సమీక్ష : పిడుగు – కొత్తవాళ్ళేగానీ.. కొత్తగా ఏమీ లేదు!

Pidugu review

విడుదల తేదీ : ఏప్రిల్ 29, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సి. హెచ్. రామమోహన్ 

నిర్మాత : అశోక్ గోటి

సంగీతం : కార్తిక్, విజయ్ కురాకుల 

నటీనటులు : వినీత్, మోనికా సింగ్, వినోద్ కుమార్, బెనర్జీ 


నిర్మాత అశోక్ గోటి తన కుమారుడు వినీత్‌ను హీరోగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు సి. హెచ్. రామమోహన్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘పిడుగు’. ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

నగరాల్లో బాగా డబ్బున్న వాళ్లను టార్గెట్ చేసి వాళ్లకు అమ్మాయిలను ఎరగా వేసి చివరికి వాళ్ళను చంపేసి వాళ్ళ ఆస్థిని లీగల్ గా చేజిక్కించుకునే ఒక గ్యాంగ్ ఉంటుంది. ఆ గ్యాంగ్ పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకైన హీరో జై (వినీత్)ను కూడా బుట్టలో వేసుకోవాలనుకుని ప్లాన్లు వేస్తుంటారు. ఆ సమయంలోనే హీరో జై లాంటి మరొక వ్యక్తి, జై జీవితంలోకి ప్రవేశించి అతని కుటుంబాన్ని, వ్యాపారాన్ని ఇబ్బంది పెడుతుంటాడు.

అలా తన జీవితంలోకి ప్రవేశించిన తనలాంటి మరొక వ్యక్తిని, ఆ గ్యాంగును జై ఎలా ఎదుర్కుంటాడు..? అసలు ఆ వ్యక్తి ఎవరు..? జైను టార్గెట్ చేసిన గ్యాంగ్ వెనుక ఉన్న మనుషులెవరు..? వాళ్ళను అంతం చేయడానికి జై ఎలాంటి ప్లాన్ వేశాడు..? చివరికి ఆ గ్యాంగును అంతం చేశాడా.. లేదా..? అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కథ. మొదట సాధారణ కథగా మొదలైనా, ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ సెకండ్ హాఫ్‌పై ప్రేక్షకుడికి కొంత ఆసక్తి, ఆతృతను పెంచుతుంది. సినిమాను స్టార్ట్ చేసేటప్పుడే ఓ ప్రశ్నను ప్రేక్షకుల మదిలో వదిలి మిగతా కథను నడిపి, సినిమా ఆఖరులో ఆ ప్రశ్నకు దర్శకుడు రామమోహన్ సి. హెచ్ సమాధానం ఇచ్చిన విధానం బాగానే ఉంటుంది. అలాగే సినిమాకు మరొక ప్లస్ పాయింట్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో ఒక్కొకటిగా రివీల్ అయ్యే ట్విస్టులు ఒక్కసారి సినిమా మొత్తాన్ని మైండ్ లో రివైండ్ చేసుకునేలా చేస్తాయి.

ఇక హీరో వినీత్ కథ కోసం డిఫరెంట్ మాడ్యులేషన్స్ చూపడానికి చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది.  మొదటి సినిమాలోనే వినీత్ నటనలో సహజత్వం, డ్యాన్సుల్లో ఈజీనెస్, ఫైట్లలో అగ్రెసివ్ నెస్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. అదేవిధంగా సినిమా మొదటి అర్థంలో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ఏడు జన్మల బంధం అనే కామెడీ కాన్సెప్ట్ వర్కవుటయింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా నడుస్తున్నంత సేపు చాలా సన్నివేశాలను అవసరం కోసం అప్పటికప్పుడు సినిమాలోకి తీసుకొచ్చి ఇరికిచ్చినట్లు ఉంటుంది. పైగా ఒక సన్నివేశం నడుస్తూ నడుస్తూ అర్థాంతరంగా ముగిసి సంబంధంలేని మరొక సన్నివేశంలోకి కథ వెళ్ళిపోతుంది. అది ప్రేక్షకుడికి చికాకు తెప్పిస్తుంది. సినిమా ప్రధాన కథాంశం బాగానే ఉన్నా, దర్శకుడు ఇంటర్వెల్, ప్రీ క్లైమ్యాక్స్ ఎపిసోడ్ మినహా ఎక్కడా సమర్థించగల కథనాన్ని నడపలేదు.

