విడుదల తేదీ : ఏప్రిల్ 14, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : పి. వాసు
నిర్మాత : రమేష్ పి. పిళ్ళై
సంగీతం : ఎస్.ఎస్. థమన్
నటీనటులు : రాఘవ లారెన్స్, రితికా సింగ్
‘ముని, కాంచన’ వంటి హర్రర్ చిత్రాలతో తెలుగు వారికి సైతం బాగా దగ్గరైన నటుడు రాఘవా లారెన్స్ ఈసారి కూడా అదే హర్రర్ కంటెంట్ ని నమ్ముకుని చేసిన సినిమా ‘శివలింగ’. పి. వాసు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొదటి నుండి మంచి ప్రమోషన్లతో క్రేజ్ ను సొంత చేసుకుని ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా అలరించింది ఇప్పుడు చూద్దాం…
కథ :
సిబిసిఐడి ఆఫీసర్ గా పనిచేసే శివలింగేశ్వర్ (లారెన్స్) కు తన పై అధికారులు ఒక మిస్టరీ హత్య కేసును సాల్వ్ చెయ్యమని అప్పగిస్తారు. శివలింగేశ్వరన్ ఆ ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే అతనికి ఇంట్లో వాళ్ళు సత్యభామ (రితికా సింగ్) అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు. అలా శివలింగేశ్వరన్ ఒకవైఫు భార్యతో సంతోషంగా, ఇంకో వైపు హత్య కేసుతో బిజీగా ఉన్న సమయంలోనే అతని భార్య సత్యభామను ఒక ఆత్మ ఆవహిస్తుంది.
ఆ ఆత్మ ఎవరు ? అది సత్యభామను ఎందుకు ఆవహించింది ? శివలింగేశ్వరన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆ మర్డర్ కేసు ఎవరిది ? ఆ కేసుకు, శివలింగేశ్వరన్ భార్యకు, ఆమెను ఆవహించిన ఆ ఆత్మకు మధ్య లింకేంటి ? అందులో నిందితులు ఎవరు ? శివలింగేశ్వరన్ ఆ కేసును ఎలా పరిష్కరించాడు ? తన భార్యను ఆ ఆత్మ నుండి ఎలా కాపాడుకున్నాడు ? అనేదే ఈ సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాకి ప్రధాన బలం అంటే హర్రర్ కంటెంట్ తో కూడిన కాస్త కొత్తదనమున్న కథ అనే చెప్పాలి. సినిమా ఆరంభంలోనే దర్శకుడు పి. వాసు ఒక చిక్కు ప్రశ్నను ప్రేక్షకుల మీదికి వదిలి దాన్ని చివరి దాకా రివీల్ చేయకుండా దాని ఆధారంగానే సినిమా మొత్తాన్ని నడపడం బాగుంది. హీరో లారెన్స్ ఆ చిక్కు ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి చేసే ఇన్వెస్టిగేటివ్ ప్రయత్నాలు, వాటి తాలూకు సన్నివేశాలు ఆసక్తికరంగా బాగున్నాయి.
ఇక ఫస్టాఫ్ మధ్య నుండి మొదలయ్యే ఆత్మ తాలూకు సన్నివేశాలు హర్రర్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ ను కలిగించాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్ లో, సెకండాఫ్ లో మధ్యలో వచ్చే ఆత్మ తాలూకు సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఆ సన్నివేశాల్లో హీరోయిన్ రితికా సింగ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగానే సాగినా సెకండాఫ్లో స్క్రీన్ ప్లే ఊపందుకుని ఎప్పుడెప్పుడు అసలు నిజం బయటపడుతుందా, ఆ నిజం ఏమిటి అనే ఉత్సుకతను కలిగించింది.
