విడుదల తేదీ : డిసెంబర్ 2, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : వైశాఖ్
నిర్మాత : కృష్ణా రెడ్డి
సంగీతం : గోపి సుందర్
నటీనటులు : మోహన్ లాల్, కమలిని ముఖర్జీ
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రం ‘పులి మురుగన్’ సూపర్ హిట్టై రికార్డ్ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులోకి డబ్ చేసిన ఈ చిత్రం ‘మన్యం పులి’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి మలయాళ ప్రేక్షకుల్ని అంతగా అలరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…
కథ :
పులియూరు అనే గ్రామం పరిసర ప్రాంతాల్లో మనుషుల రక్తానికి అలవాటుపడ్డ పులి తిరుగుతూ గ్రామంలోని చిన్న పిల్లల్ని, ఇతరుల్ని చంపి తినేస్తూ గ్రామస్తులకి పెద్ద ప్రమాదంగా మారుతుంది. అలాంటి పులితో పోరాడగల నైపుణ్యం, ధైర్యం ఉన్న వ్యక్తి ఆ గ్రామంలో ఒక్కడే ఉంటాడు. అతనే కుమార్ (మోహన్ లాల్).
కానీ లారీ డ్రైవర్ అయిన కుమార్ అనుకోకుండా ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుని ప్రమాదంలో ఉన్న ఆ గ్రామాన్నే విడిచి వెళ్లిపోవాల్సి వస్తుంది. అలా కుమార్ గ్రామం విడిచి వెళ్ళగానే ఆ గ్రామానికి ఏమైంది ? కుమారు తిరిగొచ్చి గ్రామస్తులను కాపాడాడా ? అతను సిటీలో ఎలాంటి కష్టాలు పడ్డాడు ? అసలు జగపతిబాబు ఈ కథలోకి ఎలా వచ్చాడు ? అనేదే ఈ సినిమా కథ…
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసిన ప్లస్ పాయింట్స్ లో యాక్షన్ సీక్వెన్సులు ముఖ్యమైనవి. మొత్తం మూడు యాక్షన్ సన్నివేశాల్లో మోహన్ లాల్ ను చాలా బాగా చూపించారు. మంచి యాక్షన్ స్టంట్లు, వాటికి మరింత భారీ తనం తీసుకొచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. మోహన్ లాల్ చుట్టూ తిరిగే యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ సన్నివేశాలను దర్శకుడు వైశాఖ్ చాలా బాగా ఎలివేట్ చేశారు. అవసరమైన చోట వాటిని వాడుకుంటూ చాలా బాగా కథను నడిపాడు.
ముఖ్యంగా మోహన్ లాల్ అంత వయసులో హెవీ యాక్షన్ సీన్లు చేస్తున్నా ఎక్కడా మనకు ఆయన వయసు గుర్తుకురాదు. అడవిలో జరిగే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు బాగానే ఆకట్టుకున్నాయి. సినిమా ఫస్టాఫ్ ఆరంభం నుండి ఇంటర్వెల్ దాకా బాగా ఎంటర్టైన్ చేసింది. కమలిని ముఖర్జీ నటన బాగుంది. జగపతిబాబు తన పాత్ర పరిధి మేర బాగానే నటించాడు.
మైనస్ పాయింట్స్ :
సినిమా ఆడవారిలో సాగుతున్నంత సేపు ఆసక్తికరంగా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే కథ సిటీలోకి వచ్చిందో రొటీన్ బోరింగ్ గా మారిపోయింది. దాంతో డాన్ ఎంట్రీ ఇవ్వడం, మోహన్ లాల్ తనపై జరిగిన కుట్రకు వ్యతిరేకంగా పోరాడటం వంటివి బాగానే ఉన్నా కూడా బోర్ కొట్టించాయి. వాటి వలన కథ పూర్తిగా సైడ్ ట్రాక్ తీసుకున్నట్టు అనిపించింది.
సినిమాలో పులితో జరిగే యాక్షన్ సన్నివేశాలు, ఇతర ఫైట్స్, మోహన్ లాల్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు వలన సినిమా బాగానే ఉంది అనుకునే సమయంలో మధ్యలో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్స్ బోరింగ్ గా అనిపించాయి. అలాగే సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉంది. ఇక కథలో నమిత పాత్ర అయితే ఎందుకొస్తుందో కూడా అర్థం కాక చికాకు పుట్టించింది.
సాంకేతిక విభాగం :
సినిమా విజువల్స్ పరంగా చాలా బాగుంది. అడవిలో తీసిన సన్నివేశాలు చాలా సహజంగా, చాలా బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. అడవిలో హీరోని ఎలివేట్ చేసే సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. సినిమా సగం ఘనత కెమెరా వర్క్ కే దక్కుతుంది. ఇక ఆ సన్నివేశాలకు తగ్గట్టుగా గోపి సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.
ఇక దర్శకుడు వైశాఖ్ విషయానికొస్తే అడ్వెంచరస్ సినిమాలోనే కమర్షియల్ అంశాలను కూడా చూపాడు. మంచి కథ, కథనాలతో ఒక సగటు మోహన్ లాల్ అభిమానికి ఏమేమి కావాలో అన్నీ అందిచాడతను. కానీ కరాశియల్ అంశాలను కాస్త ఎక్కువగా పట్టించుకుని సెకండాఫ్ ను రొటీన్ గా చేశాడు. ఆలా కాకుండా సెకండాఫ్ కథను కూడా గ్రామంలోనే నడిపి అందులోనే జగపాటిబాబు పాత్రను డెవలప్ చేసి ఉంటే సినిమా ఇంకా బాగుండేది.
తీర్పు :
ఈ మన్యం పులి చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, మోహన్ లాల్ పై నడిచే మాస్ సన్నివేశాలు ద్వారా మలయాళంలో పెద్ద హిట్ గా నిలిచింది కానీ తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే మాత్రం రెగ్యులర్ ఇంటెర్వెల్స్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్స్ మాత్రమే బాగా నచ్చుతాయి. కనుక ఈ యాక్షన్, థ్రిల్ ఎపిసోడ్ లను మినహాయిస్తే రొటీన్ డ్రామా, నేటివిటీ మిస్సవడం వంటి అంశాలని అంగీకరించగలిగితే ఈ సినిమా చూడొచ్చు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team