‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’ సినిమాతో రైటర్ గా పరిచయమై ఆ తర్వాత వెంకీ, ఢీ, రెడీ, అదుర్స్, దూకుడు, బాద్షా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన కోన వెంకట్ టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. రొటీన్ కమర్షియల్ సినిమాలతో పాటు తనకు నచ్చిన డిఫరెంట్ జానర్ సినిమాలు కూడా చేయాలని ట్రై చేసిన మొదటి ప్రయత్నం గీతాంజలి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలోనే చేసిన మరో క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘శంకరాభరణం’. డిసెంబర్ 4న రిలీజ్ కానున్న ఈ సినిమాకి కథ – కథనం – డైలాగ్స్ – నిర్మాత – దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టాడు. ఈ సందర్భంగా ఆయనతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం ఆ విశేషాలు మీకోసం..
ప్రశ్న) మీరో స్టార్ రైటర్.. అలాంటి మీకే స్ఫూర్తినిచ్చే అంశం ‘పస్ గయారే ఒబామా’లో ఏముంది?
స) 2010లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయిన సినిమా ‘పస్ గయారే ఒబామా’. ఈ సినిమాలో హీరో తను ఉన్న సమస్యల నుంచి తప్పించుకోవడం కోసం ఓ స్కీమ్ వేస్తాడు. ఆ స్కీమ్ టేకాఫ్ చాలా బాగుంది, అలాగే ఆ స్కీమ్ కాన్సెప్ట్ మా స్కూల్ దగ్గరిగా ఉంది. అలాగే బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా అనిపించింది. ఓవరాల్ గా హీరో వేసే స్కీమ్, బ్యాక్ డ్రాప్ నాకు బాగా నచ్చింది. ఆ రెండు తీసుకొని మన నేటివిటీకి తగ్గట్టుగా ఓ కథని సిద్దం చేసాను. శంకరాభరణంకి పస్ గయారే ఓబామా కథకి అస్సలు సంబంధం ఉండదు.
ప్రశ్న) మరి ఈ పాయింట్ ని తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఎంత కొత్తగా చూపించనున్నారు?
స) నాకు తెలిసి నేటివిటీ అనేది చూపించే ప్రాంతంలో కాదు, చూపించే ఎమోషన్ లో ఉంటుంది. అందుకే బాహుబలి అంత పెద్ద హిట్ అయ్యింది. శంకరాభరణం క్రైమ్ కామెడీ ఫిల్మ్. మన దగ్గర డేంజర్ ఏరియా అంటే రాయలసీమ ప్రాంతం లేదా తెలంగాణలో వరంగల్ చూపిస్తాం. కానీ అవి చూపిస్తే రొటీన్ అవుతుంది. వీటితో పోల్చుకుంటే 10 రెట్లు డేంజర్ అయిన ప్రాంతాలు బీహార్, ఉత్తరప్రదేశ్. అందుకే ఆ బ్యాక్ డ్రాప్ నాకు నచ్చి కథని అక్కడ సెట్ చేశాను.
ప్రశ్న) అసలు ఈ శంకరాభరణం కథ ఏంటి?
స) బీహార్ కరగ్ పూర్ లోని ఐఐటి యూనివర్సిటీలో ఓ తెలుగబ్బాయి, బిహారీ అమ్మాయి ప్రేమించుకుంటారు. కానీ బీహార్ లో గౌరవ హత్యలు(హానర్ కిల్లింగ్స్) ఎక్కువ. దానికి బయపడి పారిపోతారు. దాదాపు 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ వారిద్దరూ అక్కడికి రావాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు రాకుండా వాళ్ళ కొడుకు నిఖిల్ ని పంపిస్తారు. బీహార్ వచ్చిన నిఖిల్ ఏం చేసాడన్నదే కథ.
ప్రశ్న) మీ గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఉన్న కొత్త పాయింట్ ఏంటి?
