విడుదల తేదీ : మే 26, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : నరేష్ పెంట
నిర్మాత : కె.ఎస్.రావు
సంగీతం : నరేష్ పెంట
నటీనటులు : శేఖర్ వర్మ, దీప్తి శెట్టి
నూతన హీరో హీరోయిన్లు శేఖర్ వర్మ, దీప్తి శెట్టిలు జంటగా కొత్త దర్శకుడు నరేష్ పెంట రూపొందించిన చిత్రమే ఈ ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’. డైరెక్టర్ నరేష్ పెంట మొదటి ప్రయత్నంలో అందరిలా ప్రేమ కథల జోలికి పోకుండా కాస్త భిన్నంగా కుటుంబ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ చిత్రం ఈరొజే విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…
కథ :
పల్లెటూరిలో పెరిగిన అమ్మాయి నందు (దీప్తి శెట్టి) బ్యాక్ డోర్లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలని హైదరాబాద్ కు వచ్చి గౌతమ్ (శేఖర్ వర్మ) అనే కన్సల్టెంట్ ను కలిసి డబ్బు కడుతుంది. కానీ శేఖర్ వర్మ మాత్రం ఆమెను మోసం చేసి కనిపించకుండా పోతాడు. దీప్తి కూడా అతన్ని వెతికి వెతికి లాభం లేక ఊరికి బయలుదేరుతుంది.
అలా తన ఊరికని బస్సెక్కిన ఆమెకు అనుకోకుండా గౌతమ్ కనిపిస్తాడు. దాంతో ఆమె కోపంతో అతన్ని కట్టేసి తీసుకెళ్లి ఊరిలోని తన నాన్నకు అప్పగిస్తుంది. అలా ఒక మోసగాడిలా నందు ఇంటికి చేరుకున్న గౌతమ్ ను అక్కడి వాళ్ళు ఎలా ట్రీట్ చేశారు ? వారి నుండి గౌతమ్ కు ఎదురైన అనుభవాలేంటి ? అసలు గౌతమ్ నందును ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ? చివరికి వారిద్దరి జీవితం మలుపు తీసుకుంది ? అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలోని ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ముందుగా చెప్పుకొవాల్సింది పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో, కుటుంబ విలువల నైపథ్యంలో తెరకెక్కిన కథను గురించి. ఎప్పుడైతే హీరో గౌతమ్ హీరోయిన్ దీప్తి ఇంటికి వెళతాడో అక్కడ నుండి మొదలయ్యే ఫ్యామిలీ డ్రామా కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. అందులోను హీరోయిన్ తండ్రి రావుగారు (మధుసూదన్ రావ్) పాత్రను డిజైన్ చేసిన తీరు చాలా బాగుంది. ఆ పాత్రలో అతని నటన కూడా మెప్పించింది. గోదావరి జిల్లాల్లోని మనుషులు ఎంత ఆప్యాయతగా ఉంటారు, వాళ్ళ ఆతిధ్యం ఏ రీతిలో ఉంటుంది అనే అంశాల్ని క్షుణ్ణంగా చెప్పాడు దర్శకుడు. గడుసైన పల్లెటూరి అమ్మాయిలా దీప్తి శెట్టి తన లుక్స్ తో ఆకట్టుకుంది.
అలాగే ఎక్కువ భాగం గ్రామాల్లోనే రూపొందటం వలన సినిమా మొత్తం పచ్చదనంతో, పల్లెటూరి వాతావరణంతో చూడటానికి ఆహ్లాదకరంగా అనిపించింది. ఈ క్రెడిట్ మొత్తం లొకేషన్లను అంత అందంగా చూపించిన సినిమాటోగ్రఫర్ కూనపరెడ్డి జయకృష్ణకే దక్కుతుంది. ఇక హీరో, హీరోయిన్ కుటుంబానికి దగ్గరవడం, హీరోయిన్ అతన్ని ఇష్టపడటం, ఎలాంటి అనుబంధాలు లేని హీరో రావుగారు తన పట్ల చూపించిన అభిమానం కోసం తన ప్రేమను సైతం త్యాగం చేయాలనుకోవడం వంటి ఎపిసోడ్లను బాగానే హ్యాండిల్ చేశాడు దర్శకుడు. ఇక సినిమాకి అత్యంత కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్లో దర్శకుడు చెప్పాలనుకున్న కుటుంబ బంధాల తాలూకు అసలు పాయింట్ ఎమోషనల్ గా టచ్ చేసింది. సినిమా మధ్యలో వచ్చే రెండు పాటలు కూడా బాగున్నాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు నరేష్ పెంట గోదావరి జిల్లాల్లోని ప్రజల మధ్య నెలకొని ఉండే సంబంధ బాంధవ్యాలను, అక్కడి మనుషుల మంచితనాన్ని ఎలివేట్ చేయడం కోసం సినిమా రన్ టైంలోని ఎక్కువ భాగాన్ని ఉపయోగించుకోవడంతో సినిమా చాలాసేపు ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న భావన కలిగింది. పైగా హీరో, హీరోయిన్ తండ్రి మధ్య నడిచే సన్నివేశాలు పదే పదే రిపీట్ అవుతున్నట్టు అనిపించి బోర్ కొట్టించాయి. హీరోయిన్ ఊరిలో ఉండే ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ తో కామెడీ పండించాలని దర్శకుడు చేసిన ప్రయత్నం ఫలించకపోగా బోర్ కొట్టించింది కూడ. వారి స్థానంలో ఎవరైనా తెలిసిన కమెడియన్లని పెట్టి హాస్యం పండించే ప్రయత్నం చేసుంటే ఎంటర్టైన్మెంట్ దొరికే చాన్సుండేది.
