సమీక్ష : ఎంతవరకు ఈ ప్రేమ – రొమాన్స్ తగ్గింది కానీ ఫన్ దొరికింది !

Enthavaraku Ee Prema movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : డీకే

నిర్మాత : డి. వెంకటేష్

సంగీతం : లియోన్ జేమ్స్

నటీనటులు : జీవ, కాజల్ అగార్వల్

కాజల్ అగర్వాల్, జీవ జంటగా డీకే డైరెక్ట్ చేసిన చిత్రం ‘కావలై వెండం’ చిత్రం తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో డబ్ అయింది. ఒరిజినల్ వెర్షన్ గత సంవత్సరమే విడుదలైనా కూడా తెలుగు అనువాదం పలు వాయిదాలు పడుతూ ఈరోజే రిలీజయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ :

అరవింద్ (జీవ)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దివ్య(కాజల్ అగార్వల్) అతన్నుండి విడిపోయి వేరొకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకు అతని నుండి లీగల్ గా విడాకులు కోరుతుంది. కానీ అరవుండ్ మాత్రం విడాకులు ఇవ్వాలంటే ఒక కండిషన్ పెడతాడు.

ఆ కండిషన్ ఏంటి ? ప్రాణంగా ప్రేమించిన అరవింద్ నుండి దివ్య ఎందుకు విడిపోతుంది ? అసలు అరవింద్ ఎలాంటి వాడు? చివరికి దివ్యకు అరవింద్ విడాకులిచ్చాడా ? వాళ్ళ ప్రేమ ఏమైంది ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది కాజల్ అగర్వాల్ అనే చెప్పాలి. ఆమె ఇదివరకటి సినిమాల్లో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపించింది. అందంగా ఉండటంతో పాటు మంచి పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా పాటల్లోని ప్రతి ఫ్రేమ్లో ఆమె అందం కట్టిపడేసింది. ఇక హీరో జీవ పాత్ర భిన్నంగా ఉండటంతో పాటు పూర్తి ఫన్ నిండి ఉంటుంది. హీరో ఫ్రెండ్స్ ఆర్జే బాలాజీ, బాల శరవణన్ పాత్రల ద్వారా పండించిన కామెడీ చాలా చోట్ల నవ్వించింది. వాళ్ళ పాత్రలు చెప్పిన డైలాగులు కాస్త ఘాటుగా ఉన్నప్పటికీ మంచి టైమింగ్ తో కూడి ఫన్ ఇచ్చాయి.

దర్శకుడు డీకే హీరో హీరోయిన్ల పాత్రలను ఇతర పాత్రలతో సమానంగానే ట్రీట్ చేస్తూ కథనం నడపడం బాగుంది. హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ మొదలవడం, అది బ్రేకప్ అయిన విధానం రొమాంటిక్ గాను, కామెడీగాను ఉన్నాయి. ఇక సెకండాఫ్లో హీరో హీరోయిన్ల మధ్య నడిచే రెండు ఎమోషనల్ సీన్లు కాస్త కదిలించాయి. అదే విధంగా సెకండాఫ్లో వచ్చే పోలీస్ స్టేషన్, బోట్ షికార్ కామెడీ సీన్లు చాలా బాగా నవ్వించాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభం, కథనం ఫన్నీగానే నడుస్తున్నప్పటికీ కొన్ని పాత్రలు అతిగా బిహేవ్ చేయడం నచ్చలేదు. అలాగే హీరో తండ్రి పాత్ర పై వచ్చే సన్నివేశాలు కొంత వరకు భరించగలిగినా ఆ తర్వాత విసిగించాయి. జీవ ఫ్రెండ్ సునైనా క్యారెక్టర్ కూడా కాస్త విసిగించింది. హీరో హీరోయిన్ ను హాస్పిటల్ కు తీసుకెళ్లి ఇద్దరు పిల్లల్ని చూపించి కోబెడ్డింగ్ గురించి చెప్పే సీన్ ఎమోషనల్ గా ఉన్నా కూడా దానికి లాజిక్ లేనందువలన బలవంతంగా ఇరికించినట్టును అనిపించింది. ఫస్టాఫ్ ఫన్నీగా సాగినప్పటికీ సెకండాఫ్ లో ఆ ఫన్నీనెస్ మిస్సయింది.

హీరోకి పోటీగా బాబీ సిన్హా పాత్ర ఎంటరవడంతో వారిద్దరికీ మధ్య పోటాపోటీగా సాగే సన్నివేశాలు ఉంటాయని ఊహిస్తే అవేమీ ఉండవు. పైగా బాబీ సిన్హా లాంటి నటుడికి పెర్ఫార్మెన్స్ చూపించే స్కోప్ కూడా ఇవ్వలేదు దర్శకుడు. ఇక చివరి అరగంట సినిమాను ఏదో హడావుడిగా ముగించేసినట్టు అనిపించింది. సినిమాలో చాలా చోట్ల వచ్చే డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వుకోడానికి బాగున్నా ఫ్యామిలీ ఆడియన్సుకు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల లవ్ స్టోరీలో కాస్త రొమాన్స్, ఇంకాస్త పెయిన్ అనేది కనిపించి ఉంటే బాగుండేది. అది లేకపోవడం వలన వాళ్ళ ప్రేమను ప్రేక్షకుడు సీరియస్ గా తీసుకోలేకపోవచ్చు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు డీకే లవ్ స్టోరీని ఫన్నీగా చెప్పాలనే ప్రయత్నంలో హాస్యాన్ని బాగానే అందించినా రొమాన్స్ ని కావాల్సిన స్థాయిలో పండించలేకపోయాడు. అలాగే సెకండాఫ్లో ఆ ఫన్ కూడా కాస్త తగ్గింది. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అందమైన హిల్ స్టేషన్ లొకేషన్లను చాలా గొప్పగా ఉపయోగించుకుని ప్రతో ఫ్రేమ్ ను అందంగా కనిపించేలా చేశాడు.

లియోన్ జేమ్స్ సంగీతం తెలుగు పాటలకు అంతగా సింక్ అయినట్టు అనిపించలేదు. టిఎస్ సురేష్ ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. నిర్మాతలు సినిమాకి పెట్టిన ఖర్చు క్యాస్టింగ్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ రూపంలో ఘనంగానే కనిపించింది.

తీర్పు:

‘ఎంతవరకు ఈ ప్రేమ’ చిత్రం ఎంటర్టైన్మెంట్ ప్రధాన బలంగా రూపొందిన రొమాంటిక్ సినిమా. ఇందులో మంచి హాస్యం, బిన్నంగా ఉండే జీవ పాత్ర, ఎన్నడూ లేనంత అందంగా కనిపించే కాజల్ అగర్వాల్, ఫన్నీగా సాగిపోయే ఫస్టాఫ్ మెప్పించే అంశాలు కాగా ఫన్ మిస్సైన సెకండాఫ్, హీరో హీరోయిన్ల్ మధ్య సరిగా పండని రొమాన్స్, మంచి నటుడు బాబీ సిన్హాను ఊరికే వదిలేయడం, లాజిక్ లేని కొన్ని అనవసరమైన సీన్లు, హడావుడిగా ముగిసిన క్లైమాక్స్ బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే యూత్ ను ఆకట్టుకునే ఈ చిత్రంలో రొమాన్స్ తగ్గింది కానీ ఫన్ దొరికింది.

123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team

Exit mobile version