విడుదల తేదీ : 4 డిసెంబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : సురేంద్ర జి.ఎల్.
నిర్మాత : రవికుమారు డి.ఎస్.
సంగీతం : ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి
నటీనటులు : రవిబాబు, రవనీత్ కౌర్, అశ్విన్, సుమన్..
సితార అన్న టైటిల్ వింటే తెలుగు సినీ అభిమానికి ప్రముఖ దర్శకుడు వంశీ రూపొందించిన క్లాసిక్ ‘సితార’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పుడదే టైటిల్‌తో రవిబాబు ప్రధాన పాత్రలో దర్శకుడు సురేంద్ర జి.ఎల్ ఒక సినిమా రూపొందించారు. పాత ‘సితార’ సినిమాలోలానే సినిమానే బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొని రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ దర్శకుడు, హీరోయిన్ మధ్యన జరిగే ఓ ఆసక్తికర కథనంతో నడిచే సినిమాగా ప్రచారం పొందిన సితార ఎంతమేరకు ఆకట్టుకుందీ? చూద్దాం..
కథ :
సినిమా సెట్లో అనుమానాస్పదంగా చనిపోయిన హీరో హీరోయిన్లది ఆత్మహత్య కాదని, అది హత్యంటూ వచ్చిన ఓ ఫిర్యాదుతో ‘సితార’ కథ మొదలవుతుంది. అసలు కథలోకి వెళితే.. ప్రఖ్యాత దర్శకుడైన రఘురామ్ (రవిబాబు) కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఓ సినిమా ప్లాన్ చేస్తాడు. ఆ సినిమా కోసం తారలను అన్వేషిస్తుండగా అతడికి సితార (రవనీత్ కౌర్) కనిపిస్తుంది. సితారే తన సినిమాకు సరిగ్గా సరిపోతుందంటూ ఆమెను తన సినిమా హీరోయిన్గా నటించేలా ఒప్పించి సినిమా తీయడం మొదలుపెడతాడు.
ప్రేమ అంటే అది కోరుకునేది కేవలం శారీరక సుఖం మాత్రమే అన్న విషయాన్నే కథాంశంగా ఎంచుకొని సినిమా ప్లాన్ చేసిన రఘురామ్‌కు షూటింగ్ సమయంలో సితారపై కోరిక పుడుతుంది. సితార మాత్రం అదే సినిమాకు హీరో అయిన విశాల్ (అశ్విన్)ను ప్రేమిస్తుంది. వీరిద్దరి వ్యవహారం ఏమాత్రం ఇష్టపడని రఘురామ్ ఆ తర్వాత విపరీతంగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సితార నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? రఘురామ్ హత్య చేశాడా? రఘురామ్ శిష్యురాలైన మోనా(రీనా) ఈ విషయాన్ని తన సినిమా ద్వారా ఎలా బయటపెట్టింది? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘సితార’.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథను మొదలుపెట్టిన విధానం, మొదటి పదిహేను, ఇరవై నిమిషాల పాటు ఆ కథను వీలైనంత ఆసక్తికరంగా నడపడం గురించి చెప్పుకోవచ్చు. మోనా అనే పాత్ర ఒక సినిమా తీయడం, ఆ సినిమా కథే సితార సినిమాకు అసలు కథ కావడం, ఈ రెండింటినీ ప్యారలల్‌గా చెప్పడం సితారకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్‌ను కూడా సినిమాటిగ్గానే చెప్పుకొచ్చినా కొంతలో కొంత ఫర్వాలేదనిపించారు.
ఇక రవిబాబును ఈ సినిమాకు ఓ పిల్లర్‌గా చెప్పుకోవచ్చు. రవిబాబు తనదైన బ్రాండ్ యాక్టింగ్‌తో సినిమాను నడిపించడంలో ఆయన వరకూ బాగా సక్సెస్ అయ్యారు. రవనీత్ కౌర్ నటనపరంగా పెద్దగా చేసిందేమీ లేకపోయినా, అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇక కౄష్ణ భగవాన్ తనదైన కామెడీ పంచ్‌లతో చాలా చోట్ల నవ్వులు పూయించారు. కాస్త డబుల్ మీనింగ్ ఎక్కువైనా కూడా మిగతా చోట్ల కృష్ణ భగవాన్ కామెడీ మంచి రిలీఫ్. చిత్రం శీను గ్యాంగ్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశారు.
మైనస్ పాయింట్స్ :
సితార సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే చెప్పాలనుకున్న కథను థ్రిల్లర్‌లా చెప్పాలి లేదా డ్రామాగా చెప్పాలి, కానీ కథనంలో చేసిన పొరబాటు వలన సితార సినిమా అటు ఇటూ కాకుండా పోయింది. నిజానికి ఈ కథను థ్రిల్లర్‌గా చెప్పే అవకాశం ఉన్నా దాన్ని మొదటి పది నిమిషాలకే తేల్చేసి, మర్డర్ పాయింట్‌ను ఎలా చెప్తారన్న సస్పెన్స్ ఎలిమెంట్‌గా మాత్రమే మిగిల్చారు. రెండు గంటల సినిమాను కేవలం ఈ చిన్నదైన, ముందే తెలిసిపోయిన విషయంతో నడపడంతో కథ సాగుతూ పోతుందంతే..
