సమీక్ష : అప్పుడలా.. ఇప్పుడిలా – ఎక్కడా మెప్పించలేదు!

Savitri review

విడుదల తేదీ : ఏప్రిల్ 1 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కె.ఆర్.విష్ణు

నిర్మాత : ప్రదీప్ కుమార్ జంపా

సంగీతం : సునీల్ కశ్యప్

నటీనటులు :సూర్యతేజ, హర్షికి పూనాచా..


’వినాయకుడు’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్యతేజ చాలాకాలం తర్వాత హీరోగా నటించిన సినిమా ’అప్పుడలా.. ఇప్పుడిలా’. జంపా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రదీప్ కుమార్ జంపా నిర్మించిన ఈ సినిమాకి కె.ఆర్.విష్ణు దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

లక్ష్మినారాయణ (సుమన్) స్వీట్స్ వ్యాపారం చేస్తుంటాడు. తను జీవితంలో స్థిరపడటానికి సాయపడిన నలుగురి వ్యక్తులకు సాయం చేసి వారి రుణం తీర్చుకోవాలని అనుకుంటూ వారు ఎక్కడ ఉన్నారో కనుక్కొని మరీ సాయం చేస్తాడు. ముగ్గురికి సాయం చేసిన తరువాత ఆయన చనిపోతాడు. తన కొడుకైన చైతన్య (సూర్యతేజ) ఆ చివరి వ్యక్తి అయిన బిజినెస్ మాగ్నెట్ జగదీశ్ చంద్ర (సీనియర్ నరేష్) ని కలుసుకొని తన తండ్రి కోరిక ప్రకారం తనకు సాయం చేసే అవకాశం కల్పించాలని కోరతాడు. ముందు తనకి ఎవరి సాయం అక్కరలేదని జగదీశ్ చంద్ర అన్నా చైతన్య తన పట్టువదలకపోవడంతో చివరికి జగదీశ్ చంద్ర ఒక సాయం చేయాల్సిందిగా కోరతాడు. ఆ సాయం ఏంటి? అంటే తన కూతురు రూప (హర్షికి పూనాచా) ని ప్రేమించమని చైతన్య ని కోరతాడు. జగదీశ్ చంద్ర అలా ఎందుకు కోరాడు? ఆ తర్వాత చైతన్య జీవితం లో ఏం జరిగిందన్నది మిగతా కథ..

ప్లస్ పాయింట్స్ :

’తనకి సాయం చేసిన వారికి తిరిగి సాయం చేయాలనే’ అని దర్శకుడు తీసుకున్న కథాంశం బావుంది. హీరో సూర్యతేజ తన శక్తిమేరా బాగా నటించాడు. అతడి కామెడీ టైమింగ్ కూడా సినిమాకు మంచి ఉత్సాహాన్ని తెచ్చింది. హీరోయిన్ అందంగా ఉంది. తన నటన కూడా ఫరవాలేదు. వీరిద్దరి మధ్యన వచ్చే రెండు మాంటేజ్ సాంగ్స్ బాగున్నాయి. అదేవిధంగా నరేష్, సూర్యతేజల మధ్యన వచ్చే కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా అక్కడక్కడా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ అంటే చెప్పడానికి చాలానే ఉన్నాయి. సినిమా కథలో మంచి పాయింట్ ఉన్నా కథనంలో ఏ ఒక్క విషయాన్ని స్పష్టంగా ప్రేక్షకులు అనుభూతి చెందేటట్లు దర్శకుడు తీయలేకపోయాడు. కథనంలో ఏ విషయమూ ప్రేక్షకుడికి ఈ సినిమా చూడాలి అనే ఆసక్తి కలిగించదు. ఇలాంటి కథనానికి తోడు నేరేషన్ బాగా స్లోగా ఉంది. ఈ సినిమా నిడివి కూడా ఈ సినిమాకి మైనస్ అనే చెప్పుకోవాలి. ప్రధమార్థం లో పాటలను పట్టించుకోని దర్శకుడు ద్వితీయార్థంలో మాత్రం సందర్భం లేకుండానే పాటలు పెట్టడానికి ఉత్సాహం చూపాడు. సినిమాలో ఏ పాత్రని పర్ఫెక్ట్ గా రాసుకోలేదు.

ఇక ఈ సినిమాలో బబ్లీ రెడ్డి గా సుప్రీత్ ట్రాక్ ఎటువంటి ఎమోషన్ కలిగించలేదు. పైగా కథనానికి అడ్డుపడింది కూడా. హీరో హీరోయిన్లు కలపడానికి రాసుకున్న లక్షరూపాయల ట్రాక్ కూడా అంత ఆసక్తి కలిగించదు. ఈ కథకి ’అప్పుడలా.. ఇప్పుడిలా’ అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఉదాత్తమైన కథాంశం ఎన్నుకున్న దర్శకుడు హృదయానికి హత్తుకునేలా కొన్ని సన్నివేశాలు రాసుకుని ఉంటే బావుండేది.

సాంకేతిక విభాగం :

’అప్పుడలా.. ఇప్పుడిలా’ అనే సినిమాకి టెక్నికల్ గా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నదాంట్లో సినిమాటోగ్రఫీ మాత్రమే ఫరవాలేదనిపిస్తుంది. కథనం అనేది అస్సలు బాలేదు. ఎడిటింగ్ కూడా అస్సలు బాలేదు. ఇక పోతే డైరెక్టర్ రాసుకున్న సీన్స్ ని పర్ఫెక్ట్ గా తీయడంలో, ప్రధాన నటీనటుల నుంచి పర్ఫెక్ట్ నటనని రాబట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక సునీల్ కశ్యప్ అందించిన పాటల్లో రెండు బావున్నాయి కానీ నేపధ్య సంగీతం మాత్రం అస్సలు బాలేదు. ఎడిటింగ్ ఈ సినిమాకి ప్రధానంగా మైనస్ అని చెప్పుకోవాలి. ఆర్ట్ వర్క్ కూడా అంతంత మాత్రంగా ఉంది. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాణ విలువలు డీసెంట్ అనేలా ఉన్నాయి.

తీర్పు :
చాలా ఉదాత్తమైన కథాంశం ఉన్నా ఏమాత్రం ఆసక్తి కలిగించని కథనంతో వచ్చిన ’అప్పుడలా.. ఇప్పుడిలా’ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయిందనే చెప్పాలి. కథలోని బేసిక్ అంశం, హీరో, హీరోయిన్ల నటన, హీరో పాత్ర మ్యానరిజమ్స్‌తో పుట్టుకొచ్చే కామెడీ తదితర అంశాలను ప్లస్‌లుగా నింపుకున్న ఈ సినిమాలో ఒక పూర్తి స్థాయి సినిమాను ఎంజాయ్ చేయడానికి కావాల్సిన ఇతర అంశాలేవీ లేకపోవడం ప్రతికూలాంశం. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘అప్పుడలా.. ఇప్పుడలా’ ఎప్పుడూ మెప్పించలేని ఓ అర్థం లేని సినిమాగానే నిలిచింది.

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version