సమీక్ష : మీకు మీరే మాకు మేమే – కామెడీ కోసం చూడొచ్చు..!

Meeku Meere Maaku Meme review

విడుదల తేదీ : 17 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : హుస్సేన్ షా కిరణ్

నిర్మాత : ఎన్.పి.జి. స్టూడియోస్

సంగీతం : శ్రవణ్

నటీనటులు : తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రా, కిరిటీ దామరాజు..

ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు కథ అందించిన దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సినిమా ‘మీకు మీరే మాకు మేమే’. ఈతరం ప్రేమకథగా ప్రచారం పొందిన ఈ సినిమాలో తరుణ్ శెట్టి, అవంతిక మిశ్రా, కిరీటీ ప్రధాన పాత్రల్లో నటించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందీ? చూద్దాం..

కథ :

ఆది (తరుణ్ శెట్టి) సరదాగా కాలం వెల్లదీసే ఓ కాలేజీ కుర్రాడు. తన మిత్రుడు కిరిటీ (కిరిటీ దామరాజు)తో కలిసి జాలీగా గడిపే అతడికి తన కాలేజీలోనే చదివే ప్రియ (అవంతిక మిశ్రా) పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒకరికొకరు నచ్చి ప్రేమలో పడిపోతారు. అయితే ఆది ప్రేమలో నిజాయితీ లేదని, తనెందుకు ప్రేమిస్తున్నాడో కూడా తనకే తెలియదని చెబుతూ ప్రియ అతడికి కొన్నాళ్ళపాటు దూరంగా ఉండాలనుకుంటుంది.

ఈ గ్యాప్‌లోనే ఆది జీవితంలో రకరకాల మార్పులు వస్తాయి. ఆ మార్పుల వల్ల ఆది, ప్రియల మధ్య దూరం మరింత పెరుగుతుంది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వీరి ప్రేమకథ ఏమైంది? ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఒక్కటయ్యారా? ఆది జీవితంలో వచ్చిన మార్పులు ఏంటీ? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అన్నివిధాలా మేజర్ ప్లస్ పాయింట్ అంటే మొదట్నుంచీ, చివరివరకూ చాలాచోట్ల వర్కవుట్ అయిన కామెడీ గురించే చెప్పుకోవాలి. ముఖ్యంగా తరుణ్-కిరీటీల మధ్యన వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి. ఈ కామెడీ వల్లనే సినిమా సరదాగా ఇబ్బంది పెట్టకుండా సాగిపోయింది. ఇక హీరో హీరోయిన్ల మధ్యన ప్రేమలోని ఇన్నోసెన్స్, ఎమోషన్ బాగుంది. ఫస్టాఫ్‌లో ఈతరం ప్రేమలు ఎలా ఉన్నాయన్నది చెప్పేలా వచ్చే సన్నివేశాలు కూడా బాగున్నాయి. ప్రధాన పాత్రలను పరిచయం చేసిన విధానం కొత్తగా ఉంది.

హీరో తరుణ్ శెట్టి మొదటి సినిమాయే అయినా బాగా నటించాడు. సరదాగా, పెద్దగా వేటిపైనా పట్టింపులేని లేనట్టు కనిపించే కుర్రాడిగా తరుణ్ మంచి ప్రతిభే కనబరిచాడు. ఈ కథకు అతడి డబ్బింగ్ కూడా బాగా సరిపోయింది. ఇక నటుడు కిరిటీ దామరాజు ఈ సినిమాకు మేజర్ హైలైట్స్‌లో ఒకరుగా చెప్పుకోవాలి. తన టైమింగ్ నటనతో, డైలాగ్ డెలివరీతో కిరిటీ చాలా చోట్ల కట్టిపడేశాడు. హీరోయిన్ అవంతిక చూడడానికి బాగుంది. ఎమోషనల్ సన్నివేశాలను పక్కనపెడితో మిగతా అన్నిచోట్లా అవంతిక నటిగా మంచి ప్రతిభే కనబరిచింది. ఇక మిగిలిన వారంతా తమ పరిధిమేర బాగానే నటించారు. సినిమా పరంగా చూసుకుంటే, ఫస్టాఫ్, సెకండాఫ్‌ రెండు భాగాల్లోనూ కామెడీ సన్నివేశాలన్నీ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ఎంచుకున్న ప్రధాన కథ ఆలోచన బాగున్నా, దాన్ని పూర్తి స్థాయి సినిమాగా మలచడంలో తేలిపోవడంతో అసలు కథ చాలా నీరసంగా మారిపోయింది. ఇక ‘ప్రేమంటే ఏంటో తెలుసా?’ అని హీరోయిన్ అడగడంతో మొదలయ్యే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకూ మంచి ఎమోషనల్ జర్నీకి అవకాశం ఉన్నా, ఆ విషయంలో చాలాచోట్ల తడబడ్డారు. అసలైన క్లైమాక్స్‌కి వచ్చేసరికి డ్రామా ఓవర్ అయిపోయింది. ఇక ఈతరం ప్రేమల గురించి ప్రస్తావించే ఆలోచన చేస్తూ, దాన్ని పూర్తిగా ఒక కోణం వైపే నడపడం కూడా బాగోలేదు.

