సమీక్ష : రాజా మీరు కేక – మంచి అవకాశం వృథా అయింది

Raja Meeru Keka movie review

విడుదల తేదీ : జూన్ 16, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : కృష్ణ కిశోర్

నిర్మాత : ఎమ్. రాజ్ కుమార్

సంగీతం : శ్రీ చరణ్

నటీనటులు : తారక రత్న, లాస్య, నోయెల్ సేన్, రేవంత్

‘గుంటూరు టాకీస్’ సినిమా తర్వాత ఆర్.కే స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన రెండో చిత్రం ‘రాజా మీరు కేక’. అయితే ఈ సారి ఆ సంస్థ నుంచి వచ్చిన ఈ చిత్రం మొదటి సినిమా తరహలో కాకుండా కాస్తా సామాజిక కోణంలో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి విషయాన్ని కాస్త వినోదాత్మకంగా చెప్పాలని ప్రయత్నం చేశారు. కొత్త దర్శకుడు కృష్ణ కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

రవి(రేవంత్), శ్వేత(లాస్య) మధ్యతరగతి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. వాళ్ళు నాగరాజు(తారకరత్న) యొక్క ట్రూటెక్ సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ వుంటారు. వాళ్లకి ఎంబిఏ పూర్తి చేసి ఎప్పటికైనా మిలీనియర్ అవ్వాలని ఆలోచనతో వుండే శశాంక్(నోయల్), కోటీశ్వరుడైన శ్రీను(ఆర్జే హేమంత్) ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ నలుగురు జీవితాలు చాలా హ్యాపీగా వెళ్ళిపోతున్న టైంలో నాగరాజు(తారక్) స్వార్ధంతో కంపెనీ ఒక్కసారిగా నష్టాల్లో కూరుకుపోతుంది. దాంతో ఒక్కసారిగా ట్రూటెక్ బోర్డు మెంబర్స్ రాజీనామా చేయడంతో కంపెనీ మొత్తం దివాలా తీసి అంతా మూతబడుతుంది.

దాంతో ట్రూటెక్ లో ఉద్యోగాలు చేసే వేల మంది రోడ్డున పడతారు. వారిలో రవి, శ్వేత కూడా ఉంటారు. షేర్ మార్కెట్ లో డబ్బులు వస్తాయనే ఆశతో ట్రూటెక్ షేర్స్ మీద 10 లక్షలు పెట్టుబడి పెట్టిన శశాంక్, శ్రీనుల సొమ్ము మొత్తం పోతుంది. దీంతో ఒక్కసారి అందరు సమస్యల్లో చిక్కుకుంటారు. అలా తమ జీవితాలు రోడ్డున పడటానికి కారణం అయిన నాగరాజు మీద ఆ నలుగురు ఎలా పగ తీర్చుకున్నారు? ట్రూటెక్ కంపెనీ వెనుక ఉన్న స్కామ్ ని ఎలా బయట పెట్టారు? ఆ స్కామ్ ఏమిటి ? అనేది ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాకి ప్రధాన బలం అంటే ముందుగా చెప్పుకోవాల్సింది దర్శకుడు ఎంచుకున్న కథ. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కుదుపు కుదిపేసిన సత్యం కంప్యూటర్స్ స్కామ్ ని ప్రధాన ఇతివృత్తంగా ఎంచుకొని అసలు ఆ స్కామ్ వెనుక ఏం జరిగి ఉండొచ్చు అనే విషయాన్ని దర్శకుడు తన కోణంలో చెప్పాలనుకున్న విషయం నిజంగా అభినందనీయం.

