విడుదల తేదీ : 20 మే, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
నిర్మాత : పీవీపీ సినిమా
సంగీతం : మిక్కీ జే మేయర్
నటీనటులు :మహేష్, సమంత, కాజల్, ప్రణీత, సత్యరాజ్..
‘బ్రహ్మోత్సవం’.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా నటించిన ఈ సినిమా కొద్దికాలంగా సగటు తెలుగు సినీ ప్రేక్షకుడిని ఎంతగానో ఎదురుచూయిస్తూ వస్తోన్న సినిమాల్లో మొదటి స్థానంలో ఉన్న సినిమా. మహేష్‌తో కలిసి గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి అందమైన సినిమాను మనకు అందించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఈ ‘బ్రహ్మోత్సవం’ ఉందా? చూద్దాం..
కథ :
విజయవాడలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త అయిన చంటబ్బాయి (సత్యరాజ్)ది అందరూ కలిసి ఉండాలని కోరుకునే మనస్థత్వం. అతడి చెల్లెళ్ళు, వాళ్ళ కుటుంబాలు, అంతా కలిసి ఉత్సవంలా ఒకచోట ఉండి జీవితాలను గడుపుతుంటారు. చంటబ్బాయి లాంటి ఆలోచనలున్న వ్యక్తే అతడి కుమారుడు మహేష్ బాబు. ఏదీ పెద్దగా ఆలోచించకుండానే చేసేసే మనస్థత్వం ఉన్న మహేష్, ఎవ్వరితోనైనా ఇట్టే కలిసిపోయి సరదాగా ఉంటూ, తండ్రి వ్యాపారాలు చూసుకుంటూ బతికేస్తుంటాడు. అంతా బాగుందనుకునే సమయంలోనే, ఆ ఇంట్లో వ్యక్తే అయిన రావు రమేష్ వల్ల ఓ గొడవ జరుగుతుంది.
ఆ గొడవ తర్వాత చంటబ్బాయి చనిపోవడంతో, ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోతాయి. ఇలా మారిపోయిన పరిస్థితుల నుంచి, బంధాలంటే ఏంటో, తానేంటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో మహేష్, సమంతతో కలిసి ఓ ప్రయాణం మొదలుపెడతాడు. ఆ ప్రయాణం ఏంటి? సమంత ఎవరు? ఈ ప్రయాణంలో మహేష్ ఏమేం తెలుసుకున్నాడూ? చివరకు తన ఇంట్లో పరిస్థితులను మార్చేందుకు అతడికి ఆ ప్రయాణం ఎలా ఉపయోగపడిందీ? కాశి (కాజల్)తో అతడి తొలిప్రేమ కథేంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్ :
మహేష్ లాంటి సూపర్ స్టార్‌తో, కమర్షియల్ సినిమా హంగులను ఏమాత్రం పట్టించుకోకుండా, ఓ కథ చెప్పాలన్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సాహసాన్నే ఈ సినిమాకు అన్నింటికీ మించిన ప్రధానమైన అనుకూలాంశంగా చెప్పుకోవాలి. నలుగురికి మంచి పంచుతూ, అందరితో కలిసిమెలిసి ఉండడమనే ప్రధానాంశాన్ని సినిమా కథలో అంతర్లీనంగా చెప్పిన విధానం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇక మానవ సంబంధాలను, ఉమ్మడి కుటుంబంలోని ఆలోచనా విధానాలు, భావోద్వేగాలను శ్రీకాంత్ అడ్డాల తనదైన ముద్ర కనిపించేలా చెప్పిన విధానం కూడా చాలా బాగుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ ఎప్పట్లానే ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలబడి, సినిమాను తన చరిష్మాతో ముందుకు నడిపించాడు. ఇలాంటి ఒక కథను తన స్టార్ స్టేటస్ గురించి ఆలోచించకుండా, నిజాయితీగా కథకే కట్టుబడి ఉంటూ చేయడమనేది మహేష్ ఈ సినిమా విషయంలో సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. నటనలో మహేష్ స్థాయి ఏంటన్నది ఇప్పటికే చాలా సినిమాలు ఋజువుచేయగా, బ్రహ్మోత్సవం కూడా ఇదే అంశాన్ని మరోసారి బలంగా ఋజువుచేస్తూ, ఆయన స్థాయి మరింత ఎత్తుకు తీసుకెళ్ళింది. ఇక సమంత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది.
