విడుదల తేదీ : మే 06, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : విక్రమ్ కుమార్
నిర్మాత : సూర్య
సంగీతం : ఏ.ఆర్.రహమాన్
నటీనటులు : సూర్య, సమంత, నిత్యా మీనన్..
’13 బీ’, ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాలతో దర్శకుడిగా తనదంటూ ఓ బ్రాండ్ సెట్ చేసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్, తమిళ సూపర్ స్టార్ సూర్యతో కలిసి ’24’ అనే సైన్స్ ఫిక్షన్ కథతో మనముందుకు వచ్చారు. సూర్య తన సొంత బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..
కథ :
శివ కుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. తన భార్య ప్రియ (నిత్యా మీనన్), నెలల వయసుండే కొడుకుతో కలిసి ఓ ప్రశాంతమైన పరిసరాల్లో జీవిస్తూ, ఓ వాచీని కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు. ఆ వాచీతో కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళే అవకాశం ఉండడమే దాని ప్రత్యేకత. అలాంటి వాచీని తన సొంతం చేసుకోవాలని శివకు కవల సోదరుడైన ఆత్రేయ (సూర్య) ప్రయత్నిస్తూంటాడు. అలాంటి ప్రయత్నాల్లోనే కొన్ని అనూహ్య పరిస్థితుల్లో, శివ, ప్రియ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ వాచీని, తమ కుమారుడిని ఎవరో తెలియని ఓ యువతి (శరణ్య) చెంత చేరుస్తారు.
26 ఏళ్ల తరువాత, తల్లి శరణ్యతో సంతోష జీవితం గడిపే మణి (సూర్య)కు తమ వద్ద ఉండే ఆ వాచీ గురించి తెలుస్తుంది. మణికి ఈ వాచీ దొరికిందన్న విషయం కూడా అప్పుడే 26ఏళ్ళు కోమాలో ఉండి బయటకొచ్చిన ఆత్రేయకు కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ వాచీ ఎలా పనిచేస్తుంది? మణి దగ్గర వాచీ ఉందని తెలుసుకున్న ఆత్రేయ అతడ్ని ఏం చేశాడు? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం అంటే కథా ఆలోచన దగ్గర్నుంచి, చూస్తున్న ప్రతీ సన్నివేశం కట్టిపడేసేంత కొత్తదనంతో ఓ మాయలా ఉండడం గురించి చెప్పుకోవాలి. కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళడం అనే ఆలోచన తెలుగు సినిమాకు కొత్తది కాకపోయినా, ఈ సినిమాలో ఆ అంశం పక్కనబెడితే మిగతాదంతా చాలా కొత్తది. ఇలాంటి ఒక ప్రయత్నాన్ని ఇండియన్ సినిమా పరిస్థితులకు తగ్గట్టు చెప్పడం దర్శకుడిగా విక్రమ్ కుమార్ ఈ సినిమాలో చూపిన అద్భుతమైన ప్రతిభగా చెప్పుకోవాలి. ప్రతీ పావుగంటకు ఒక ట్విస్ట్, ప్రతీ సన్నివేశంలో కొత్త కొత్త ఆలోచనలు, పరిస్థితులు కల్పిస్తూ కథను ముందుకు నడిపే విధానం కట్టిపడేసేలా ఉంది.
ఇక ఈ సినిమాలో మూడు పాత్రలు చేసిన సూర్య సినిమానంతా తన ఈజ్‌తో మరింత ఉత్సాహంతో నడిపించాడు. శివ, ఆత్రేయ, మణి.. ఇలా ప్రతి పాత్రలోనూ సూర్య చూపిన నేర్పు, ఆయన నటనా స్థాయిని మరోసారి బలంగా పరిచయం చేసింది. నిత్యా మీనన్ ఉన్న కొద్దిసేపైనా చాలా బాగా నటించింది. సమంత తనకు అలవాటైన పాత్రలో బాగా నటించింది. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా సరిగ్గా పలికించడంలో సమంత ప్రతిభను ఈ సినిమాలో మరోసారి చూడొచ్చు. శరణ్య తన నటనతో ఆ పాత్ర స్థాయిని మరింత పెంచారు. ఇక ఆత్రేయ వెన్నంటి ఉండే మిత్ర అనే పాత్రలో అజయ్ నటన చాలా బాగుంది.