సినిమా అప్పటికే నెమ్మదించిన సమయంలో మధ్యలో వచ్చే జబర్దస్త్ ఫణి అర్థం లేని కామెడీ సినిమాపై ఆ కాస్త ఆసక్తిని నీరుగారుస్తుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటల్లోని సంగీతం ఇదేం గొడవరా.. బాబు అనేలా ఉన్నాయి. ఇకపోతే హీరో వినీత్ ఫర్వాలేదనిపించినా, చాలాచోట్ల అతడి నటనలో సహజత్వం లోపించింది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సిహెచ్ రామమోహన్ గురించి చెప్పుకుంటే.. ఇంటర్వెల్, క్లైమ్యాక్స్ ట్విస్టుల్లో కథనాన్ని నడిపిన విధానంలో రచయితగా పర్వాలేదనిపించాడు. అయితే మిగతా ఏ విషయాల్లోనూ పూర్తి స్థాయి ప్రతిభ కనబరచని రామ్ మోహన్, చివరకు, ఆద్యంతం బోర్ కొట్టే సినిమానే మనముందు ఉంచాడు. దర్శకత్వ పరంగానూ చెప్పుకోదగ్గ స్థాయి ప్రతిభ ఏమీ లేదు.

సినిమాటోగ్రఫీ ఉన్నంతలో ఫర్వాలేదు. అయినా సినిమా మూడ్ మాత్రం సినిమాటోగ్రఫీ స్టైల్‌తో కలిపి చెప్పడంలో విఫలమయ్యారు. ఎడిటింగ్ విభాగానికొస్తే కార్తిక్ శ్రీనివాస్ సన్నివేశాలను అడ్డదిడ్డంగా కత్తిరించి ఇరిటేట్ చేశాడు. సాయి కార్తిక్, విజయ్ కురాకుల అందించిన పాటలు అస్సలు ఆకట్టుకోలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఫర్వాలేదనేలా ఉన్నాయి.

తీర్పు :

పూర్వానుభవం ఏదీ లేకుండా, అంతా కొత్తవాళ్ళతోనే, ఉన్నంతలో ఓ హెవీ సబ్జెక్ట్ చెప్పాలన్న ప్రయత్నం నుంచి పుట్టిన సినిమాయే ‘పిడుగు’. అందరూ కొత్త వాళ్ళే అవడంతో, ఎవరికివారు తమకు తోచింది చేసుకుంటూ పోయి ఫైనల్‌గా అక్కడక్కడా మాత్రమే మెప్పించి చాలా బాగం నొప్పించే సినిమాను తయారు చేశారు. కథ బాగానే ఉన్నా కథనం విషయంలో ఏమాత్రం ప్రతిభ చూపకపోవడం, కట్టిపడేసే సన్నివేశాలేవీ సినిమాలో లేకపోవడం, సాంకేతికంగానూ సినిమా సాదాసీదాగా ఉండడం అన్నీ కలిపి ఈ సినిమానుఎప్పుడొచ్చాయో తెలియని చిన్న సినిమాల లిస్ట్‌లో పడేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. కొత్తవాళ్ళను ప్రోత్సాహిద్దాం అనుకుంటే తప్ప ఈ సినిమా చూడడానికి పెద్దగా కారణాలు కనబడవు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25 / 5
123తెలుగు టీం

Exit mobile version