ఇక మధ్యలో చాలా సన్నివేశాలు ఎందుకు వచ్చి ఎందుకు వెళుతుంటాయో తెలీదు. ఈ సినిమా అసలు కథను, సినిమాలో మరో సినిమాగా చెప్పే ప్రయత్నం బాగున్నా, ఈ రెండు బ్యాక్డ్రాప్స్లోనూ సన్నివేశాలు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. ఇకపోతే ప్రేమంటే శృంగారం మాత్రమే అన్న అభిప్రాయాన్ని దర్శకుడు చాలాసార్లు చెప్పకనే చెప్పడం వాళ్ళ అభిరుచికి నిదర్శనం. చాలా చోట్ల డబుల్ మీనింగ్ డైలాగ్స్ చాలా ఎక్కువయ్యాయి. ఇక సినిమాలో క్యారెక్టరైజేషన్, క్యారెక్టరైజేషన్ అంటూ చెప్పుకొచ్చిన దర్శకుడు తన సినిమాలో మాత్రం రవిబాబు పాత్రను మినహాయిస్తే ఎక్కడా క్యారెక్టరైజేషన్‌ను పెద్దగా పట్టించుకున్నట్టు కనపడదు. పాటలు కూడా ఎందుకొస్తాయో అర్థం కాదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. దర్శకుడు సురేంద్ర ఏం చెప్పాలనుకున్నాడో ఆయనకే క్లారిటీ లేదు. అలాంటి క్లారిటీ లేని స్టొరీ లైన్ ని, ఒక పద్ధతి లేని సన్నివేశాలతో పేర్చుకుంటూ చెప్పడంలో రచయితగా సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. అయితే దర్శకుడిగా మాత్రం కొన్నిచోట్ల సురేంద్ర ప్రతిభను గమనించవచ్చు. సినిమాలో సినిమా ద్వారా కథ చెప్పడం, క్లైమాక్స్‌లో మూడ్‌ను సరిగ్గా క్యాప్చర్ చేసేలా మూడు సినిమాలతో కథను పూర్తి చేయడం బాగుంది. అయితే అవి మినహాయిస్తే చాలా చోట్ల దర్శకుడికి సరైన క్లారిటీ లేక సితారను అక్కడే ఉంచేశాడు.
ఇక సంగీత దర్శకుల పనితనం గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. అవి సినిమాలో అసందర్భంగా రావడమే కాక, ఆకట్టుకునేలానూ లేవు. నేపథ్య సంగీతం మాత్రం ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ బళ్ళారి రఘు పనితనం బాగుంది. కొన్ని చోట్ల షాట్ కంపోజిషన్‌లో చేసిన ప్రయోగం కూడా బాగుంది. నందమూరి హరి ఎడిటింగ్ ఆకట్టుకునేలా లేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతలో ఫర్వాలేదు.
తీర్పు :
సినిమా నేపథ్యం నుంచి ఇప్పటికే తెలుగులో చాలా కథలు రాగా, అదే నేపథ్యాన్ని ఎంచుకొని కొత్త లైన్ తో వచ్చిన సినిమా ‘సితార’. తెలుగు సినిమాలలో క్లాసిక్ అనదగ్గ పేరు సంపాదించుకున్న సితార అనే టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఎప్పట్లానే అసలు కథను పక్కదారి పట్టించి ఏదేదో చూపించేసిన కొన్ని చిన్న సినిమాల జాబితాలో చేరిపోయే సినిమా. ముందే తెలిసిన ఓ కథ, పెద్దగా ఆకట్టుకోని తరహా స్క్రీన్‌ప్లే, ఎందుకొస్తున్నాయో తెలియని వరుస సన్నివేశాలు, పాటల సందర్భాలను మైనస్ పాయింట్స్‌గా నింపుకొని మనముందుకు వచ్చిన ఈ సినిమాను కాపాడగలిగేవి ఏవైనా ఉన్నాయా అంటే అవి రవిబాబు యాక్టింగ్, ఫర్వాలేదనిపించే కామెడీ, మొదటి ఇరవై నిమిషాలు, క్లైమాక్స్ పార్ట్ అని చెప్పుకోవచ్చు. మరిలా అతికొద్ది ప్లస్ పాయింట్స్‌తో వచ్చిన ఈ ‘సితార’ ఎక్కడా మెరవకుండా చీకట్లో కలిసిపోయింది.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
123తెలుగు టీం