మహేష్-సమంతల కాంబినేషన్లో వచ్చే జర్నీ బాగుంది. ఇక కాజల్ ఈ సినిమాలో తాను ఇంతకుముందెప్పుడూ చేయని తరహా పాత్రలో చూపిన ప్రతిభ చాలా బాగుంది. మహేష్-కాజల్‌ల ప్రేమకథ కూడా సహజంగా ఉంది. ఇక ప్రణీతది చిన్న పాత్రైనా బాగా చేసింది. రావు రమేష్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కథను బలంగా ప్రభావితం చేసే పాత్రలో ఆయన నటన కట్టిపడేసేలా ఉంది. సత్యరాజ్ ఓ బలమైన పాత్రలో సినిమాకు నిండుతన తెచ్చారు. ఇక రేవతి, జయసుధ, నరేష్, తులసి, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి.. ఇలా సినిమాలో కీలక పాత్రల్లో నటించిన వారంతా తమ నటనతో ఆకట్టుకుంటారు. అక్షర అనే ఓ నాలుగేళ్ల పాప పాత్రను ఓ రెండు సన్నివేశాల్లో కథకు ఉపయోగపడేలా వాడిన విధానం బాగుంది.
సినిమా పరంగా చూసుకుంటే… అసలు కథను పరిచయం చేయడం, మహేష్-సమంతల జర్నీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు, కుటుంబమంతా కలిసి ఓ పండగలా జీవితాల్ని ఆస్వాధించడం, అదిరిపోయే ఇంటర్వెల్ బ్యాంగ్, మహేష్-కాజల్‌ల రొమాన్స్, క్లైమాక్స్ లాంటివి ప్రధాన అనుకూలాంశాలుగా చెప్పుకోవచ్చు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాకు ప్రధానమైన ప్రతికూలాంశం అంటే, కథ వేగం చాలా నెమ్మదిగా ఉండడమని చెప్పుకోవాలి. సెకండాఫ్‌లో మహేష్-సమంతల జర్నీ బాగున్నా, దానికి ముందొచ్చే సన్నివేశాలేవీ అంత బలంగా లేకపోవడంతో, ఈ జర్నీ లాజిక్ లేని విషయంగా కనిపిస్తుంది. ఇక కొన్ని సన్నివేశాలు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాయన్నట్లుగా సెకండాఫ్‌లో ఈ ఎపిసోడ్ సాగుతూంటుంది. మూలాల్ని వెతికే హీరో, హీరోయిన్ల ప్రయాణంలో కొన్ని సన్నివేశాలైతే మరీ ఓవర్‌గా తయారవ్వడం బాగోలేదు. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ అంతా కలిసి పిక్నిక్ టూర్‌కి వెళ్ళడం, సంబరాలు జరుపుకోవడం లాంటి సన్నివేశాల్లో చెప్పుకోదగ్గ బలంగా లేకపోగా, టైమ్‌పాస్ వ్యవహారంలా తయారై అక్కడక్కడా బోరింగ్‌గా తోస్తాయి.
