ఇంటర్వ్యూ : మాళవిక నాయర్ – హీరోయిన్‌ అవుతానని అస్సలనుకోలేదు!

Malavika-Nair
మాళవిక నాయర్.. ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయమై, మొదటి సినిమాతోనే అభిమానులను సైతం ఏర్పరచుకున్న మళయాల భామ. ఆ తర్వాత మళ్ళీ దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో మరోసారి మెప్పించేందుకు సిద్ధమైపోయారు. నాగ శౌర్య, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జనవరి 22న విడుదల కానుంది. ఇక నేడు పుట్టినరోజు జరుపుకున్న మాళవిక, కళ్యాణ వైభోగమే సినిమా గురించి, తన కెరీర్ గురించీ పంచుకున్న విశేషాలు..

ప్రశ్న) ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. కెరీర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు?

స) థ్యాంక్స్! నా కెరీర్‌ని నేనెప్పుడూ ప్లాన్ చేయలేదు. హీరోయిన్ అవుతానని కూడా అస్సలు అనుకోలేదు. అంతా అనుకోకుండానే జరిగిపోయింది. నాన్న సలహాతో చిన్నప్పట్నుంచే మళయాలంలో చిన్న చిన్న పాత్రలు చేయడం, ఆ తర్వాత ఎవడో సుబ్రమణ్యంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం, ఇప్పుడు కళ్యాణ వైభోగమే… ఇలా ఏదీ ప్లాన్ చేయలేదు. ప్రస్తుతానికి కెరీర్ ఎలా ఉండాలీ అన్న ఆలోచన కూడా లేదు.

ప్రశ్న) పుట్టినరోజు సందర్భంగా ఏమేం నిర్ణయాలు తీసుకుంటున్నారు?

స) ఈ రోజుతో నేను మేజర్‌నయ్యా. సో, నాకంటూ ఓ ఆలోచన విధానం, బలమైన సిద్ధాంతం ఏర్పరచుకునేలా కృషి చేస్తా. ప్రస్తుతం ఢిల్లీలో పన్నెండో తరగతి చదువుతున్నా. కెరీర్, చదువు.. రెండింటినీ బ్యాలన్స్ చేసుకోవాలి.. అంతే!

ప్రశ్న) ‘కళ్యాణ వైభోగమే’ సినిమా గురించి చెప్పండి?

స) కళ్యాణ వైభోగమే.. నందిని స్టైల్ లవ్‌స్టోరీ. పెళ్ళికి ముందు, పెళ్ళి తర్వాత రిలేషన్‌షిప్‌లో ఉన్న జంట ఆలోచనల చుట్టూ సినిమా నడుస్తుంది. వీళ్ళిద్దరి ఆలోచనలకు, పెద్దవాళ్ళ నిర్ణయాలకు మధ్య జరిగే సంఘర్షణను కూడా ఈ సినిమాలో చూపించాం. ‘అలా మొదలైంది’కి సీక్వెల్‌లా ఉంటుందా అని కొందరు అడుగుతున్నారు. రెండూ ప్రేమకథలే కాబట్టి పోలిక ఉండొచ్చు. ఇది వేరే కోణంలో సాగే కథ. సో, ఆ సినిమాకు సీక్వెల్ అనలేం.

ప్రశ్న) ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత ఏమేం ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమానే ఎంపిక చేసుకోవడానికి గల కారణం?

స) ఎవడే సుబ్రమణ్యం తర్వాత నాకు హీరోయిన్‌గా చాలా అవకాశాలే వచ్చాయి. కళ్యాణ వైభోగమే సినిమా నాకు సరిగ్గా సరిపోతుందనిపించింది. కథ, నా పాత్ర కూడా బాగా నచ్చాయి. నాన్న కూడా ఈ సినిమాకే మొగ్గు చూపడంతో ఇదే ఫైనల్ అయిపోయింది.

ప్రశ్న) ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతోంది?

స) నేను దివ్య అనే ఓ అమ్మాయి పాత్రలో కనిపిస్తా. కొన్నిచోట్ల నన్ను నేను చూసుకునేలా కూడా ఉంటుందీ పాత్ర. ఈతరం అమ్మాయి ఎలా ఆలోచిస్తుందో దివ్య కూడా అలాగే ఉంటుంది. నందిని పర్ఫెక్ట్‌గా ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసింది.

ప్రశ్న) దర్శకురాలు నందిని రెడ్డి గురించి చెప్పండి?

స) నందిని రెడ్డి మంచి ఫ్రెండ్‌లా అన్నీ దగ్గరుండి చూసుకునేది. యాక్టింగ్ పరంగా, తెలుగు భాష పరంగా ఆమె దగ్గర్నుంచి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాకు నేనే స్వయంగా డబ్బింగ్ కూడా చెబుతుండడంతో, ఆ పరంగానూ ఆమె ఇచ్చిన సలహాలు మరచిపోలేను. షూటింగ్ కూడా అంతా సరద సరదాగా సాగిపోయింది.

ప్రశ్న) తదుపరి సినిమా ఏంటి?

స) ప్రస్తుతానికి ఏదీ ఒప్పుకోలేదు. ఏప్రిల్‌ వరకూ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ తర్వాతే ఏదైనా సినిమా కమిట్ కాగలను. నందిని రెడ్డితోనే మరో సినిమా చేయాలి. అది ముందే మొదలైతే అదే నా నెక్స్ట్ సినిమా అవుతుంది.

Exit mobile version