సమీక్ష : కుందనపు బొమ్మ – బోరింగ్ ‘బొమ్మ’!

Kundanapu Bomma review

విడుదల తేదీ : 24 జూన్, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : వరా ముళ్ళపూడి

నిర్మాత : జి. అనిల్ కుమార్ రాజు, జి. వంశీ కృష్ణ

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

నటీనటులు : చాందిని చౌదరి, సుధీర్ వర్మ, సుధాకర్


షార్ట్ ఫిల్మ్స్‌తో యూత్‌లో బాగా పాపులారిటీ సంపాదించిన నటి చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటించగా, ప్రఖ్యాత సినీ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ తనయుడు వరా ముళ్ళపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుందనపు బొమ్మ’. సుధీర్ వర్మ, సుధాకర్ కోమాకుల ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ మంచి రొమాంటిక్ కామెడీ అన్న ప్రచారంతో ముందుకొచ్చిన ఈ సినిమా ఎంతమేర ఆకట్టుకుందీ? చూద్దాం..

కథ :

సుచిత్ర (చాందిని చౌదరి).. విజయనగరంకి దగ్గర్లోని ఓ చిన్న ఊరికి పెద్దమనిషిగా పిలవబడే మహదేవరరాజు (నాగినీడు)కి ఏకైక కుమార్తె. కూతురుని అల్లారుముద్దుగా పెంచుకునే మహదేవరరాజు, తనకు మేనల్లుడైన గోపీ (సుధాకర్)ని తన ఇంటి అల్లుడిగా ప్రకటించుకుంటాడు. అయితే గోపీకి మాత్రం సుచిని పెళ్ళి చేసుకోవడం ఇష్టం ఉండదు. ఇదిలా ఉంటే, మహదేవర్రాజు ఇంట్లో ఓ కారును రిపేర్ చేయడానికి వచ్చిన వాసు (సుధీర్ వర్మ) అనే ఓ ఇంజనీర్, సుచిత్రతో ప్రేమలో పడతాడు.

ఆ తర్వాత సుచిత్ర కూడా వాసుని మెచ్చి అతడిని తిరిగి ప్రేమించడం మొదలుపెడుతుంది. ఈ పరిస్థితుల్లో గోపీయే తన అల్లుడని చెప్పుకునే మహదేవర్రాజుకి వీరిద్దరూ తమ ప్రేమను ఎలా తెలియజేశారు? గోపీకి సుచిత్రను పెళ్ళి చేసుకోవడం ఎందుకు ఇష్టం ఉండదు? వాసు-సుచిత్ర ప్రేమకథ ఏమైందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

హీరోయిన్ చాందినిని ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఓ చలాకీ పాత్రలో చాందిని మంచి ప్రతిభ కనబర్చింది. ముఖ్యంగా చాందిని, రాజీవ్ కనకాల నేపథ్యంలో వచ్చిన సన్నివేశాలు బాగున్నాయి. రాజీవ్ కనకాల క్యారెక్టరైజేషన్, దాన్ని అతడు పండించిన విధానం కూడా బాగున్నాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‌’తో పరిచయమైన సుధాకర్ ఈ సినిమాలో ఓ నెగటివ్ రోల్ చేసి అందులో బాగానే ఆకట్టుకున్నాడు. సుధీర్ వర్మ కామెడీ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో సుధీర్-చాందినీల మధ్యన వచ్చే కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్ అంటే అసలు కథంతా ఓ అర్థం లేని పదార్థం కావడం గురించే చెప్పాలి. పోనీ, అర్థం లేకపోయినా, కనీసం ఉన్న కామెడీ అయినా నవ్వించేలా ఉందంటే అదీ లేదు. కామెడీ కోసం రాసుకున్న సన్నివేశాలు నవ్వు తెప్పించకపోగా, విసుగు పుట్టిస్తాయి. ముఖ్యంగా ఝాన్సీ ఎపిసోడ్ అయితే మరీ విసుగు పుట్టించేలా ఉంది. వాసు క్యారెక్టర్ అసలు కథలోకి ఎంట్రీ ఇచ్చే అంశం సిల్లీగా తయారైంది.

ఓ కారు రిపేరు కోసం అతడు అక్కడికి రావడం, దానిచుట్టూ ఓ డ్రామా.. ఇదంతా చూస్తే, ఏదో పాత కాలం కథను, ఈ రోజుల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. అలాగే హీరోయిన్ ఫ్యామిలీలో ఆడవాళ్ళంతా హీరోయిన్ ప్రేమకథ గురించి తెలిసినా, కామెడీ చేస్కోవడం విచిత్రంగా తోస్తుంది. ఇక సినిమాలో ఎక్కడైనా ఎమోషన్ అన్నదే లేదు. ఏదో సన్నివేశాలు పేర్చుకుంటూ పోయినట్లు సినిమా నడుస్తుంది. లాజిక్‍ల గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాలో లాజిక్ అన్న అంశానికి చోటే లేదు.

సాంకేతిక విభాగం :

దర్శక, రచయిత వరా ముళ్ళపూడి ఏ కథ చెప్పాలనుకొని ఏ కథ చెప్పారో, ఏం చెప్పాలనుకొని ఈ సినిమా తీశారో అస్సలు అర్థం కాలేదు. దర్శకుడిగా ఆయన ఈ సినిమాలో ఎక్కడా కనీస ప్రతిభ కూడా చూపలేదు. ఒక్క రాజీవ్ కనకాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వదిలేస్తే, మిగతా అంతా సిల్లీ కామెడీ రాసుకొని దర్శకుడిగా పూర్తిగా నిరాశపరచాడు.

సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లొకేషన్సే ఉన్నా, ఉన్నవాటినే సినిమాటోగ్రాఫర్ సరిగ్గా బంధించాడు. సంగీత దర్శకుడు కీరవాణి స్థాయికి తగ్గ పాట ఒక్కటీ లేదు. నేపథ్య సంగీతం కూడా అంతంత మాత్రమే ఉంది. ఎడిటింగ్ దారుణంగా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు.

తీర్పు :

‘కుందనపు బొమ్మ’ అన్న టైటిల్ పెట్టి, పోస్టర్స్‌లో బాపు మార్క్‌ను చూపెట్టి మనముందుకు వచ్చిన సినిమా అంటే ఎలా ఉంటుందని ఊహిస్తామో, అందుకు ఇసుమంత కూడా చేరువలో లేని సినిమా ఇది. ఏం చెప్తుందో అర్థం కాని అస్పష్టమైన కథ, అర్థం పర్థం లేని సిల్లీ కామెడీ, బోరింగ్‌గా సాగిపోయే కథనం.. అన్నీ కలిసి ‘కుందనపు బొమ్మ’ను ఏమాత్రం ఆకట్టుకోలేని సినిమాగా మలిచాయి. ఒక్క చాందిని చౌదరి, రాజివ్ కనకాలల కాంబినేషన్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే, ఈ సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘కుందనపు బొమ్మ’ పేరుకి చాలా దూరంగా ఎక్కడో ఆగిపోయింది, అర్థం లేకుండా!

123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version