ఇక సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో కోరుకునే అంశాలేవీ లేని సినిమా కావడం కూడా అలాంటి అంశాలను కోరేవారికి నచ్చకపోవచ్చని విషయంగా చెప్పుకోవచ్చు. సమంత కథలోకి ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా పెద్దగా ఆకట్టుకోదు. ఇక కొన్నిచోట్ల విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ‘బ్రహ్మోత్సవం’ అన్నివిధాలా బాగుందనే చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ అడ్డాల రచనలో ఎంత లోతుందో, తాను చెప్పాలనుకున్న అంశాలను కథగా తెలివిగా చెప్పించిన విధానం చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. చిన్నదే అయినా, బలమైనది కూడా అయిన ఒక అంశం చుట్టూ కథ చెప్పాలనుకోవడం, దాన్ని కథగా చెప్పడానికి ఏమేం కావాలో వాటన్నింటితో ఓ మంచి స్క్రీన్‌ప్లే రాసుకోవడం లాంటి విషయాల్లో శ్రీకాంత్ అడ్డాల ప్రతిభను చూడొచ్చు. డైలాగ్స్ పరంగానూ శ్రీకాంత్ మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. దర్శకుడిగా ప్రతి దర్శకుడూ ఒక బ్రాండ్ కోరుకుంటాడు. శ్రీకాంత్ రెండో సినిమాతోనే దాన్ని సాధించి, ‘బ్రహ్మోత్సవం’ దగ్గరకొచ్చేసరికి ఆ బ్రాండ్‌ని అలాగే నిలబెట్టుకున్నాడు.
ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! సాధారణంగా తెలుగు సినిమాల్లో కనిపించని, బాలీవుడ్‌కు మాత్రమే సాధ్యమనుకున్న ఓ ఫ్లేవర్‌ను సెకండాఫ్‌లో చూడొచ్చు. అది రత్నవేలు ప్రతిభ వల్లే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మిక్కీ జే మేయర్ సమకూర్చిన పాటలు ఇప్పటికే అంతటా సూపర్ హిట్ అనిపించుకోగా, సినిమాలో, ఆయా సందర్భాల్లో వచ్చే ఈ పాటలు బాగున్నాయి. గోపీ సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రీ రికార్డింగ్ సినిమా స్థాయికి తగ్గట్టే బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ బాగుంది. ఇలాంటి సినిమాలకు కావాల్సిన మూడ్‌ను ఎడిటింగ్ ద్వారా ఆయన బాగానే క్యారీ చేశారు. తోట తరణి ఆర్ట్ వర్క్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. ఆయన స్థాయి ఎంతటిదో ఈ సినిమా మరోసారి ఋజువు చేసింది. పీవీపీ సినిమా నిర్మాణ విలువలను ప్రశంసించకుండా ఉండలేం.
తీర్పు :
అందరూ కలిసి, ఒకరికొకరు అండగా నిలబడడమే ఎవ్వరి జీవితంలోనైనా అతి పెద్ద ఉత్సవం అని చెప్పే సినిమాయే ‘బ్రహ్మోత్సవం’. ఈ విషయాన్ని తెలుసుకునేందుకే, ఎవ్వరిని పలకరించడానికైనా పెద్దగా ఆలోచించక్కర్లేదనే కథానాయకుడు చేసే ప్రయాణమే మేజర్ హైలైట్. ఆ కథానాయకుడి పాత్రలో నటించిన మహేష్ సినిమాను తన చరిష్మాతో ముందుండి నడిపించడంలో సఫలమయ్యాడు. శ్రీకాంత్ అడ్డాల కథగా చెప్పాలనుకున్న ఆలోచన, కట్టిపడేసే కొన్ని భావోద్వేగాలు, ప్రయాణాలు ఇవన్నీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఇకపోతే కథ చాలా నెమ్మదిగా సాగడం, సెకండాఫ్‌లో కొన్ని లాజిక్‌కి సంబంధం లేని అంశాలు లాంటివి మైనస్ పాయింట్స్‌గా చెప్పుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. మూలాల్ని వెతికే ప్రయాణంలో బంధాల్ని అర్థం చేసుకోవచ్చని, ఆ బంధాలు అలా సాగడమే ‘బ్రహ్మోత్సవం’ అని చెప్పే ఆలోచనకు కనెక్ట్ అయితే, ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందనే చెప్పొచ్చు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team