సెకండాఫ్‌లో ఒకటి, రెండు పాటలు అర్థం పర్థం లేకుండా వచ్చేశాయి. ఇక కథ మొదలైన నేపథ్యానికి, ఆ తర్వాత పరిస్థితులకు సంబంధమే ఉండదు. సెకండాఫ్‌లో చాలాచోట్ల వచ్చిన సన్నివేశాలే మళ్ళీ మళ్ళీ వచ్చినట్లు కనిపించి, కాస్త బోర్ కొట్టించాయి. హీరోయిన్ పాత్ర కూడా కొంత అయోమయంగా డిజైన్ చేశారు. కొన్నిచోట్ల పూర్తిగా సినిమాటిక్ లిబర్టీని తీసేస్కొని కథ నడిపించడం ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శక, రచయిత హుస్సేన్ షా కిరణ్ చెప్పాలనుకున్న ఆలోచన మంచిదే! అయితే దాన్ని పూర్తి స్క్రీన్‌ప్లేగా మార్చడంలో మెప్పించలేకపోయాడు. అయినప్పటికీ కామెడీని ప్రధానంగా చేసుకొని కథ నడిపించడంలో, సందర్భానుసారంగా ఆ కామెడీని వాడుకోవడంలో ఫర్వాలేదనిపించాడు. తండ్రితో హీరోయిన్ తన ప్రేమ గురించి చెప్పే సన్నివేశంలో దర్శకుడు హుస్సేన్ బాగా ఆకట్టుకున్నాడు. ఇక మేకింగ్ పరంగా చెప్పుకోదగ్గ ప్రయోగాలేవీ చేయలేదు.

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రెగ్యులర్ తెలుగు సినిమాలా కాకుండా ఈ సినిమాకు వాడిన కలర్ స్కీమ్ కథ మూడ్‌కి బాగా సరిపోయింది. ఎక్కడా చిన్న సినిమా అన్న ఫీలింగ్ కలిగించకపోవడంలో సినిమాటోగ్రఫర్ పనితనం చూడొచ్చు. శ్రవణ్ అందించిన మూడు పాటలు బాగున్నాయి. అయితే రెండు పాటలు అసందర్భంగా రావడంతో అవి వృథా అయిపోయాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్న ఫీలింగ్ కలిగిస్తుంది. పాటల్లో సాహిత్యం బాగుంది. డైలాగ్స్ బాగున్నాయి. ఎక్కడా స్థాయికి మించకుండా, పాత్రల తీరుకు తగ్గట్టుగా ఈ డైలాగ్స్ ఉన్నాయి. ఎడిటింగ్ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌కి ముందు సినిమా కాస్త వేగంగా నడిస్తే బాగుండేదనిపించింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

‘మీకు మీరే మాకు మేమే’.. ఈతరం ప్రేమలు ఎలా ఉన్నాయి? అన్న అంశాన్ని ప్రస్తావించే సినిమాగా ప్రచారం పొందిన ఈ సినిమా చెప్పాలనుకున్న అంశాన్ని సరిగ్గా చెప్పలేకపోయినా కామెడీతో మాత్రం ఆకట్టుకుంది. మొదట్నుంచీ, చివరివరకూ ఈ సినిమాను నిలబెట్టింది ఈ కామెడీ అన్న అంశమే! అసలు కథలో స్పష్టత కోల్పోవడం, సెకండాఫ్‌లో రిపీటెడ్‌గా వచ్చే కొన్ని సన్నివేశాలు, పాటలు కొన్ని అసందర్భంగా రావడం పక్కనబెడితే, లవ్‌స్టోరీలోని ఇన్నోసెన్స్, కామెడీ కోసం మాత్రమే చూస్తే ఈ సినిమా బాగా మెప్పిస్తుంది.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version