ఇంటర్వ్యూ : ఓంకార్ – ‘రాజుగారి గది’తో కమర్షియల్ సక్సెస్ ఆశిస్తున్నా!

Omkar
బుల్లితెరపై ఎన్నో సక్సెస్ఫుల్ రియాలిటీ షోస్ చేసి మంచి పేరు తెచ్చుకున్న ఓంకార్, బుల్లితెర నుంచి ప్రమోషన్ తీసుకుంటూ జీనియస్ అనే సినిమాతో దర్శకుడిగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్బ్ రిజల్ట్ ఇవ్వకపోయినా ఓంకార్‌కి దర్శకుడిగా మాత్రం మంచి పేరు తెచ్చి పెట్టింది. ‘జీనియస్’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది’ అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వస్తున్నారు. అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదలవుతోన్న సందర్భంగా దర్శకుడు ఓంకార్‌తో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

ప్రశ్న) ‘జీనియస్’ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ‘రాజుగారి గది’ అంటూ వస్తున్నారు. రాజుగారి గదిలో ఏముంది?

స) ‘జీనియస్’ సినిమా తర్వాత ఏదైనా కామెడీ ట్రై చేద్దామని ముందే ఫిక్స్ అయ్యా. ఆ క్రమంలోనే ఈ రాజుగారి గది అన్న కథ బాగుంటుందన్న ఆలోచనతో ఈ సినిమా మొదలుపెట్టా. ఇప్పుడున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా హర్రర్ కామెడీ జానర్లోనే సరికొత్త థ్రిల్స్ ఇస్తూ ఈ సినిమా నడుస్తూ ఉంటుంది. ఇక రాజుగారి గదిలో ఉన్న విషయం ఏంటో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే!

ప్రశ్న) ‘రాజుగారి కథ’ నిజంగా జరిగిన కథా? కల్పితమా? ఈ సినిమా కథా నేపథ్యం ఏంటి?

స) రాజుగారి కథ పూర్తిగా కల్పిత కథే! కథరీత్యా నందిగామ అనే గ్రామంలో ఒక పెద్ద మహల్ ఉంటుంది. ఆ మహల్‌కి ఎవ్వరు వెళదామని ప్రయత్నించినా, వాళ్ళంతా చనిపోతుంటారు. ఈ నేపథ్యంలో ఒకరికి ఒకరు సంబంధం లేని ఒక ఏడుగురు వ్యక్తులు ఈ మహల్‌కు వస్తే? అక్కడి పరిస్థితులు వాళ్ళను ఏం చేశాయ్? అనే అంశం చుట్టూ సినిమా సాగుతుంది.

ప్రశ్న) దర్శకుడిగా ‘జీనియస్’ తర్వాత ఏం నేర్చుకున్నారు. ఆ అనుభవాలు ఈ సినిమాకు ఎలా ఉపయోగపడ్డాయి?

స) ‘జీనియస్’ సినిమాకు మేం ముందుగా అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాం. దీంతో సినిమాకు మంచి పేరే వచ్చినా, కమర్షియల్‌గా మాత్రం సినిమా ఫెయిలైంది. అదీగాక జీనియస్ ఒక కంప్లీట్ సీరియస్ సినిమా. నా రెండో సినిమాకు మాత్రం పూర్తి మార్పు కావాలని కోరుకున్నా. అందుకు తగ్గట్టుగానే హర్రర్ కామెడీ కథని సిద్దం చేసుకొని ఆ సినిమాకు ఎంత పెట్టాలో అంతే ఖర్చు పెట్టి మంచి ఔట్‌పుట్ తెచ్చాం.

ప్రశ్న) రాజుగారి గది సినిమా ద్వారా దర్శకుడిగా మీరు కోరుకుంటుందేమిటి?

స) ఓ మంచి కమర్షియల్ సక్సెస్ అండీ. జీనియస్ సినిమాతో పేరొచ్చినా, కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. ఈ సినిమా మాత్రం పేరుతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ కూడా తేవాలని కోరుకుంటున్నా. ఇక మొదటి సినిమా అనుభవంతో నేర్చుకున్న పాఠాలు కూడా ఈ సినిమా ద్వారా కమర్షియల్ సక్సెస్‌ను తెచ్చిపడతాయని ఆశిస్తున్నా.

