అందుకే ఎలాంటిఇబ్బంది లేకుండా సినిమా చేసాం.

ప్రశ్న) ట్రైలర్ చూస్తుంటే ఇదొక ట్రై యాంగిల్ లవ్ స్టొరీలా ఉంది.. మీరేమంటారు.?
స) మీరన్నట్టు ట్రైలర్ చూసి అలానే అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నేనైతే కథ ఏంటనేది చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను అందరూ ఊహించుకుంటున్న కథని అయితే మీరు ఇందులో చూడరు.

ప్రశ్న) మీకు, మిస్తికి తెలుగు మాతృ భాష కాదు. అలాంటి మీరు కాంబినేషన్ సీన్స్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డారా.?
స) నాకు మొదటి నుంచీ సైన్ లాంగ్వేజ్(లిప్ కదిలించేయడం, లేదా 123లు చెప్పడం) రాదు. మొదటి నుంచీ ప్రతి సీన్ ని అర్థం చేసుకొని ఆ తెలుగు డైలాగ్స్ కి మీనింగ్ తెలుసుకొని, వాటిని బాగా నేర్చుకొని చెప్పేదాన్ని. ఫస్ట్ సినిమా అప్పుడు కొత్త కాబట్టి కాస్త ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు తెలుగు బాగా అర్థమవుతోంది కాబట్టి ఇబ్బంది లేదు. అలాగే మిస్తికి కూడా ఇది సెకండ్ ఫిల్మ్ కావడం వలన కాస్త ఇబ్బంది కానీ టీం దగ్గరుండి ఇద్దరికీ పర్ఫెక్ట్ గా తెలుగు డైలాగ్స్ చెప్పడం వలన ఇద్దరం ఎలాంటి ఇబ్బంది లేకుండా సీన్స్ చేసాం.

ప్రశ్న) ఒకేసారి రెండు మూడు సినిమాలు చేసేయ్యకుండా, సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటూ ఒక టైంలో ఒకే సినిమా చేస్తూ వస్తున్నారు. ఎందుకలా.?
స) నేను ముందుగా కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కథ నచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అంటేనే చేస్తాను. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వలన క్వాలిటీ మిస్ అవుతుందని నేను ఫీలవుతాను. ఒక మంచి కథతో, ఒక గుడ్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేయడానికి ఇష్టపడతాను, అందుకే నేను సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటున్నాను.

ప్రశ్న) డైరెక్టర్ రమేష్ సామల గురించి చెప్పండి.?
స) రమేష్ లో ఒక డైరెక్టర్ కంటే వండర్ఫుల్ రైటర్ ఉన్నాడు. స్క్రిప్ట్ మాత్రమె కాకుండా తను రాసుకున్న సీన్స్, డైలాగ్స్ చాలా యూత్ఫుల్ గా ఉన్నాయి. ఇప్పటి యువత రోజూ మాట్లాడుకునేలా ఉంటాయి. చాలా కామ్ గా ఉంటూ యాక్టర్స్ నుంచి తనకి కావాల్సింది రాబట్టుకుంటాడు. అదే అతని స్ట్రాంగ్ పాయింట్.

ప్రశ్న) ఇప్పటి వరకూ 3 సినిమాలు చేసారు. అన్నీ కొత్త దర్శకులతోనే చేసారు. ఎందుకలా.?
స) అది అనుకోకుండా జరిగిన విషయమే.. కానీ ప్రతి డైరెక్టర్ చాలా టాలెంటెడ్, వారికి కావాల్సిన విషయంలో చాలా క్లారిటీ ఉంది. వారి నుంచి ఒక నటిగా ప్రతి సినిమాలోనూ చాలా విషయాలను నేర్చుకున్నాను. కొత్త దర్శకులే కాదు అందరితో పనిచేయాలని ఉంది.

ప్రశ్న) మీ 3 సినిమాల జర్నీలో మీకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది.?

స) నాకు మొదటి నుంచి ఇండస్ట్రీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఫస్ట్ సినిమా విషయంలో వంశీ చాలా కేర్ తీసుకున్నారు, అలాగే సెకండ్ సినిమా టైంలో మధు గారు కేర్ తీసుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పరిచయం కావడం, అలాగే వారి నుంచి నాకు వస్తున్న సపోర్ట్ విషయంలో ఇండస్ట్రీకి స్పెషల్ థాంక్స్.

ప్రశ్న) మీరు ముంబై గర్ల్.. సో హిందీలో ట్రై చేస్తున్నారా.? అలాగే తెలుగు వేరే సినిమాలు ఏమన్నా కమిట్ అయ్యారా.?
స) నేను ఉండేది ముంబైలోనే కావడం వలన హిందీలో కూడా ట్రై చేస్తున్నాను. కానీ మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. నేను ముంబైలో ఉన్నా ఎక్కువగా స్టొరీ సిటింగ్స్ కోసం ఇక్కడికి వస్తుంటాను. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను, కానీ ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు.

Exit mobile version