విడుదల తేదీ : అక్టోబర్ 28, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : మోహన ప్రసాద్
నిర్మాత : ఎం. రాఘవయ్య
సంగీతం : వెంగి
నటీనటులు : శైలేంద్ర, దీక్షా పంథ్, అంగనా రాయ్..
రేసింగ్ ఫీల్డ్ నుంచి సినిమాల్లోకి వచ్చి ’ముకుందా’తో పరిచయమైన శైలేంద్ర, పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా ’చల్ చల్ గుర్రం’. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
మనోహర్ (శైలేంద్ర) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉండే ఓ టాలెంటెడ్ యువకుడు. తనకెదో చాలా అవసరం ఉందని చెప్పి మనోహర్ ఒకేసారి రెండు కంపనీల్లో ఉదయం షిఫ్ట్, రాత్రి షిఫ్ట్ పనిచేస్తూ ఉంటాడు. మనోహర్ ఇలా తన రోజంతా పనిచేస్తూ ఉండడానికి కారణం ఏంటి? రెండు కంపనీల్లో సంపాదించడం ద్వారా వచ్చే డబ్బుతో అతడేం చేయాలనుకున్నాడు? దీన్నంతటినీ ఎలా మేనేజ్ చేశాడు? ఈ కథలో షీలా (దీక్షా పంథ్), రతి (అంగనా రాయ్) ఎవరూ? అన్నదే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉన్నంతలో బాగుంది. ఈ సమయంలో నాగబాబు తన డైలాగులతో బాగానే ఆకట్టుకున్నారు. హీరో శైలేంద్ర తన శక్తిమేర కమర్షియల్ హీరో ప్రయత్నాలన్నీ చేశాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగానే ఉంది. హీరోయిన్లు ఇద్దరికీ నటించడానికి పెద్దగా అవకాశాలేం లేకపోయినా అందాల ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు షిఫ్ట్‌లు మేనేజ్ చేసే కొన్ని సన్నివేశాల్లో కామెడీ ఫర్వాలేదు.
మైనస్ పాయింట్స్ :
అసలు కథ, కథనాలంటూ లేకపోవడమే ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషన్ బాగున్నా అంతకుమించి ఈ సినిమాలో వేరే ఇతర సన్నివేశాల్లో ఎక్కడా ఎమోషన్ అన్నదే లేదు. డబ్బు సంపాదించడం కోసం ఒకేసారి రెండు కంపనీల్లో ఉద్యోగం చేయడమన్న ఆలోచనను రెండు గంటల పాటు సాగదీస్ బోర్ కొట్టించారు. కథే లేకపోవడంతో ఎక్కడ ఏ సన్నివేశం వస్తుందో తెలియకుండా సినిమా నడుస్తూ విసుగు పుట్టించింది.
పాటలన్నీ అసందర్భంగా వచ్చేవే కాక, వినడానికి కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఇక కావాలని ఇరికించిన కామెడీ ట్రాక్స్ ఏవీ ఆకట్టుకోకపోగా సినిమాను మరింత డీలా చేశాయి. ఒక సినిమా కథ లేకుండా అందించగల కనీస ఎంటర్టైన్మెంట్ అందించడానికి కూడా ఈ సినిమాలో ఏమీ లేకపోవడం నిరుత్సాహపరచే అంశం.
సాంకేతిక విభాగం :
సాంకేతిక అంశాల పరంగా చూస్తే, ముందుగా దర్శకుడు మోహన ప్రసాద్ ఎక్కడా మెప్పించలేకపోయాడనే చెప్పాలి. ఇటు రైటింగ్ పరంగా గానీ, అటు మేకింగ్ పరంగా గానీ దర్శకుడు ఎక్కడా కనీస ప్రతిభ చూపలేకపోయాడు. ఎడిటింగ్ ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. పాటలు చెప్పుకోదగ్గవి ఒక్కటీ లేవు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
థియేటర్ల ముందుకు వస్తున్నట్లు కూడా తెలియని సినిమాలకు కథే ప్రధానమన్నది అందరూ చెప్పే మాట. ఆ కథ, దాంతో పాటు సినిమా బాగుంటేనే విడుదల తర్వాత ఆ సినిమా తన ఉనికిని చాటుకోగలుగుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని మరిచి ఒక కథంటూ లేకుండా, సన్నివేశాల్లో ఎక్కడా బలం లేకుండా వచ్చిన సినిమాయే చల్ చల్ గుర్రం. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే.. చల్ చల్ అంటూ పరిగెత్తాల్సిన గుర్రం, బలం లేక చతికిలబడిపోయింది.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team