ప్రశ్న) ట్రైలర్ రిలీజ్ తర్వాత ఒక్కసారే ఈ సినిమాపై అంతటా ఆసక్తి పెరిగింది. ఇది ముందే ఊహించారా?

స) నిజమే.. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ సినిమాపై అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చెప్పాలంటే ఈ స్థాయి రెస్పాన్స్‌ను మేము కూడా ఊహించలేదు. ఇక ట్రైలర్ చూసి ఇంప్రెస్ అయి వారాహి చలనచిత్రం, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు ఈ సినిమాను విడుదల చేసేందుకు ముందుకు వచ్చాయి. ఒక చిన్న సినిమాకు ఇలాంటి పెద్ద సంస్థల అండ దొరకడంతో మా నమ్మకం రెట్టింపైంది.

ప్రశ్న) రాజుగారి గది నటీనటుల గురించి చెప్పండి? మీ తమ్ముడు అశ్విన్‌నే మెయిన్ రోల్‌కు ఎంపిక్ చేయడానికి కారణం?

స) రాజుగారి గది సినిమాలో మంచి హర్రర్, కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని సరిగ్గా పండించాలంటే నటీనటులు కూడా చాలా ముఖ్యం. ఈ సినిమాలో నటించిన వారంతా తమ తమ పాత్రలకు అద్భుతంగా న్యాయం చేశారు. ఇక ఈ సినిమాలో నా తమ్ముడు అశ్విన్ ఓ మెయిన్ లీడ్ చేశాడు. అశ్విన్ నా కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. అశ్విన్‌కిచ్చిన మాటను ఈ సినిమాతో నెరవేర్చా. తన రోల్‌ని అశ్విన్ చాలా బాగా చేశాడు.

ప్రశ్న) హర్రర్ సినిమా అంటే గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్‌కు పెద్ద ప్రాధాన్యం ఉంటుంది కదా. ఈ విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

స) ఈ సినిమా గ్రాఫిక్స్ మీకు ఎక్కడా ఒక చిన్న సినిమా గ్రాఫిక్స్ చూస్తున్నామనే ఫీలింగ్ తెప్పించవు. మేము ఇంతమంచి విజువల్ ఎఫెక్ట్స్‌ను చాలా తక్కువ ఖర్చుతో తీసుకురాగలిగాం. ఈ విషయంలో గ్రాఫిక్స్ టీమ్ కృషి మరువలేం. ఇక సాయి కార్తీక్ ఈ సినిమా రీ-రికార్డింగ్ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాడు. రేపు సినిమా చూశాక ఈ రెండు విభాగాల్లో ఆ కష్టాన్ని మీరే చూస్తారు.

ప్రశ్న) రాజుగారి గది మేజర్ హైలైట్స్ ఏంటి?

స) ‘రాజుగారి గది’ సినిమా ఔట్‌ అండ్ ఔట్ నవ్విస్తూ థ్రిల్ చేస్తుంది. భయపెట్టడం అనే కాన్సెప్ట్‌నే ఎక్కువగా నమ్మకుండా థ్రిల్స్, కామెడీకి మంచి ప్రాధాన్యతనిచ్చాం. దీంతో అన్నిరకాల ప్రేక్షకులూ ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

ప్రశ్న) రాజుగారి గది తర్వాతి సినిమా ఏంటి? మళ్ళీ రియాలిటీ షోస్ ఎప్పుడు చేస్తున్నారు?

స) రెండు పనులూ ఒకేసారి చేయకూడదనే రియాలిటీ షోస్‌కి బ్రేక్ ఇచ్చా. ప్రస్తుతం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మరొకటి రాజుగారి గది సీక్వెల్. రాజుగారి గది రిలీజ్ అయ్యాక కొత్త సినిమా పనులు మొదలుపెడతా. ఇక దర్శకుడిగా అన్ని జానర్లలోనూ సినిమాలు తీయాలన్నది నా కల. అందుకు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటున్నా.

Exit mobile version