సినిమా పరంగా చూసుకుంటే, ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ట్విస్ట్.. ఇలా పతాక సమయాలన్నింటిలో సినిమా కట్టిపడేసేలానే ఉందని చెప్పొచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మైనస్ పాయింట్స్ అంటే మొదటగా పాటల గురించే చెప్పుకోవాలి. రహమాన్ అందించిన పాటలు, వాటి చిత్రీకరణా రెండూ బాగున్నా కూడా కథా గమనంలో ఆ పాటలు రావడం బాగోలేదు. అదేవిధంగా ఫస్టాఫ్‌లో వాచీ పనిచేసే అంశాన్ని ఎక్కువసార్లు చూపించినట్లు అనిపించింది. ఇక కాలంలో ముందుకు, వెనక్కి వెళ్ళడం సాధ్యమా? ఈ ఆలోచన చుట్టూ పరిస్థితులు ఎలా మారిపోతాయి? ఇలాంటి ప్రశ్నలేవీ లేకుండా ఈ సినిమాను చూడలేని వారికి సినిమా నచ్చకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ఈ సినిమా అన్నివిధాలా ది బెస్ట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా దర్శకుడు విక్రమ్ కుమార్ ప్రతిభ గురించి ఇక్కడ ఎంత మాట్లాడుకున్నా తక్కువే! ఇలాంటి కథా ఆలోచనను సినిమాగా తీయాలనుకోవడం, ఆ కథా ఆలోచనను ఇండియన్ సినిమా పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుంటూ ఓ బలమైన స్క్రీన్‌ప్లే రాసుకోవడం, ఆ స్క్రీన్‌ప్లేతో టెక్నికల్‌గానూ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, అన్ని రకాల ఆలోచనలున్న ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా తీయడం.. ఇలా దర్శకుడిగా, రచయితగా ఈ సినిమాను విక్రమ్ కుమార్ మ్యాజిక్‌గా చెప్పుకోవచ్చు. తన సినిమాకు ముందే ఒక బ్రాండ్‌ను సెట్ చేసుకున్న విక్రమ్ కుమార్, ఈ సినిమాతో దాని స్థాయిని మరింత పెంచుకున్నాడు.
సినిమాటోగ్రాఫర్ తిరు పనితనం టెక్నికల్‌గా సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ముఖ్యంగా కథ హార్సిలి వ్యాలీ నేపథ్యంలో నడిచేప్పుడు తిరు ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం. ఏ.ఆర్.రహమాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఎక్కడా వంక పెట్టలేం. ‘ప్రేమ పరిచయమే’, ‘కాలం నా ప్రేయసివే’, ‘లాలిజో’ పాటలు వినడానికి బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ కూడా కథా పరిధి మేరకే ఉంటూ కట్టిపడేసేంత అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఎఫెక్ట్స్‌తో కూడా సినిమాకు మంచి ఫీల్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. తన సొంత బ్యానర్లో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, సూర్య, నిర్మాణ విలువలతో పరిచయం చేశాడు.
తీర్పు :
కొత్తదనమున్న ఆలోచనకు, సినిమాకు ఏ భాషా సినీ పరిశ్రమలో అయినా ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అయితే ఆ ఆలోచనను ఓ కథగా, పూర్తి స్థాయి సినిమాగా, అప్పటి పరిస్థితులకు, ప్రేక్షకుడి ఆలోచనకు ఎలా కలుపుతుమాన్నదే ఇక్కడ ప్రధానాంశం. ’24’.. ఈ ప్రధానాంశాన్ని బాగా ఒడిసిపట్టుకొని, ఓ కొత్త ఆలోచనతో వచ్చిన కొత్తదనమున్న సినిమా. కథా ఆలోచనలో, కథనంలో, దర్శకత్వ అంశాల్లో. ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు విక్రమ్ కుమార్ చూపిన అద్భుతమైన ప్రతిభే ఈ సినిమాకు ప్రధానమైన అనుకూలాంశం. ఇక దానికి సూర్య నటనా చాతుర్యం కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఒక్క సందర్భం లేకున్నా వచ్చే పాటలు, కొద్దిగా సాగదీసిన రొమాంటిక్ ట్రాక్ తప్ప ఈ సినిమాకు ప్రతికూలాంశాలు పెద్దగా లేవు. చివరిమాటగా చెప్పాలంటే.. సినిమా అయిపోయి బయటకొచ్చాక, కొన్ని ప్రశ్నలను, వాటి వెంటే సమాధానాలనూ మోసుకొచ్చే సినిమాలు అరుదుగా వస్తాయి. ’24’.. అలాంటి అరుదైన ప్రయోగాత్మక సినిమాల్లో ఒకటి.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team