అలాగే హీరో మంచితన్నాని రివీల్ చేసే ముఖ్యమైన ఎపిసోడ్ కూడా మరీ నాటకీయంగా ఉంది. కథానాయకుడి పాత్ర ఎంతసేపటికి పరిస్థితులకు తలొగ్గి వెళిపోతుందే తప్ప ఎక్కడా ఎదురుతిరిగి పోరాడే తత్త్వం అందులో కనిపించలేదు. సినిమా ఆద్యంతం అతను ఏదో పోగొట్టుకున్న వాడిలా, తీవ్ర నిర్వేదంలో కనిపిస్తుంటే కాస్తంత నిరాశక్తి కలిగింది. ఇక సినిమా క్లైమాక్స్ లో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింటైతే బాగుంది కానీ దాన్ని తెరకెక్కించిన తీరే బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి పరిస్థితులన్నీ హీరోకు అనుకూలంగా మారిపోవడంతో సినిమాను హడావుడిగా ముగించేసినట్టు అనిపించింది. ఇక ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ అనే వైవిధ్యమైన టైటిల్ కు కూడా సినిమాలో ఎక్కడా జస్టిఫికేషన్ జరగలేదు.
సాంకేతిక విభాగం :
దర్శకుడు, రచయిత, సంగీత సారథి అయిన నరేష్ పెంట ఈ మూడు విభాగాల్లోను సగం వరకే మెప్పించగలిగాడు. రచయితగా మంచి కుటుంబ విలువలున్న అంశాన్ని ఎంచుకున్న ఆయన దానికి బలంగా ఆకట్టుకునే కథనాన్ని రాసుకోలేకపోయాడు. ఇక దర్శకుడిగా కొన్ని సన్నివేశాల చిత్రీకరణను బాగానే చేసిన కీలకమైన క్లైమాక్స్ ఎపిసోడ్ వంటి వాటిని బలహీనంగా రూపొందించారు.
అలాగే సంగీత దర్శకుడిగా కూడా రెండు పాటలకు మాత్రమే వినదగిన సంగీతం అందించారాయన. కూనపరెడ్డి జయకృష్ణ సినిమాటోగ్రఫీ అందంగా ఉండి ఆకట్టుకుంది. ఎడిటింగ్ విభాగాము ఇంకొన్ని రిపీటెడ్ సన్నివేశాల్ని ట్రిమ్ చేసుండాల్సింది. కె.ఎస్.రావు నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కుటుంబ విలువలున్న కథను ఎంచుకుని నరేష్ పెంట చేసిన ప్రయత్నం పూర్తిగా కాకపోయి పర్వాలేదు మంచి ప్రయత్నమే అనే స్థాయిలో వర్కవుట్ అయింది. ఎమోషనల్ గా టచ్ చేసే ఫ్యామిలీ డ్రామా, అందంగా ఉందనిపించే చిత్రీకరణ, సినిమా పూర్తయ్యాక కూడా గుర్తుండిపోయే హీరోయిన్ తండ్రి రావుగారి పాత్ర ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా పదే పదే రిపీట్ అవుతున్నట్టు అనిపించే సీన్లు, హాస్యం లోపించడం, కీలక సన్నివేశాల్ని బలహీనంగా తీయడం వంటివి నిరుత్సాహపరిచే విషయాలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ ‘శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట’ చిత్రం ఇలా వచ్చి అలా వెళ్లిపోయే రొటీన్ చిన్న సినిమాలా కాకుండా కాస్త దృష్టిలో పెట్టుకోదగిన, పల్లెటూరి ఆత్మీయతను కొంచెం పరిచయం చేసిన సినిమాగా ఉందని చెప్పొచ్చు.
123telugu.com Rating : 2.75/5
Reviewed by 123telugu Team