సమీక్ష : మామ్ – నెమ్మదిగా ఉన్నా ఎమోషన్ ఉంది

Mom movie review

విడుదల తేదీ : జూలై 7, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : రవి ఉద్యావర్

నిర్మాత : బోనీ కపూర్

సంగీతం : ఏ.ఆర్ రెహమాన్

నటీనటులు : శ్రీదేని, సజల్ అలీ, అక్షయ్ ఖన్నా, నవాజుద్దీన్ సిద్ధికి


స్టార్ నటి శ్రీదేవి చాలా కాలం తర్వాత చేసిన సినిమా ‘మామ్’. హిందీతో పాటు తెలుగులో కూడా ఈరోజే విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

స్కూల్లో టీచర్ గా పనిచేసే దేవకీ (శ్రీదేవి) తన భర్త, ఇద్దరు కూతుళ్లతో మంచి జీవితం గడుపుతుంటుంది. కానీ భర్త యొక్క మొదటి భార్య కుమార్తె ఆర్య (సజల్ అలీ) మాత్రం దేవకిని తల్లిగా ఒప్పుకోదు. కానీ దేవకి మాత్రం ఆర్యకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటుంది.

అలాంటి సమయంలోనే ఆర్యను కొందరు దుండగులు అత్యాచారం చేస్తారు. కోర్టు సరైన ఆధారాలు లేనందున నేరస్తుల్ని నిర్దోషులని తీర్పు చెబుతుంది. దీంతో పోలీసుల మీద, చట్టం మీద నమ్మకం కోల్పోయిన దేవకి నేరస్తుల మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఆ పగను ఆమె ఎలా తీర్చుకుంది అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ శ్రీదేవి. ఆరంభం నుండి చివరి దాకా ఆమె పాత్ర చుట్టూనే సినిమా నడుస్తుంది. బిడ్డకు దగ్గరవ్వాలని తపనపడే తల్లిగా, కూతురు సత్యాచారానికి గురైందని కుమిలిపోయే తల్లిగా, కూతురి కష్టానికి కారణమైన వాళ్ళపై పగ తీర్చుకోవాలనుకునే తల్లిగా ఆమె నటన అద్భుతం. కుమార్తె అత్యాచారానికి గురైందని వినే సన్నివేశంలో, క్లైమాక్స్ ఆమె పలికించిన ఎమోషన్స్ ప్రేక్షకుల్ని కదిలిస్తాయి.

నేషనల్ అవార్డు విన్నర్ నవాజుద్దీన్ సిద్దికీ తన ప్రత్యేకమైన పాత్రలో మెప్పించాడు. ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాల్లో ఆయన నటన కాస్త కామెడీని పండిస్తూనే సినిమాకు డెప్త్ ను తీసుకొచ్చింది. ఇక ఏ.ఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ముఖ్యమైన సన్నివేశాలను మరింత ప్రభావవంతంగా తయారు చేసింది.

ఫస్టాఫ్ సింపుల్ ఎమోషన్స్ తో, క్రైమ్, కోర్ట్ సన్నివేశాలతో సాగిపోగా, సెకాండాఫ్లోని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కొత్త కథంటూ ఏం ఉండదు. తన కూతురికి కష్టం కలిగించిన వారిపై పగ తీర్చుకునే తల్లి కథే ఇది. దీంతో సినిమా మొదలైన దగ్గర్నుండి తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఇట్టే అర్థమైపోతుండటం వలన అవి ఎలా జరుగుతాయో మాత్రమే చూడాల్సి వచ్చింది. అంతేగాక కథనం కూడా నెమ్మదిగా సాగిపోతూ ఉండటం కొంచెం బోరింగా అనిపిస్తుంది.

పోలీసులు ఆధారాల్ని కోల్పోవడం, చిన్న చిన్న లాజిక్స్ ను మిస్సవడం వంటివి కనిపించాయి. ప్రీ క్లైమాక్స్ వరకు బాగానే సాగిన సినిమా ఉన్నట్టుండి ముగింపులో రొటీన్ గా మారిపోయి మరీ నాటకీయంగా తోచింది. శ్రీదేవి పెద్ద పెద్ద నేరాల నుండి బయటపడటం కూడా సరిగా చూపించలేదు.

సాంకేతిక విభాగం :

బోనీ కపూర్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. తక్కువ బడ్జెట్లోనే తీసినా కూడా విజువల్స్ అన్నీ ఖరీదుగా కనబడ్డాయి. ఇక రెహమాన్ సంగీతం సినిమాకు చాలా తోడ్పడింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక సన్నివేశాల్లోని డెప్త్ ను పెంచింది.

ఇక దర్శకుడు రవి ఉద్యావర్ విషయానికొస్తే ఒక సాధారణమైన కథకు మంచి స్క్రీన్ ప్లే, ఎమోషన్ ను అద్ది తన దర్శకత్వ ప్రతిభతో ఆయన చేసిన ప్రయత్నం బాగుంది. ఎడిటింగ్ బాగానే ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ కూడా మెప్పించింది.

తీర్పు :

రివెంజ్ డ్రామా అనే ఫార్మాట్ పాతదే అయినా అందులో ఒక తల్లిని ఇన్వాల్ చేస్తూ చేసిన ఈ సినిమా ఎమోషనల్ గా కనెక్టయ్యే సినిమా. శ్రీదేవి, నవాజుద్దీన్ సిద్దికీ వంటి నటీ నటులు ఉండటం, ఏఆర్. రెహమాన్ సంగీతం, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు, ఫస్టాఫ్లోని ఎమోషన్ ఈ చిత్రంలో అలరించే అంశాలు కాగా రెగ్యులర్ ఎంటెర్టైనమెంట్ లేకపోవడం, క్లైమాక్స్ రొటీన్ గా మారిపోవడం నిరుత్సాహపరిచే అంశాలు. మొత్తం మీద చెప్పాలంటే రివెంజ్ డ్రామాలను, అందులోను ఎమోషన్ తో కూడుకున్న వాటిని ఇష్టపడే వారికి ఈ చిత్రం ఒక చాయిస్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version