హాస్యనటుడు మాడా వెంకటేశ్వరరావు ఇకలేరు

mada
తెలుగు సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాల పాటు పలు హాస్య పాత్రలతో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు మాడా వెంకటేశ్వర రావు గత రాత్రి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన నిన్న రాత్రి 11 గంటలకు జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పిటల్ లో కన్ను మూశారు. ఎక్కువగా మాడా తరహా పాత్రలతో మెప్పించిన ఆయన, ఈ తరహా పాత్రలకు తెలుగులో ఒక బ్రాండ్‌ను సెట్ చేశారు. 80వ దశకంలో తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన చాలా సినిమాల్లో మాడా తన ప్రత్యేకత చాటుకొని హాస్య నటుల్లో ఓ ముద్ర వేశారు.

అక్టోబర్ 10 1950లో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించిన మాడా వెంకటేశ్వరరావు ఈమధ్యే 65వ పడిలోకి అడుగుపెట్టారు. ఇక ముత్యాల ముగ్గు, మాయదారి మల్లిగాడు, చిల్లరకొట్టు చిట్టమ్మ లాంటి సినిమాల్లోని పాత్రల ద్వారా మాడా వెంకటేశ్వరరావు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక మాడా వెంకటేశ్వరరావు మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ 123తెలుగు తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నాం.

Exit mobile version