విడుదల తేదీ : డిసెంబర్ 23, 2016
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : దాసరి కిరణ్కుమార్
సంగీతం : రవిశంకర్
నటీనటులు : సందీప్ కుమార్, వంశీ నక్కంటి, వంశీ చాగంటి, నైనా గంగూలీ
ఈ వారాంతపు విడుదలలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వంగవీటి’. 80, 90వ దశకాలలో విజయవాడలో నడిచిన రౌడీయిజం నైపథ్యంలో జరిగిన వాస్తవ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో సందీప్ కుమార్, వంశీ కృష్ణలు ప్రధాన పాత్రలు పోషించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
విజయవాడలో బాగా పాపులర్ అయిన వంగవీటి, దేవినేని కుటుంబాల మధ్య నడిచే శత్రుత్వం పై నడిచే కథే ఈ వంగవీటి. విజయవాడ నగరంలో చిన్న రౌడీగా మొదలైన వంగవీటి రాధ (సందీప్ కుమార్) అనూహ్య రీతిలో ఎదుగుతుంటాడు. దాంతో అతని ప్రత్యర్థి వర్గమైన దేవినేని కుటుంబం అతన్ని హతమారుస్తుంది. ఆ హత్య తరువాత ఈ రెండు కుటుంబాల సభ్యులు పగతో ఒకరినొకరు ఎలా చంపుకున్నారు, చివరికి ఆ పగ ఎలా ముగిసింది అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలోని ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రధాన పాత్రలు పోషించిన నటుడు సందీప్ కుమార్ గురించి. రంగ, రాధ పాత్రల్లో సందీప్ చాలా బాగా నటించాడు. భవిష్యత్తులో అతను గొప్ప నటుడవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అతన్ని అంత గొప్పగా చూపించి, అతని పాత్రను అంత బలంగా తయారు చేసిన రామ్ గోపాల్ వర్మకే ఈ క్రెడిట్ అంతా వర్మకు దక్కుతుంది.
హత్యలను, వాటిని చేయడానికి రచించిన పథకాలను, వాటిని ఎగ్జిక్యూట్ చేసిన విధానాన్ని వర్మ చాలా డీటైల్డ్ గా చూపించాడు. సినిమాను ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చాలా నీట్ గా తెరకెక్కించాడు వర్మ. ఇంటర్వెల్ బ్యాంగ్, దేవినేని మురళి హత్య చాలా అద్భుతంగా చూపబడ్డాయి. హ్యాపీ డేస్ వంశీ కృష్ణ తన పాత్రలో బాగా నటించాడు. ప్రామ్యుఖ్యత ఉన్న అతని పాత్ర సినిమాకు చాలా హెల్పయింది. కథలోని ఇతర పాత్రలు పోషించిన నటీ నటులు కూడా ఎవరి పరిధి మేర వాళ్ళు బాగానే నటించారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతంగా ఉండి సినిమాలోని తీవ్రతను మరింతగా పెంచింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా క్లైమాక్స్ చాలా మామూలుగా పూర్తయినట్టు అనిపించింది. విజయవాడలో జరిగిన ఈ యదార్థ ఘటనలు, అందులోని పాత్రల గురించి తెలియని వాళ్లకు ఈ సినిమా అంతా ఏదో రివెంజ్ డ్రామాలాగా, ఒకర్ని ఒకరు చంపుకునే మామూలు కథలాగా అనిపిస్తుంది. ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర, ఆ పాత్ర ప్రవర్తన కొన్ని వర్గాల్లో అలజడిని సృష్టించే అవకాశముంది.
అసలైన వాస్తవ కథలోని ముఖ్యమైన పాత్రలకున్న చరిత్రను వర్మ చాలా వరకూ చూపించకుండా చాలా సాధారణంగా సినిమాని ముగించాడు. ఈ సినిమాలో ఎక్కువగా ఉన్న హింస, హత్యలు, రక్తపాతం కొంత మంది ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు.
సాంకేతిక విభాగం :
సినిమాలోని విజువల్స్ చాలా బాగున్నాయి. డ్రోన్ కెమెరా వాడి విజవాడలోని ముఖ్యమైన లొకేషన్లను చూపిన విధానం బాగుంది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ్ విలువలు గొప్పగా ఉన్నాయి. సినిమాకు 80ల నాటి లుక్ తీసుకురావడంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ చేసిన కృషి మెచ్చుకోదగ్గదిగా ఉంది. ఎడిటింగ్, డైలాగులు చాలా బాగున్నాయి.
ఇక వర్మ విషయానికొస్తే ఈ చిత్రం ఆయన గత సినిమాలకంటే చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను వర్మ చాలా గ్రిప్పింగా వివరించాడు. హత్యలు, వాటిని ఎగ్జిక్యూట్ చేసే విధానంలో నటీనటుల నుండి సరైన నటనను రాబట్టుకోవడంలో వర్మ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. వర్మ టేకింగ్లో కొత్తదనమేమీ లేకపోయినప్పటికీ ఒరిజినల్ పాత్రలను పోలి ఉండేలా నటులను ఎంచుకోవడంలో వర్మ తన అద్భుతమైన టాలెంట్ ను చూపాడు.
తీర్పు :
వర్మ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాల్లో ఇదే మంచి సినిమా అని చెప్పొచ్చు. సినిమాకి కీలకమైన వాస్తవ కథ తెలిసిన వారికి ఈ సినిమా వెంటనే నచ్చేస్తుంది. అలాగే అసలు కథ ఏంటో తెలీనివారికి వర్మ మార్క్ లో ఉండే రొటీన్ రివెంజ్ డ్రామాలా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అసలు వర్మ సినిమాలో ఏం చెప్పాడా అనే ఆసక్తితోనే సినిమాను చూస్తారు. మొత్తం మీద ఆర్జీవీ ‘రక్తచరిత్ర’ను ఇష్టపడ్డ వారికి వాస్తవమైన గ్యాంగ్ వార్స్, రౌడీయిజం నైపథ్యంలో చాలా రియలిస్టిక్ గా తీయబడిన ఈ ‘వంగవీటి’ సినిమా కూడా నచ్చుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team