ఇక పోలీస్ ఆఫీసర్ గా రాఘవా లారెన్స్ నటన, పాటల్లో తాను చేసిన డాన్స్ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన వడివేలు చేసిన కామెడీ అక్కడక్కడా బాగానే నవ్వించింది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హర్రర్ సన్నివేశాలకు చాలా బాగా కుదిరి సినిమాకు సహాయపడింది. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఇన్వెస్టిగేషన్ తాలూకు సీన్ ను కూడా మంచి స్క్రీన్ ప్లేతో బాగానే ఎగ్జిక్యూట్ చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఫస్టాఫ్ ఆరంభం అవసరం లేనంత నెమ్మదిగా సాగడం కాస్త నీరసాన్ని తెప్పిస్తే ఫస్టాఫ్ సగానికి గాని హర్రర్ కంటెంట్ మొదలుకాకపోవడం నిరుత్సాహానికి గురిచేసింది. సాధారణంగా హర్రర్ సినిమాలో లారెన్స్ అమ్మ పాత్రంటే కోవే సరళ, ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, కామెడీ టచ్ గుర్తొస్తాయి. ఆమె పాత్ర నుండే ప్రేక్షకులు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను ఆశిస్తారు. కానీ ఈ సినిమాలో లారెన్స్ అమ్మ పాత్రలో నటించిన ఊర్వశి అక్కడక్కడా పర్వాలేదనిపించినా చాలా వరకు నిరుత్సాహపరిచింది. ఆమె పాత్ర ద్వారా కోరినంత ఫన్ లభించలేదు. ఇక డబ్బింగ్ పాటల తెలుగు లిరిక్స్ ఏమాత్రం విదగినవిగా లేవు.
మొదటి నుండి దర్శకుడు నడిపిన సస్పెన్స్ చూసి సినిమాకి కీలక అంశమైన మర్డర్ మిస్టరీలోని నిజం చాలా బలంగా, ఆసక్తికరంగా ఉంటుందని ఆశిస్తే అదేమంత గొప్పగా లేకపోవడం అప్పటి వరకు ఉన్న ఉత్సుకతను కాస్తంత దెబ్బ తీసింది. సెకండాఫ్లో వడివేలు, లారెన్స్ మధ్య వచ్చే కొన్ని సీన్లు అనవసరమనిపించాయి. ఈ సినిమాలోని హర్రర్ సన్నివేశాలు కొన్ని బాగున్నా కూడా లారెన్స్ గత సినిమాలోని సబ్నివేశాలతో పోలిస్తే వీక్ గా అనిపించాయి. ప్రేక్షకుడు అదిరిపడేంత తీవ్రత ఉన్న సన్నివేశాలు, ఎఫెక్ట్స్ పెద్దగా దొరకలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు పి. వాసు రాసుకున్న కథ, కథనాలు అక్కడక్కడా కాస్త వీక్ గా ఉన్నా కొంచెం కొత్తగానే అనిపిస్తూ మొత్తం మీద పర్వాలేదనిపించాయి. అలాగే ఆయన రూపొందించిన హర్రర్ కంటెంట్ ఇంకాస్త ఎక్కువగా, బలంగా ఉండి ఉంటే బాగుండేది. సర్వేశ్ మురారి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు అదనపు బలాన్నివ్వగా పాటల్లోని సంగీతం అంతగా మెప్పించలేదు. సురేష్ ఎడిటింగ్ బాగానే ఉంది. క్లైమాక్స్ సీన్లో కంపోజ్ చేయబడ్డ ఫైట్ సీన్ ఆకట్టుకుంది.చిత్ర నిర్మాత రమేష్ పి. పిళ్ళై పాటించిన నిర్మాణ విలువలు చిత్ర స్థాయిని పెంచేవిగా ఉన్నాయి.
తీర్పు:
రాఘవా లారెన్స్ హర్రర్ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకుల్లో తనకున్న క్రేజ్ ను ఈ చిత్రంతో మొత్తంగా కాకపోయినా చాలా వరకు నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. కొంచెం కొత్తదనమున్న కథ, ఆసక్తికరంగా సాగే ఇన్వెస్టిగేటివ్ స్క్రీన్ ప్లే, కొన్ని హర్రర్ సన్నివేశాలు, రితికా, లారెన్స్ ల పెర్ఫార్మెన్స్, చివరిదాకా దర్శకుడు సస్పెన్స్ ను మైంటైన్ చేసిన విధానం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా తక్కువైన హర్రర్ కంటెంట్, పెద్దగా కనిపించని సడన్ ఎఫెక్ట్స్, నిరుత్సాపరిచిన హీరో తల్లి పాత్ర, కాస్త తేలిగ్గా ఉన్న కథలోని కీ పాయింట్, పాటలు బలహీనతలుగా నిలిచాయి. మొత్తం మీద చెప్పాలంటే హర్రర్, పోలీస్ ఇన్వెస్టిగేటివ్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team