విడుదల తేదీ : అక్టోబర్ 21, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : ముకుంద్ పాండే
నిర్మాత : ఓబుల్ సుబ్బారెడ్డి
సంగీతం : అరవింద్ శంకర్
నటీనటులు : అదిత్ అరుణ్, పూజా జవేరి..
హర్రర్ థ్రిల్లర్ జానర్‌కు తెలుగులో ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ పెరిగిన నేపథ్యంలో, అదే జానర్‌ను నమ్ముకొని వచ్చిన సినిమాయే ఎల్ 7. అదిత్, పూజా జవేరీలు హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ హర్రర్ థ్రిల్లర్ ఎంతవరకు బయపెట్టిందో చూద్దాం..
కథ :
అరుణ్ (అదిత్ అరుణ్), సంధ్య (పూజా జవేరి) కొత్తగా పెళ్ళైన జంట. ఎంతో ఇష్టంగా ఊరి చివర్లో ఓ పెద్ద ఇంటిని అద్దెకు తీసుకొని అందులో ఉండాలనుకొని వచ్చిన వారికి అక్కడ కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాతే సంధ్య వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఒక ఎక్స్పరిమెంట్ ద్వారా ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలుసుకున్న అరుణ్, ఆ తర్వాత ఏం చేశాడు? ఆ దయ్యం తన భార్యలోకే ఎందుకు ప్రవేశించింది? ఆ దయ్యం కథేంటీ? ఆ ఇంట్లో నుంచి ఈ జంట ఎలా బయటపడింది? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే దయ్యం ఫ్లాష్‌బ్యాక్ అనే చెప్పుకోవాలి. అన్ని హర్రర్ సినిమాల్లోలానే ఈ సినిమాకూ ఎంచుకున్న కథ పాతదే అయినా, ఫ్లాష్‌బ్యాక్ మాత్రం ఉన్నంతలో కొత్తగా ఉంది. ఇక ప్రీ ఇంటర్వెల్‌కు ముందు ఇంట్లో దయ్యం ఉందా? లేదా? అంటూ చేసే ఓ ఎక్స్పరిమెంట్ చాలా బాగుంది. ఆ సమయంలో వచ్చే థ్రిల్స్‌తో పాటు, ఆ సన్నివేశాల మేకింగ్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ బాగా నవ్వించింది. వెన్నెల కిషోర్ తన టైమింగ్‌తో మామూలు సన్నివేశాలను కూడా కడుపుబ్బా నవ్వించేలా చేయగలనని ఈ సినిమాతో మరోసారి నిరూపించుకున్నాడు.
అదిత్ అరుణ్ ఓ సింపుల్ రోల్లో బాగా నటించాడు. క్లైమాక్స్‌లో లేడీ గెటప్ వేసుకొని కూడా మెప్పించాడు. ఇక పూజా జవేరి ఓ బలమైన రోల్లో బాగా నటించింది. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా గ్లామర్‌తో ఆకట్టుకున్న ఆమె, సెకండాఫ్‌లో దయ్యంగా బాగా మెప్పించింది. కథను మొదలుపెట్టిన సన్నివేశాన్ని, క్లైమాక్స్‌కు తెలివిగా కలిపిన విధానం బాగా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
కథ చాలా పాతది కావడమే ఇక్కడ మైనస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒక్క ఫ్లాష్‌బ్యాక్ ఏమై ఉండొచ్చని ఆలోచించడం తప్పితే మిగతా అంతా మనం ఊహించినట్లుగానే జరుగుతూ పోతుంది. దీంతో సినిమా కథనం అం అసక్తిగా సాగలేదు. సెకండాఫ్‌లో హీరోయిన్ దయ్యంగా మారాక ఆమెకు వేసిన మేకప్ కూడా భయపెట్టేదిగా లేకపోవడం అటుంచితే, చూడడానికి కూడా అస్సలు బాగోలేదు. ఇక ఫస్టాఫ్‌లో ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేవరకూ కథ మొదలుకాకపోవడం నిరుత్సాహపరచే అంశమే! దయ్యం అంశాన్ని పక్కనబెడితే కొన్ని విషయాల్లొ లాజిక్ లేకపోవడం మైనస్ అనే చెప్పాలి. ఇక ఫస్టాఫ్‌లో వచ్చే రెండు పాటలూ అనవసరమైనవిగానే కనిపించాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, దర్శక, రచయిత ముకుంద్ పాండే ఒక రొటీన్ కథనే మళ్ళీ, మనకు తెలిసినే హర్రర్ థ్రిల్లర్ ఫార్మాట్లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. ఫ్లాష్‌బ్యాక్‌కు ఎంచుకున్న పాయింట్ విషయంలో మాత్రం దర్శకుడు కొత్తదనం చూపించాడు. అది పక్కనబెడితే ఓ సాదాసీదా హర్రర్ థ్రిల్లర్‌ని మాత్రమే అందించగలిగాడు. మేకింగ్ విషయంలో కొన్ని చోట్ల దర్శకుడు చేసిన ప్రయోగాలు బాగున్నాయి.
సినిమాటోగ్రఫీ కథ అవసరానికి తగ్గట్టు బాగుంది. పాటలు అసందర్భమైనవే కాక, వినడానికి కూడా బాగోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫర్వాలేదు. ఎడిటింగ్ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నంతో బాగున్నాయి.
తీర్పు :
కొత్తగా పెళ్ళైన ఒక జంట పెద్ద ఇంట్లోకి అద్దెకు దిగుతుంది. ఆ ఇంట్లో ఉండే ఓ దయ్యం వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆ ఇబ్బందులను దాటి బయటపడడానికి వారు ఎన్నో కష్టాలు పడాలి. ఇదే కథతో ఒక్క తెలుగులోనే కాక, ఎన్ని భాషల్లో ఎన్ని హర్రర్ సినిమాలు వచ్చాయో! ఎల్ 7 కూడా సరిగ్గా ఇదే కథతో ఎన్నోసార్లు చూసినట్లనిపించే ఓ హర్రర్ థ్రిల్లర్. అయినప్పటికీ పెద్దగా బోర్ కొట్టించకపోవడం, మంచి ఇంటర్వెల్, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, వెన్నెల కిషోర్ కామెడీ లాంటి ప్లస్ పాయింట్స్ కొన్ని ఉన్నాయీ సినిమాలో! ఒక్క మాటలో చెప్పాలంటే.. చూసిన సినిమానే మళ్ళీ చూసినా ఫర్వాలేదనుకొని, కొన్ని థ్రిల్స్ కోసం చూస్తే ‘ఎల్ 7’ ఫర్వాలేదనిపిస్తుంది.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team