అలాగే నటీనటులుగా చేసిన రేవంత్, లాస్య, నోయల్, ఆర్జే హేమంత్, తారకరత్న ఉన్నంతలో కథకి ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. హీరోయిన్ సరయు తన లుక్స్ తో ఆకట్టుకుంది. అలాగే అక్కడక్కడ మధ్యతరగతి జీవితాలని పరిచయం చేస్తూ రాసిన సంభాషణలు కొంచెం ఆకట్టుకున్నాయి. అలాగే దర్శకుడు ఒక సామాజిక అంశాన్ని తీసుకుని దాన్ని వినోదాత్మకంగా చెప్పాలనుకున్న విధానం కొంత వరకు మెప్పిస్తుంది.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే ముందుగా చెప్పుకోవాల్సింది కథనం. దర్శకుడు ఎంచుకున్న విషయం బాగానే ఉన్నా చెప్పడం కోసం అల్లుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే చూసేవారి సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉన్నాయి. అసలు ఎ సీన్ ఎందుకు వస్తుందో, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియకుండా నడుస్తూ ఉంటుంది. అలాగే పాత్రల మధ్య వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు, పాత చింతకాయ పచ్చడి లాంటి తండ్రి కొడుకుల గొడవలతో వినోదం కాస్తా వికటించి విసిగించింది.

ఇక సినిమాలో దర్శకుడు ఎంచుకున్న కథ మంచిదే అయిన దానిని తెరకెక్కించే విధానంలో అడుగడుగునా తడబాటు కనిపిస్తుంది. ఏదో ఉన్న బడ్జెట్ లో సినిమా చుట్టేయాలనే ఆలోచనతో అసలు గొప్పగా చూపించాల్సిన సన్నివేశాలు కూడా పస లేకుండా చేసేశారు. చివరికి దర్శకుడు తాను ఎంచుకున్న కథతో చెప్పాలనుకున్న పాయింట్ ను కాస్త వదిలేసి ఇంకేదో చెప్పి, దాన్ని ఎలా ముగించాలో తెలియక అసందర్భంగా ముగించేసిన ఫీలింగ్ కలుగింది. ఇక సినిమాలో పోసాని కృష్ణ మురళీ, పృద్వీ, నల్ల వేణు వంటి మంచి నటుల్ని పెట్టుకొని కూడా వారిని దర్శకుడు వాళ్ళను సరిగా ఉపయోగించుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే సినిమాలో అడుగడుగునా లోపాలు కనిపిస్తాయి.

సాంకేతిక విభాగం:

‘గుంటూరు టాకీస్’ సినిమా తీసిన ఆర్కే స్టూడియోస్ ప్రొడక్షన్ వేల్యూస్ చాలా తక్కువగా కనిపిస్తాయి. కాస్త ఖర్చు పెట్టాల్సిన సన్నివేశాలని కూడా బడ్జెట్ పరిమితుల వలన దర్శకుడు ఏదోలా తీసేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక దర్శకుడు కథ రచయితగా ఒకే అనిపించుకున్న స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంభాషణల విషయంలో పూర్తిగా విఫలం అయ్యాడనే చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ రామ్.పి.రెడ్డి కెమెరా పనితనం చాలా వీక్ గా కనిపించింది. కెమెరా పనితనం చాలా సాదాసీదాగా ఓ లఘుచిత్రం స్థాయిలో ఉంది. శ్రీ చరణ్ అందించిన సంగీతం పాటల వరకు ఓకే అనిపించుకున్న, కథని నడిపించే నేపధ్యం సంగీతంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఇక ఏ.వి. ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఉపయోగపడే స్థాయిలో లేదు.

తీర్పు:

చివరిగా కొత్త దర్శకుడు కృష్ణ కిషోర్ ఒక మంచి కథని ఎంచుకొని దానిని అనుకున్న దారిలో నడిపించలేక మంచి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. హేమంత్ పెర్ఫార్మెన్స్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు మినహా ఇతర అనవసరమైన సీన్లు, అర్ధం లేని కామెడీ, అవసరానికి మించి ఎమోషన్స్ తో కథనాన్ని తయారుచేసిన ఆయన సినిమాను పూర్తిగా పక్కదారి పట్టించి, చెప్పాలనుకున్న విషయాన్ని సరిగా చెప్పలేక సగంలోనే ముగించేసి ఈ ‘రాజా మీరు కేక’ ఒక మంచి అవకాశం వృధా అయింది వృథా అయింది అనేలా ఉంది.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version