స) మామూలుగా మీడియాలో, సోషల్ నెట్వర్క్స్ నుంచి వస్తున్న విమర్శలు.. ఇండస్ట్రీకి మేమొక టెంప్లెట్(విలన్ ఇంట్లోకి హీరో వెళ్లి కమెడియన్స్ తో విలన్ ని బురిడి కొట్టించడం) పరిచయం చేసామనే ముద్రపడింది. ఆ టెంప్లెట్ అనే ముద్రని మాపై నుంచి చేరిపెసుకోవడం కోసం, ఆ టెంప్లెట్ నుంచి బయటకి వచ్చి చేసిన సినిమా శంకరాభరణం.
ప్రశ్న) మరి మీరు క్రియేట్ చేసిన టెంప్లెట్ మీద ఇన్ని విమర్శలు వస్తున్నా ఎందుకు అదే ఫార్మాట్ లో సినిమాలు చేస్తున్నారు?
స) ఈ టెంప్లెట్ మీదే సినిమాలు చేస్తున్నప్పుడు నా మీద విమర్శలు వస్తున్నాయి, సోషల్ నెట్వర్క్స్ లో భూతులు వస్తున్నాయి. కానీ ఇక్కడ వారికి తెలియని విషయం ఏమిటంటే.. మా దగ్గర మంచి మంచి కథలు ఉన్నాయి తీసుకోండి అంటే ఎవ్వరూ తీసుకోవడం లేదు, ఆడుతున్నాయి కదా మాకు అదే టెంప్లెట్ లో సినిమాలు కావాలి అని ఫోర్స్ చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ అదే కథల్ని అడుగుతున్నారు. జస్ట్ డబ్బులో కోసమే కథలు రాయలేం, అందరితోనూ మాకు రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ ని కాదనలేక మళ్ళీ అదే కథలు రాయాల్సి వస్తోంది. ఆ ముద్రని చేరుపుకోవడం కోసం, ఆ టెంప్లెట్ ని ఫాలో అవకుండా చేసిన సినిమాలే గీతాంజలి, శంకరాభరణం.
ప్రశ్న) మరి ప్రేక్షకుల నుంచి వచ్చే నెగటివ్ కామెంట్స్ ని మీరెలా తీసుకుంటారు?
స) మామూలుగా రైటర్స్ లేదా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండే వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాంటి మమ్మల్ని తిడుతుంటే మా మనసు చివుక్కుమంటుంది. వారికి మేము ఏమీ ద్రోహం చేయలేదు. వారికి ఇక్కడి వాస్తవాలు తెలియదు. వాళ్ళకి వాస్తవాలు చెబితే మా డైరెక్టర్స్, హీరోస్, ప్రొడ్యూసర్స్ బాడ్ అవుతారు. అలాంటివి మేం చెప్పలేం. అందుకే అలాంటి వారికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ‘చూస్తారా చస్తారా అన్న ఫీలింగ్ లో నేను రాసినవి కాదు, మీరు రాస్తారా చస్తారా అంటే రాసిన కథలు అవి’, అది ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ టెంప్లెట్ నుంచి టాలీవుడ్ ని బయటపడేయడానికి నేను చేసిన చిరు ప్రయత్నమే ‘శంకరాభరణం’.
ప్రశ్న) మీరొక స్టార్ రైటర్, మరి సరికొత్త కథలతో స్టార్ హీరోస్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నించలేదా?
