విడుదల తేదీ : మే 13, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : మణీ నాగరాజ్
నిర్మాత : ఎస్.పి.రాఘవేష్
సంగీతం : జీవి ప్రకాష్ కుమార్
నటీనటులు : జీవి ప్రకాష్ కుమార్, శ్రీ దివ్య
సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపున్న జీవి ప్రకాష్, ఈమధ్యే హీరోగానూ మారి వరుస సినిమాలతో మెప్పిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన హీరోగా నటించిన తమిళ సినిమా ‘పెన్సిల్’ను అదే పేరుతో తెలుగులో అనువదించారు. శ్రీదివ్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా రెండు భాషల్లోనూ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. కొత్త దర్శకుడు మణీ నాగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..
కథ :
శివ (జీవీ ప్రకాష్) 12వ తేదీ చదువుతూ ఉండే ఓ విద్యార్థి. చదువుల్లో టాపర్ అయిన శివ, తన క్లాస్మేట్ మాయ (శ్రీ దివ్య) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ కథ ఇలా ఉంటే, అదే కాలేజీలో ఓ స్టార్ హీరో కుమారుడు నితిన్ (షారిఖ్ హాసన్) కూడా చదువుకుంటూ ఉంటాడు. అల్లరి చిల్లరిగా వ్యవహరించే నితిన్, ఆ కాలేజీలో అందరికీ ఓ తలనొప్పిగా మారతాడు. అమ్మాయిలతో కూడ్ అతడి ప్రవర్తన అందరినీ ఇబ్బంది పెడుతూంటుంది.
అలాంటి నితిన్ కొన్ని అనుకోని పరిస్థితుల్లో హత్య కాబడతాడు. అతడు హత్యకు గురైన ప్రదేశంలోనే అప్పటికి శివ, మాయ ఇరుక్కుపోతారు. ఈ నేపథ్యంలో ఆ తర్వాత, మర్డర్ ఎవరు చేశారన్నది తామే కనిపెట్టాలని శివ, మాయ ఏయే ప్రయత్నాలు చేశారు? ఆ ప్రయత్నాల తర్వాత వాళ్ళకు ఏం తెలిసిందీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే ఓ చిన్న పాయింట్‌ను తీసుకొని దానిచుట్టూ ఓ మర్డర్ మిస్టరీని తెలివిగా అల్లిన విధానం గురించి చెప్పుకోవచ్చు. ఈ మర్డర్ మిస్టరీని చేజ్ చేసే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు కూడా కట్టిపడేసేలా ఉన్నాయి. ఓ స్కూల్ నేపథ్యంలో హత్య గురించి చెప్పడం అన్న ఆలోచన కూడా చాలా కొత్తగా ఉండి ఆకట్టుకుంది. సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ పకడ్బందీగా నడిపించిన విధానాన్ని మెచ్చుకోవచ్చు.
హీరోగా జీవి ప్రకాష్ చాలా బాగా నటించాడు. ఓ టీనేజ్ కుర్రాడిగా ప్రకాష్ చూపిన ప్రతిభ బాగుంది. ఇక ఈ సినిమాకు నటీనటుల పరంగా హైలైట్ అంటే తెలుగమ్మాయి శ్రీదివ్య అనే చెప్పాలి. శ్రీ దివ్య సినిమాను చాలా చోట్ల తన ఈజ్‌తో బాగానే నడిపించింది. ఇది ఆమె గత చిత్రాలకు భిన్నమైనది. షారిఖ్ హసన్ నటన కూడా చాలా బాగుంది. చాలాచోట్ల రఘువరన్ సినిమాలో విలన్ తరహా చాయలు కనిపిస్తాయి.
సినిమా పరంగా సెకండాఫ్‌ను ఈ సినిమాకు ప్లస్‌గా చెప్పుకోవాలి. సెకండాఫ్ చివర్లో ట్విస్ట్ రివీల్ అయ్యే సన్నివేశాలు, క్లైమాక్స్, ఓ సామాజిక్ అంశం.. ఇవన్నీ బాగా ఆకట్టుకుంటాయి.
మైనస్ పాయింట్స్ :
లాజిక్ పరంగా చూసినప్పుడు ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఒక స్కూల్లో ఇంత పెద్ద విషయం జరిగితే, అది ఎవ్వరికీ తెలియనట్లుగా చిత్రించడం పెద్దగా ఆకట్టుకోదు. ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల లాజిక్ అన్న అంశానికి చోటే లేకుండా పోయింది.
ఇక సినిమాలో సందర్భం లేకుండా వచ్చే పాటలు కూడా కథ గమనానికి అడ్డుగా వచ్చి విసుగు తెప్పిస్తాయి. శ్రీ దివ్య పాత్రకు సంబంధించి కూడా చాలా అంశాలు ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. హీరో, హీరోయిన్ల ప్రేమ ప్రయాణం కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు.
సాంకేతిక విభాగం :
ముందుగా దర్శకుడు మణిరాజ్ గురించి చెప్పుకుంటే.. కొత్త దర్శకుడిగా తన మార్క్ చూపించాలన్న ప్రయత్నంలో దర్శకుడు కొంత మేర బాగానే విజయం సాధించాడు. ముఖ్యంగా ఓ చిన్న పాయింట్ చుట్టూ తెలివిగా స్క్రీన్‌ప్లే రాసుకొని రచయితగా మణి మంచి ప్రతిభ చూపాడు. లాజిక్ విషయంలో కాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. మేకింగ్ పరంగా మణి అక్కడక్కడా చిన్న చిన్న ప్రయోగాలు చేశాడు. ఓవరాల్‌గా దర్శకుడిగా బాగానే ఆకట్టుకున్నాడు.
సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. మర్డర్ మిస్టరీ చుట్టూ, ఒకే ప్రదేశంలో జరిగే కథకు కావాల్సిన మూడ్ సినిమాటోగ్రాఫర్ బాగా పట్టుకున్నారు. ఆర్ట్ డైరెక్షన్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. జీవీ ప్రకాష్ అందించిన పాటలేవీ పెద్దగా ఆకట్టుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
తమిళ సినిమాల్లో ఒక సింగిల్ పాయింట్‌ను తీసుకొని, దానిచుట్టూ ఓ మంచి స్క్రీన్‌ప్లే అల్లి తీసే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తూంటుంది. అవి ఎటువంటి ప్రేక్షకుడినైనా ఆకట్టుకునే అంశాలతో తీసినప్పుడు ఇంకా బాగుంటాయి. ‘పెన్సిల్’.. ఇలా ఓ సింగిల్ పాయింట్‌నే నమ్ముకొని వచ్చిన మర్డర్ మిస్టరీ. కథనంలో మంచి నేర్పు, సినిమాగా ఎక్కడా బోర్ కొట్టీంచని సన్నివేశాలు, జీవీ ప్రకాష్, శ్రీదివ్యల నటన లాంటి అనుకూలాంశాలతో వచ్చిన ఈ సినిమాలో లాజిక్ పెద్దగా లేకపోవడమే మైనస్‌గా చెప్పాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. థ్రిల్లర్ సినిమాలను బాగా ఇష్టపడేవారు, ఇప్పటికే సమ్మర్ సినిమాలన్నీ చూసేసి కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ టైమ్‌పాస్ థ్రిల్లర్ మంచి ఆప్షన్!
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం