విడుదల తేదీ : నవంబర్ 18, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకత్వం : విని ఆనంద్
నిర్మాత : పి.వి. రావ్
సంగీతం : శేఖర్ చంద్ర
నటీనటులు : నిఖిల్, హెబ్బా పటేల్, నందిత శ్వేత
‘స్వామిరారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య’ వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లందుకున్న హీరో నిఖిల్ మధ్యలో ‘శంకరాభరణం’ వంటి అపజయం ఎదురైనా మళ్ళీ తన ప్రయోగాల ఫార్ములానే పాటిస్తూ చేసిన చిత్రం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’. ఫస్ట్ లుక్, ట్రైలర్లలతో మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఆ హైప్ ని అందుకుందా ? లేదా ? అనేది ఇప్పుడు చూద్దాం…
కథ :
అర్జున్ (నిఖిల్) అనే కుర్రాడు తన స్నేహితుడు (వెన్నెల కిశోర్) కు ట్రీట్మెంట్ చేయించడానికి కేరళకు వెళతాడు. అక్కడే అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ హైదరాబాద్ తిరిగొచ్చాక తాను ప్రేమించింది అమలని కాదని నిత్య అనే అమ్మాయి శరీరంలో ఉన్న అమల ఆత్మనని తెలుకుని షాక్ అవుతాడు. అతను ఆ షాక్ లో ఉండగానే అమల ఆత్మ తనను ప్రేమించిన అర్జున్ ని వెతుక్కుంటూ వస్తుంది.
అలా అర్జున్ కి దగ్గరవాలనుకున్న ఆ అమల ఎవరు ? ఆత్మగా మారినా కూడా అర్జున్నే ఎందుకు ప్రేమించింది ? అర్జున్ కి దగ్గరవడానికి ఏం చేసింది ? చివరికి అర్జున్ అమలకి దక్కాడా ? లేదా ? అసలు వాస్తవంగా అర్జున్ ఎవరిని ప్రేమించాడు ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే దర్శకుడు విఐ ఆనంద్ రొమాంటిక్ థ్రిల్లర్ కు ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ను జోడించి కథను చెప్పిన విధానం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో కథనాన్ని నడిపిన తీరు ఆకట్టుకుంది. ఆద్యంతం కథలో ఎదో ఒక థ్రిల్ వస్తూ సినిమాపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఫస్టాఫ్, సెకండాఫ్ లలో నడిచే కొత్తదనమున్న కామెడీ ఆకట్టుకుంది. వెన్నెల కిశోర్, సత్యలు టైమింగ్ ఉన్న పంచ్ లతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు.
అలాగే ఫస్టాఫ్ ఓపెనింగ్ ఆసక్తికరంగా ఉంది. ఇంటర్వెల్ థ్రిల్ అయితే సెకండాఫ్ లో ఏం జరుగుతుందో అనే ఆసక్తిని పెంచింది. ఇక సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ సెకండాఫ్ లో వచ్చే అమల పాత్రను పోషించిన నటి నందితా శ్వేతా నటన. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఒక ఆత్మగా ఆమె నటన అద్భుతమనే చెప్పాలి. కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు, బాడీ లాంగ్వేజ్ అన్నీ సినిమాకి ప్లస్ అయ్యాయి. ఆమెపై నడిచే సన్నివేశాలు ప్రతిదీ ఆకట్టుకుంది. క్లైమాక్స్ రొటీనే అయినప్పటికీ అందులో నటనతో దానికి కాస్త కొత్తదనాన్ని తీసుకొచ్చింది నందితా శ్వేత. హీరో నిఖిల్, హెబ్బా పటేల్ ల నటన కూడా ఆకట్టుకుంది.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ మధ్యలో ఉన్న రన్ టైమ్ గురించి. ఆ రన్ టైమ్ లో నడిచే సినిమా చాలా వరకూ బోరింగానే సాగింది. అక్కడక్కడా వచ్చే వెన్నెల కిశోర్ కామెడీని మినహాయిస్తే ఇంటర్వెల్ పడే వరకూ ఎక్కడా రిలీజ్ దొరకలేదు. దర్శకుడు ఆ పార్ట్ ని ఇంకాస్త గ్రిప్పింగా రాసుకుని ఉండాల్సింది. అలాగే సెకండాఫ్ కథనంలో కూడా కాస్త బలం లోపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీక్వెన్స్ రొటీన్ గానే ఉంది. సెకండాఫ్ నడుస్తున్న కొద్దీ ఆహా.. క్లైమాక్స్ అద్దిరిపోయేలా ఉంటుంది అనుకుంటే అది అన్ని సినిమాల్లాగే పాతగానే సాగి నిరుత్సాహపరిచింది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగానికొస్తే పేపర్ మీదే కన్ఫ్యూజన్ కలిగించే ఈ కథను తెర మీద చాలా వరకూ స్పష్టంగా ఆవిష్కరించిన దర్శకుడు, రచయిత విఐ ఆనంద్ గురించి చెప్పుకొవాలి. సినిమా ఓపెనింగ్, ఇంటర్వెల్ థ్రిల్, సెకండాఫ్ కథనం, కామెడీని టైమింగ్ లో వాడుకున్న తీరు బాగున్నాయి. వీటికి తోడు రన్ టైమ్ తగ్గించి, కథనంలో ఇంకాస్త బలాన్ని పెంచి ఉంటే బాగుండేది. అలాగే శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి చాలా ఉపయోగపడింది. కీలకమైన సన్నివేశాల్లోని తీవ్రతను అది రెట్టింపు చేసింది. సాయి శ్రీరామ్ కెమెరా పనితనం చాలా బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇక నిర్మాత పి.వి రావ్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
నిఖిల్ మరోసారి తన ప్రయోగాత్మకమైన ఫార్ములాను నమ్ముకుని చేసిన మరో ప్రయత్నమే ఈ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రం. రొమాంటిక్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ చిత్రంలో ఫస్టాఫ్ ఓపెనింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, సెకండాఫ్ కథనం, వెన్నెల కిశోర్, సత్యల కామెడీ, నందిత శ్వేతా నటన ప్లస్ పాయింట్స్ కాగా ఫస్టాఫ్ లో బోర్ కొట్టించే కథనం, ఎక్కువైన రన్ టైమ్, సెకండాఫ్ లో కథనంపై కాస్తంత పట్టు లోపించడం, రొటీన్ క్లైమాక్స్ లు మైనస్ పాయింట్స్. మొత్తంగా చెప్పాలంటే ఈ చిత్రం థ్రిల్స్ తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్స్ కు కూడా పంచి ఈ వారాంతంలో ధైర్యంగా చూడదగ్గ సినిమాగా నిలబడింది.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team