విడుదల తేదీ : 03 జూన్, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : ఎస్.డి. అరవింద్
నిర్మాత : శ్రీ మంజు నాధ మూవీ మేకర్స్
సంగీతం : ఎస్.డి. అరవింద్
నటీనటులు : అవినాష్ నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్..
ఈ ఏడాది జనవరిలో కన్నడలో విడుదలై ఘనవిజయం సాధించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘లాస్ట్ బస్’. ఇప్పుడు ఈ సినిమాని `అడవిలో లాస్ట్ బస్` పేరుతో శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. కన్నడ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.
కథ :
ట్రెక్కింగ్ కోసం అరకు దగ్గర ఓ కొండపైకి స్నేహితులతో కలిసి వెళ్లిన పృథ్వీ (అవినాష్ నరసింహరాజు) దారితప్పిపోతాడు. అతికష్టం మీద అక్కడ నుండి బయటపడిన అతడు, వైజాగ్ వెళ్లడానికి ఓ బస్ ఎక్కుతాడు. కానీ అది తిరిగి అరకుకు వెళ్లే లాస్ట్ బస్ అని తెలుస్తుంది. అప్పటికే కొంతమంది ఆ బస్ లో ఉంటారు. చీకటిపడే లోపు ఆ అడవి లోనుండి బయటపడాలని డ్రైవర్ బస్ ని వేగంగా పోనిస్తుండగా ఆ బస్ యాక్సిడెంట్ కి గురి అవుతుంది. అందరూ లేచి చూసేసరికి బస్ డ్రైవర్ బస్ లో ఉండడు కానీ ఎక్కడి నుంచో తనని రక్షించమని వచ్చే మాటలు వీరికి వినిపించి అందరూ అటువైపు వెళతారు. దూరంగా ఉన్న ఓ పాడుబడ్ద బంగళాలో నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయని అందరూ లోనికి వెళతారు. తరువాత ఏం జరిగింది అనేది మిగతా కథ…
ప్లస్ పాయింట్స్ :
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమాని రూపొందించడమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. అంతేకాకుండా ఆసక్తి కలిగించే కథ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. హీరో గా చేసిన అవినాష్ నరసింహరాజు నటన ఆకట్టుకుంటుంది. మిగతా పాత్రధారులందరూ కూడా బాగా నటించారు. సినిమాలో వచ్చే లోకేషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంట్రవెల్ బ్యాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. అక్కడక్కడా వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పాలి. ముఖ్యంగా ఊయలను హీరో విరగగొట్టినప్పుడు అది ముక్కలుముక్కలుగా మారి అందరిపైకి రావడం ఈ సినిమాకి హైలెట్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లెంగ్త్ తక్కువ కావడం కూడా హెల్ప్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. వాటిలో ప్రధానంగా ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే విషయాలనే ఇక్కడ చెప్పుకుందాం. సినిమా కథలో ఒక లైన్ అనేది ఉండదు. కథ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో మొదలై దర్శకుడి పాయింట్ ఆఫ్ వ్యూలో ముగుస్తుంది. ఏ ఒక్క విషయాన్ని క్లారిటీగా చెప్పలేదు. మొదటి నుంచి ఏవేవో సబ్ ప్లాట్స్ ని చూపిస్తూ వచ్చి చివరికి కథను ఎక్కడో ముగిస్తాడు. కథనం అస్సలు బాలేకపోవడంతో ఏ విషయమూ ప్రేక్షకులకి కనెక్ట్ కాదు.
మాయమ్మ (దెయ్యం) ఎందుకు ఆ ఇంట్లోకి వచ్చిన వారిని చంపుతుందో అర్థం కాదు. అలాగే సంబంధం లేనివారిని కూడా ఎందుకు చంపుతుందో అర్థం కాదు. ఇలాంటి కథకి తోడు కథనం బాగా అంటే బాగా నెమ్మదిగా ఉంది. ఇక కామెడీ పండించే అవకాశం ఉన్నా దర్శకుడు ఉపయోగించుకోలేదు. సినిమాలో ముఖ్యమైన ఎమోషన్ క్యారీ కాకపోవడంతో సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టు కోదు.
సాంకేతిక విభాగం :
’అడవిలో లాస్ట్ బస్’ టెక్నికల్‌గా ఫర్వాలేదనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ అనంత్ అర్స్ పనితనం గురించి చెప్పుకోవాలి. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. కథ నడిచే పాంత్రంలోని అందమైన లొకేషన్స్‌లో తీసిన ఏరియల్ షాట్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. కానీ ఇంటీరియర్ షాట్స్ లో ఆయన పనితనం కేవలం ఫరవాలేదనిపిస్తుంది. గ్రాఫిక్స్ అక్కడక్కడా బావున్నా రాత్రి ఎఫెక్ట్ కోసం వాడిన షాట్స్ అస్సలు బాగాలేవు. కళాదర్శకత్వం బావుంది.
ఎడిటింగ్ ప్రధమార్థం బాగానే ఉన్నా ద్వితీయార్థం సరిగా లేదు. కొన్ని సన్నివేశాల మధ్య సమన్వయం కుదరలేదు. పాటలు బావున్నాయి కానీ నేపధ్య సంగీతం మాత్రం అస్సలు బాలేదు. దర్శకుడు నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నాడనే చెప్పాలి. ఇక తెలుగు డబ్బింగ్ పనులు ఏమాత్రం ఆకట్టుకునేలా లేవు. అంతేకాకుండా చాలా లౌడ్‌గా డైలాగ్స్ హై పిచ్ లో రీ రికార్డింగ్ చేశారు. నిర్మాణ విలువలు ఫరవాలేదు.
తీర్పు :
సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ప్రధమార్ధం ఆసక్తికరంగా సాగినా ద్వితీయార్ధంలో ఆ ఆసక్తిని దర్శకుడు కొనసాగించలేకపోయాడు. దాంతో పాటు ఫస్టాఫ్‌లో అసలు కథ తెలిసిన తర్వాత, సెకండాఫ్ మొత్తాన్నీ అర్థం పర్థం లేకుండా క్లైమాక్స్ వరకూ సాగదీశారు. అక్కడక్కడా ఫర్వాలేదనిపించే సన్నివేశాలు, కొంచెం కొత్తగా కనిపించే కథ లాంటివి ఉన్నా, సినిమాను నిలబెట్టే స్థాయి అంశాలు ఇంకేవీ లేకపోవడంతో, ఈ థ్రిల్లర్ ఆకట్టుకునే స్థాయిలో ఉండడం అటుంచితే, కనీసం ఫర్వాలేదనిపించే స్థాయిలో కూడా లేదు.
123telugu.com Rating :2/5
Reviewed by 123telugu Team