సమీక్ష : రుద్ర ఐపిఎస్ – విసిగించే పోలీస్ స్టోరీ

Rudra IPS review

విడుదల తేదీ : 17 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

దర్శకత్వం : బాలకృష్ణ రెడ్డి

నిర్మాత : కృష్ణవేణమ్మ

సంగీతం : ఘంటాడి కృష్ణ

నటీనటులు : రాజ్‌కృష్ణ, కీర్తన, చంద్రమోహన్


తెలుగు పరిశ్రమలో పోలీస్ స్టోరీలకు ఓ సపరేట్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ను బేస్ చేసుకుని కొత్త దర్శకుడు బాలకృష్ణ రెడ్డి నూతన నటీనటులు రాజ్‌కృష్ణ, కీర్తన జంటగా తెరకెక్కించిన చిత్రం ఈ ‘రుద్ర ఐపీఎస్’ చిత్రం. ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

మూల కథ :

అపోజిషన్ పార్టీకి చెందిన ఓ పొలిటికల్ రౌడీ బాలిరెడ్డి ఎలాగైనా రాష్ట్రానికి సిఎం అవాలని చూస్తుంటాడు. అతని మేనల్లుడు రాకేష్ మాఫియాతో సంబంధాలు పెట్టుకుని అక్రమాలు చేస్తూ తన మామకు చేదోడు వాదోడుగా ఉంటాడు. అలాగే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల మంచి కోసం పోరాడే వ్యక్తి శింబు ప్రసాద్ (బాలచందర్) బాలిరెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడు. ఈ క్రమంలో బాలిరెడ్డి రాకేష్ ఓ అమ్మాయిని చంపుతాడు. ఆ కేసుతో బాలిరెడ్డి సిఎం ప్రయత్నాలకు అడ్డంకి ఏర్పడుతుంది.

అదే సమయంలో ఆ కేసును రుద్ర (రాజ్‌కృష్ణ) అనే సిన్సియర్ ఐపిఎస్ ఆఫీసర్ టేకప్ చేస్తాడు. దీంతో బాలిరెడ్డి రుద్రను చంపాలని ట్రై చేస్తాడు. అసలు రాకేష్ ఆ అమ్మాయిని ఎందుకు చంపుతాడు? రుద్ర ఆ కేసును ఎలా డీల్ చేస్తాడు? చివరికి రుద్ర నిందితులను శిక్షించాడా లేదా? అనేదే ఈ చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటే కాసేపు వెతుక్కోవలసిందే. అలా వెతుక్కుంటే దొరికేది మొదట పోలీస్ స్టోరీ అన్న కాన్సెప్ట్. సాధారణంగా ప్రతి పోలీస్ స్టోరీలో ఉన్నట్టే ఇందులోనూ పోలీస్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే కాస్త ఎమోషన్ పరవాలేదనిపించాయి. అలాగే ఈ చిత్ర రన్ టైమ్ కూడా తక్కువగా ఉండి సినిమా త్వరగానే అయిపోయిందిలే అనిపిస్తుంది.

అలాగే పోలీస్ ఆఫీసర్ గా రాజ్‌కృష్ణ చెప్పిన కొన్ని పంచ్, ఎమోషనల్ డైలాగులు బాగానే ఉన్నాయని అనిపించాయి. ఇక చిత్ర క్లైమాక్స్ లో రుద్ర, బాలిరెడ్డి మధ్య నడిచే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి కొంత ప్లస్ అయ్యాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ గురించి వెతకనవసరం లేదు. ప్రతి దగ్గరా అవి తారసపడుతూనే ఉంటాయి. దర్శకుడు ఏదో సినిమా తీద్దాం అన్న ఆలోచనతో హడావుడిగా, మొక్కుబడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు ఈ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్. అలాగే పోలీస్ ఆఫీసర్ గా రుద్ర నటన ఎక్కడా కూడా నటనలా అనిపించదు. దర్శకుడు కథగా పోలీస్ స్టోరీని ఎంచుకున్నప్పటికీ ఆ కథను అల్లుకున్న తీరు, తెరపై నడిపిన విధానం రెండూ చాలా అంటే చాలా బోరింగ్ గా ఉన్నాయి.

బాలచందర్, చంద్ర మోహన్ మినహా మిగతా నటీనటుల్లో ఎక్కడా నటనా నైపుణ్యమనేది మచ్చుకు కూడా కనిపించదు. ఇక మధ్యలో వచ్చే పాటలు కథనమే విసుగుపుట్టిస్తోంది అనుకునే సమయంలో మరింత చిరాకు తెప్పిస్తాయి. మొత్తంగా చెప్పాలంటే సినిమానే ఓ పెద్ద తప్పుల తడకలా ఉంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ముందుగా చెప్పుకోవాల్సిన రచయిత పాత్రను పోషించిన దర్శకుడు బాలకృష్ణ రెడ్డి పోలీస్, యాక్షన్ ఎంటర్టైనర్ అన్న పేరుతో అందించిన కథ చాలా వీక్ గా ఉంది. ఆయన కథనాన్ని నడిపిన తీరు కూడా పూర్తిగా విఫలమైంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఘంటాడి కృష్ణ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలు ఎక్కడా మెప్పించవు. స్టంట్ మాస్టర్ మార్షల్ రమణ యాక్షన్ సన్నివేశాలలో పర్ఫెక్షన్ లేదు. నందమూరి హరి ఎడిటింగ్ సినిమాలో ఎక్కడా ప్రభావం చూపలేదు. ఇక వంశీ కృష్ణ ఫోటోగ్రఫీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. నిర్మాత రాజశేఖరరెడ్డి నిర్మాణ విలువలు పరవాలేదనిపించాయి.

తీర్పు :

యాక్షన్ ఎంటర్టైనర్ అన్న పేరుతో వచ్చిన ఈ పోలీస్ కథ రొటీన్ గా ఓ పొలిటికల్ నైపథ్యంలో సాగుతూ పెద్దగా ఆకట్టుకోలేని కథనంతో ఆద్యంతం బోర్ కొట్టిస్తూ ఉంటుంది. పోలీస్ స్టోరీలను, యాక్షన్ సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా పెద్ద నిరాశనే మిగులుస్తుంది. దర్శకుడు, నటీనటులు అందరూ కొత్తవారే కావడంతో ప్రతి ఒక్కరూ విడివిడిగా చేసిన తప్పులన్నీ కలిసి ఒక పెద్ద తప్పుగా మారి ఈ చిత్రాన్ని కూడా ఆకట్టుకొలేని చిన్న సినిమాల జాబితాలోకి నెట్టేశాయి.

123telugu.com Rating : 1 /5
Reviewed by 123telugu Team

Exit mobile version