సమీక్ష : రహదారి – దారి పాతదే, తీరూ పాతదే!!

Rahadari review

విడుదల తేదీ : 27 మే, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

దర్శకత్వం : సురేష్ కుమార్ మరియు రాజ్

నిర్మాత : రాజ్ జకారిస్

సంగీతం :రాహుల్ రాజ్

నటీనటులు : సేతు, అభిషేక్, రాజ్, పూజ…

తమిళంలో గత సంవత్సరం విడుదలైన ’కాదవుల్ పాతి మిరుగమ్ పాతి’ సినిమా అక్కడ ఓ మోస్తరు విజయం సాధించింది. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు ’రహదారి’ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

రాజ్ (అభిషేక్ వినోద్) , నేహా (శ్వేతా విజయ్) ఇద్దరూ ప్రేమికులు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోనుంచి హైదరాబాద్ కి పారిపోయి పెళ్లిచేసుకోవాలనుకుంటారు. అలా పారిపోతున్నప్పుడు వారు ఒకతనికి లిఫ్ట్ ఇస్తారు. అతను ఓ సైకో. మెంటల్ హాస్పిటల్ నుంచి తప్పించుకున్న ఆ సైకో తన మాటకు ఎదురుచెప్పిన వారిని, తనమాట వినని వారిని నిర్ధాక్ష్యణ్యంగా చంపేస్తుంటాడు. అతను ఎందుకు అలా మారాడు? ఆ సైకో కిల్లర్ ఎందుకు అందరినీ చంపుతున్నాడు.? ఈ సైకో కిల్లర్ ని పట్టుకునే ప్రాసెస్ లో ఏమి జరిగింది? అతని బారిన పడిన హీరో, హీరోయిన్లు ఎలా తప్పించుకున్నారు? చివరికి ఏం అవుతుంది అన్నది మిగతాకథ.

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఇలాంటి జోనర్ సినిమాని రిస్క్ చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాలని ప్రయత్నం చేయడం అభినందనీయం. సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ ప్రధమార్థం అని చెప్పాలి. సినిమాని మొదలు పెట్టిన తీరుకానీ, తర్వాత నడిపించిన తీరుకానీ చాలా బాగుంది. ముఖ్యంగా స్పీల్ బర్గ్ తీసిన ‘డ్యుయల్’ సినిమా అక్కడక్కడా గుర్తుకు వస్తుంటుంది. అలాగే మాటల కన్నా దృశ్యానికి, శబ్దానికి ప్రాముఖ్యత ఇచ్చిన విషయం స్పష్టంగా తెలుస్తుంది. అలాగే లొకేషన్స్ కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక సైకో కిల్లర్ గా చేసిన నటుడి పెర్ఫార్మన్స్ ఈ మూవీకి మరో మేజర్ హైలైట్. మిగతా పాత్రలు కూడా తమ శక్తిమేరా బాగా నటించారు. సినిమా నిడివి కేవలం 95 నిమిషాలే కావడం మరో ప్లస్ పాయింట్. సస్పెన్స్ ని ఒకేసారి విప్పకుండా చూపించిన తీరు బాగుంది.

మైనస్ పాయింట్స్ :

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ తరహా సినిమాలలో కథ కంటే స్క్రీన్ ప్లే కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ’రహదారి’ స్క్రీన్‌ప్లే ఆకట్టుకునే స్థాయిలో లేదు. అంతేకాకుండా ద్వితీయార్థం ఈ సినిమాకి ప్రధాన మైనస్ అని చెప్పవచ్చు. భార్యను అనుమానించడం, ఆమెను చంపేయడం, ఆ తరువాత సైకోగా మారడం, కనిపించిన వారిని చంపడం… ఇలా చాలా రొటీన్ కథ కావడంతో సెకండాఫ్ ఈ సినిమాని ఒక మామూలు సినిమా చేసేసింది. అంతేకాక ఇదొక థ్రిల్లర్ మూవీ కావడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కామెడీ సీన్స్ కానీ, పాటలు కానీ లేవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెపాల్సింది సినిమాటోగ్రఫీ గురించి. కిషోర్‌ మణి అందించిన సినిమాటోగ్రఫీ ఒక థ్రిల్లర్ సినిమాలో విజువల్స్ ఎలా ఉండాలో అలా ఉన్నాయి. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ లో షూట్ చేసిన సీన్స్ కానీ, వైడ్ యాంగిల్ లో తీసిన ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్స్ సినిమాని హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇక మ్యూజిక్ గురించి చెప్పుకుంటే.. రాహుల్ రాజ్ కంపోజ్ చేసిన పాటల కన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ కనెక్ట్ అయ్యేలా బాగుంది. అంతేకాక ప్రతి పాత్రకు ఒక సిగ్నేచర్ ట్యూన్, సన్నివేశానికి తగ్గట్టు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని చెప్పాలి. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ బాగా స్పీడ్ గా కథని నడిపించినా సెకండాఫ్ ని కాస్త ట్రిమ్ చేయాల్సింది.

దర్శకుడు సాంకేతికంగా కానీ, నటీనటుల నుంచీ కానీ మంచి అవుట్ పుట్ రాబట్టుకున్నాడు. కథపరంగా కూడా ఎక్కడా పక్కదారులకి పోకుండా ఒకే లైన్ మీద సినిమాని తీసుకెళ్లినప్పటికీ కథనం ఆసక్తిరేపేవిధంగా లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

తీర్పు :

ఓ సైకో కిల్లర్ కథతో హైవేపై తొంభై ఐదు నిముషాలు సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను ప్రథమార్థంలో అకట్టుకున్నా, ద్వితీయార్థం మాత్రం అక్కడక్కడా విఫలం అయ్యింది. కొత్తదారిలో వెళ్లడం ఇబ్బందిగా ఉన్నా ఆసక్తిగా ఉంటుంది. అలాగే తెలిసినా దారిలో వెళ్ళడం బాగా అనిపించినా ఏమాత్రం ఆసక్తిగా అనిపించదు. కానీ ఈ సినిమా కొత్తదారిలో మొదలై మళ్ళీ పాతదారిలో కలవడంతో సినిమా ప్రారంభం బాగానే అనిపించినా చివరికి అంతగా ఆకట్టుకోదు. వైవిధ్యభరితమైన సినిమాలను కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. మిగతావారిని ఆకట్టుకునేందుకు ఈ సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమీ లేదు.

123telugu.com Rating : 2.5/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version