స) స్టార్ హీరోస్ అనగానే సమస్య ఎక్కడ వస్తుంది అంటే.. వారికో ఇమేజ్ అండ్ ఫ్యాన్ బేస్ ఉంది. దాని వలన ఏమవుతుందంటే అభిమాని కథలోని పాత్రని చూడడం లేదు, అభిమానించే స్టార్ హీరోని మాత్రమే చూస్తున్నాడు. అందుకే స్టార్ హీరోస్ అలాంటి సినిమాలు చేయడానికి కాస్త వెనకాడుతున్నారు. ప్రస్తుతం డిఫరెంట్ కమర్షియల్ సినిమాలను చిన్న హీరోలు ఎక్కువగా ట్రై చేసి సక్సెస్ అవుతున్నారు. కానీ ఎప్పుడైతే స్టార్ హీరోస్ ఇమేజ్ చట్రాన్ని పక్కన పెట్టి డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేయడానికి ముందుకు వస్తారో అప్పుడు ఇండస్ట్రీలో త్వరగా మార్పు వస్తుంది. నాకు తెలిసి స్టార్ హీరోస్ లో కూడా మార్పు త్వరలోనే వస్తుందని భావిస్తున్నాను.
ప్రశ్న) నిఖిల్ అండ్ నందితలను ఈ సినిమాకి ఫస్ట్ చాయిస్ గా ఎంచుకోవడానికి గల కారణం ఏమిటి?
స) పైన చెప్పినట్టు నా ‘శంకరాభరణం’ కథలో పాత్ర మాత్రమే కనపడాలి, హీరో కనిపించకూడదు. అలా అనుకున్నప్పుడు నా మదిలో మెదిలిన మొదటి హీరో నిఖిల్. అలాగే నిఖిల్ అంటే కొత్త కథలతో ప్రయోగాలు చేస్తాడు అనే ముద్ర ఉంది. సో నేను చేసే ఈ ప్రయోగానికి తనైతేనే పర్ఫెక్ట్ అని అనుకున్నాక తనకి కథ చెప్పాను. తను వెంటనే ఓకే చెప్పాడు. ఇక సినిమాలో నందిత రాజ్ పాత్ర పేరు హ్యాపీ ఠాకూర్.. విలేజ్ లో ఉండే చాలా మోడ్రన్ గర్ల్, ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే తను అసలు అమెరికాలో పుట్టాల్సింది, మిస్టేక్ గా బీహార్ లో పుట్టేసింది అని ఫీలయ్యే అమ్మాయి. చాలా ఫన్నీగా ఉండే పాత్ర. ఫ్రెష్ నెస్ మరియు పెర్ఫార్మన్స్ చేయగలిగిన అమ్మాయి కావాలి, అందుకే నందితని సెలక్ట్ చేసుకున్నాను.
ప్రశ్న) ఇప్పటి వరకూ హోమ్లీ గర్ల్ గా కనిపించిన అంజలిని రౌడీ రాణి పాత్రలో చూపించడానికి గల కారణం ఏంటి?
స) అంజలి విషయంలో మీకో విషయం చెప్పాలి. రీసెంట్ గా డిక్టేటర్ సినిమా షూటింగ్ లో బాలయ్య అంజలి గురించి చెబుతూ ‘ఈ అమ్మాయి సైన్ జెమిని, ఈ అమ్మాయిని భరించడం కష్టం, ఈ సైన్ వాళ్ళలో విపరీతమైన ఎనర్జీ ఉంటుందని’ అన్నారు. అది నిజం. నా జర్నీలో అంజలిని గురించి తెలుసుకుంది ఏమిటి అంటే అంజలి చాలా డామినెంట్ స్వభావం ఉన్న అమ్మాయి. అలా అని నెగటివ్ బిహేవియర్ ఉండదు. అందుకే ఆ రియల్ లైఫ్ పాత్రని నా సినిమాలో బందిపోటు రాణి పాత్రకి సెట్ చేసి ఆన్ స్క్రీన్ చూపించగలిగితే సూపర్బ్ గా వర్కౌట్ అవుతుందని ప్లాన్ చేసి తనని ఫిక్స్ చేసాం.
ప్రశ్న) ప్రేక్షకులని థ్రిల్ చేసే అంశాలు ‘శంకరాభరణం’లో ఏమున్నాయి?
