విడుదల తేదీ : అక్టోబర్ 07, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
దర్శకత్వం : చందూ మొండేటి
నిర్మాత : సూర్యదేవర నాగవంశీ
సంగీతం : రాజేశ్ మురుగేశన్, గోపీ సుందర్
నటీనటులు : నాగ చైతన్య, శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘ప్రేమమ్’. విడుదలైన ట్రైలర్లు, పాటలు హిట్టవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమమ్’కు రీమేక్ కావడంతో ఆ అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇన్ని అంచనాల ఈ చిత్రం నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నాగ చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్.. ఇలా ముగ్గురు హీరోయిన్లు నటించిన ఈ ప్రేమకథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
విక్రమ్ (నాగ చైతన్య) అనే కుర్రాడు 16 ఏళ్ల స్కూల్ వయసులో ఆకర్షణ వల్ల తన ఇంటి దగ్గరుండే సుమ(అనుపమ పరమేశ్వరన్) ను ఇష్టపడతాడు. ఆ తరువాత తన ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తన లెక్చరర్ సితారా వెంకటేష్ (శృతి హాసన్) ను ప్రాణంగా ప్రేమిస్తాడు. తరువాత 30 ఏళ్ల వయసులో సింధు(మడోన్నా సెబాస్టియన్) అనే అమ్మాయి అతనికి పరిచయమవుతుంది. ఆ పరిచయం కూడా ప్రేమగా మారుతుంది.
విక్రమ్ 30 ఏళ్ల జీవితంలోని మూడు దశల్లో ఏర్పడ్డ ఆ మూడు ప్రేమ కథలు ఏమిటి ? ఆ ప్రేమ కథల్లో ఉన్న లక్ష్యణాలేమిటి ? వాటిలో ఏం జరిగింది ? వాటి వల్ల కలిగిన అనుభవాల ద్వారా విక్రమ్ లో ఎలాంటి మార్పులు వచ్చాయి ? చివరికి విక్రమ్ ఎవరి ప్రేమను పొందాడు ? అన్నదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే సూపర్ హిట్టైన ఒరిజినల్ మలయాళ వర్షెన్ కు అల్ఫోన్సే పుత్రేన్ అందించిన అందమైన ప్రేమ ‘కథ’. ఈ కథ వలనే ఈ తెలుగు రీమేక్ పై మొదటి నుండి మంచి పాజిటివ్ అంచనాలున్నాయి. పైగా దర్శకుడు చందూ మొండేటి ఒరిజినల్ వెర్షన్ ను పూర్తిగా కాపీ కొట్టకుండా కాస్త కొత్తగా ట్రై చేయడం కూడా ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. అలాగే హీరో అక్కినేని నాగ చైతన్య నటన సినిమాని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. నటనలో చైతూ పూర్తి స్థాయి పరిపూర్ణతను కనబరిచాడు. ఇంతకు ముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇందులోనే చాలా ఇష్టంగా నటించాడన్నది ఇట్టే స్పష్టమవుతోంది. అతని పాత్ర ఎదుర్కున్న అనుభవాలను చూస్తే లైఫ్ లో ఎక్కడో ఒక దగ్గర మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది.
స్కూల్ కుర్రాడిలా, రఫ్ అండ్ టఫ్ కాలేజీ యువకుడిలా అతని నటన చాలా బాగుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్, రొమాంటిక్ సన్నివేశాల్లో చైతు ఇరగదీశాడనే చెప్పాలి. ఇక మన తెలుగు ఫార్మాట్ కు తగ్గట్టు మొదటి భాగంలో హీరో స్నేహితుడి పాత్రలో ప్రవీణ్, కాలేజీ పీడీ పాత్రలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ పాత్రలతో, సెకండ్ హాఫ్ లో శ్రీనివాస్ రెడ్డి పాత్రతో పండించిన కామెడీ ఎక్కడా మిస్ ఫైర్ కాకుండా పర్ఫెక్ట్ గా పనిచేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఇక అక్కినేని అభిమానుల కోసమే అన్నట్టు మొదటి భాగంలో హీరో మేనమామగా వెంకటేష్ అతిధి పాత్ర, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో వచ్చే హీరో తండ్రిగా నాగార్జున అతిధి పాత్ర, అక్కడక్కడా హుషారెత్తించే డైలాగులు బాగా కనెక్టయ్యాయి. హీరోయిన్లు అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్ల నటన ఆసక్తికరంగా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలోని మైనస్ పాయింట్స్ అంటే చాలా మందికి అసలు కథ, అందులోని పాత్రల నడవడిక పూర్తిగా తెలిసిపోవడం. దీంతో మామూలుగానే ఈ సినిమాకి ఒరిజినల్ వెర్షన్ కి వద్దనుకున్నా కాస్త కంపారిజన్ ఏర్పడి కథనంలో, పాత్రల పర్ఫామెన్స్ లో అక్కడక్కడా కాస్త నిరుత్సాహం కలిగింది . అలాగే లెక్చరర్ పాత్రలో శృతి హాసన్ అంత గొప్పగా కుదరకపోవడంతో ఆ లవ్ ట్రాక్ లో కాస్త బలం తగ్గి కాస్త బోర్ కొట్టింది. ఇక మొదటి భాగం ఇంటర్వెల్ ముందు కాసేపు సినిమాను సాగదీశారు.
సాంకేతిక విభాగం :
ప్రేమమ్ ఒరిజినల్ వెర్షన్ కు బలం కెమెరా వర్క్, సంగీతం. ఈ రెండు కూడా ఆ సినిమా పట్ల ప్రేక్షకుడు అభిమానం పెంచుకోవడానికి చాలా బాగా ఉపయోగపడ్డాయి. అలాగే ఇక్కడ తెలుగులో కూడా ఒరిజినల్ వెర్షన్ నుండి తీసుకుని గోపి సుందర్, రాజేష్ మురగేశన్(ఒరిజినల్ వెర్షన్ కి పనిచేశాడు) అందించిన సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరాయి.
ఇక ఒరిజినల్ కథకి దర్శకుడు చందూ మొండేటి కొత్తదనం చూపిస్తూ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులకి కనెక్టయ్యే విధంగా ఉంది. సినిమాకి ముఖ్యమైన విక్రమ్ పాత్ర నుండి అన్ని రకాల ఎమోషన్స్ రాబట్టుకోవడంలో చందూ సక్సెస్ అయ్యారు. అలాగే కొన్ని సన్నివేశాలలో ఆయన రాసిన డైలాగులు చాలా బాగున్నాయి. కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ కూడా సినిమా స్పష్టంగా అర్థమయ్యేలా చేసింది. ఎస్. నాగ వంశీ పాటించిన నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.
తీర్పు :
ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రం నటుడిగా నాగ చైతన్య స్థాయిని పెంచే చిత్రం. ఆయన నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ నిలుస్తుంది. అలాగే చందూ మొండేటి ఆకట్టుకునే స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ టైమింగ్ తో సాగే కామెడీ, థ్రిల్లింగా అనిపించే వెంకటేష్, నాగార్జునల ముఖ్యమైన అతిధి పాత్రలు, ఫస్టాఫ్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, హీరో పాత్ర చిత్రీకరణ, వినసొంపైన సంగీతం ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కాగా కథలోని రెండవ ప్రేమ కథలోని కొన్ని సన్నివేశాలు కాస్త బోర్ కొట్టిస్తాయి. మొత్తానికి ఒరిజినల్ వెర్షన్ తో పోలిక పెట్టుకోకుండా కొత్త సినిమా చూస్తున్నట్టు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team