స) శంకరాభరణం కి బిగ్గెస్ట్ హైలైట్స్ గా నిలిచేది కాన్సెప్ట్ అండ్ బ్యాక్ డ్రాప్. బీహార్ నేపధ్యం, అక్కడి వాతావరణం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్తదనాన్ని ఇవ్వడమే కాకుండా, థ్రిల్ చేసేలా ఉంటుంది.
ప్రశ్న) మీ కథల్లో కామెడీకి పెద్ద పీట వేస్తారు. మీ ప్రకారం ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే అంటారా?
స) కాదండి.. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీ మాత్రమే కాదు, ఎంటర్టైన్మెంట్ అంటే నవరసాలని కలిపి ఓ ఎమోషన్ ని ఆడియన్స్ కి ఎంగేజ్ అయ్యేలా చెప్పడం. కామెడీ అనేది కథలో ఉండాలి తప్ప, కామెడీ కోసం కథ రాయకూడదు అలాగే కథని ఆపి కామేడీ చేయకూడదు. ఎంటర్టైన్మెంట్ అనే సినిమాలు జనాలకు ఎక్కువగా గుర్తుండి పోతాయి. అందుకే నా కథల్లో భాగంగానే కామెడీ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను.
ప్రశ్న) రైటర్ నుంచి డైరెక్టర్ గా మారుతానని చెప్పారు, మరి డైరెక్టర్ గా మీ మొదటి సినిమా ఎప్పుడు? ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు?
స) అవును.. ఉన్న కమిట్ మెంట్స్ వలన లేట్ అయ్యింది, వచ్చే ఏడాది డైరెక్టర్ గా సినిమా చేస్తాను. ఇక నుంచి నేను రాసుకునే కథలన్నిటికీ నేనే దర్శకత్వం వహించాలనుకుంటున్నాను. ఇక నుంచి రొటీన్ సినిమాలు చేయను, తెలుగు ఆడియన్స్ ఇప్పటివరకూ చూడని స్టొరీ లైన్ అని నాకు అనిపించినప్పుడు కథ రెడీ చేసి, ఆ కథకి సెట్ అయ్యే హీరోని ఎంచుకొని సినిమా చేస్తాను. అలాగే ఎక్కువ రియలిస్టిక్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నాను.
ప్రశ్న) 99వ సినిమా డిక్టేటర్ లో బాలయ్యని ఎంత కొత్తగా చూపించనున్నారు?
స) దాదాపు 15ఏళ్ళ సాన్నిహిత్యం ఉంది. బాలయ్య చాలా మోడరన్ గా ఆలోచిస్తారు. బాలయ్య చూడడానికి ఆయన ఆలోచించే విధానానికి పూర్తి వైవిధ్యం ఉంటుంది. సరికొత్త సినిమాలు చేయడానికే ఇష్టపడతాడు. డిక్టేటర్ లో బాలయ్య చేసిన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మా మార్క్ కామెడీ ఉంటూనే, బాలయ్య పవర్ కూడా కనపడుతుంది. డిక్టేటర్ అనే సినిమా బాలయ్యని మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసే సినిమా అవుతుంది. అలాగే బాలయ్య సినిమాలో మొదటిసారి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకునే కామెడీ ఉంటుంది.
ప్రశ్న) ఫైనల్ గా ‘శంకరాభరణం’ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూడాలి అంటారు?
స) తెలుగు ప్రేక్షకులు వద్దనుకుంటున్న ఫార్ములా, చూడాలని అనుకుంటున్న కొత్తదనం, వారు ఎప్పుడూ ఇష్టపడే ఎంటర్టైన్మెంట్ ఈ ‘శంకరాభరణం’లో చూస్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా నవ్వుకొని బయటకి వచ్చే సినిమా ‘శంకరాభరణం’.
అంతటితో కోన వెంకట్ తో మా ఇంటర్వ్యూని ముగించి, ‘శంకరాభరణం’ పెద్ద హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాం..
ఇంటర్వ్యూ – రాఘవ