సమీక్ష : ప్రేమలో పడితే – యదార్ధ ప్రేమ గాధ

విడుదల తేది : 04 మే 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : బాలాజీ శక్తివేల్
నిర్మాతలు : సురేష్ కొండేటి
సంగీత దర్శకుడు: ప్రసన్న
తారాగణం : మిథున్, శ్రీ, ఊర్మిళ మహంత

ప్రేమిస్తే అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ దర్శకుడు బాలాజీ శక్తివేల్ ఈ సారి నూతన నటీనటులతో ‘ప్రేమలో పడితే’ అనే తమిళ్ డబ్బింగ్ సినిమాతో మన ముందుకు వచ్చారు. జర్నీ సినిమాతో విజయం అందుకున్న సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసారు. ప్రేక్షకుల తీర్పు కోరుతూ ఈ రోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:
‘ప్రేమలో పడితే’ అనే సినిమా రెండు జంటల కథ. వేణు (శ్రీ) ఒక అనాధ, చిన్నప్పుడే తల్లి తండ్రుల్ని కోల్పోవడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రోడ్ సైడ్ ఇడ్లీ బండి వద్ద పని చేస్తుంటాడు. అపార్టుమెంటులో పనిచేసే జ్యోతి (ఊర్మిళ మహంత) అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. జ్యోతి మాత్రం వేణుని ఇష్టపడదు. కొన్ని అనుకోని సంఘటనల వల్ల వేణుని అపార్ధం చేసుకొని చెడ్డవాడు అనే భావనలో ఉంటుంది. ఇదిలా ఉండగా మరోవైపు జ్యోతి పనిచేసే అపార్టుమెంటులో ఉండే ఆర్తి (మనీషా యాదవ్)ని అదే అపార్టుమెంటులో ధనవంతుల బిడ్డ అయిన రితేష్ (మిథున్ మురళి) ప్రేమించమంటూ వెంటపడతాడు. ఆమెకి సంభందించిన కొన్ని అసభ్యకరమైన వీడియోలు తీసి ఆర్తికి దొరికిపోతాడు. రితేష్ వేధింపులు తట్టుకోలేని ఆర్తి అతని మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో కోపం వచ్చిన రితేష్ ఆర్తి మీద యాసిడ్ పోయబోతాడు. అనుకోకుండా ఈ గొడవల్లో జ్యోతి, వేణు కూడా ఇరుక్కుంటారు. ఈ గొడవలతో వారికి సంభందం ఏమిటి? చివరికి ఈ నలుగురి గొడవ ఎలా ముగిసింది అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:
వేణు పాత్రలో నటించిన శ్రీ చాలా బాగా నటించాడు. తమిళ వీదుల్లో ఉండే అనాధ యువకుడిగా అతికినట్లు సరిపోయాడు. రితేష్ పాత్రలో మిథున్ మురళి పర్వాలేదనిపించాడు. ఆర్తిగా నటించిన మనీషా యాదవ్ ఆమె పాత్రకి సరైన న్యాయం చేసింది. జ్యోతిగా ఊర్మిళ మహంత కూడా అధ్బుతంగా నటించింది. నూతన నటీ నటులు కావడంతో దర్శకుడు వారి నుండి మంచి అభినయం రాబట్టుకున్నాడు. చిత్ర మొదటి భాగం కొంత నత్తనడకన సాగినప్పటికీ ఇంటర్వెల్ నుండి వేగం పుంజుకుంటుంది. ఈ చిత్ర కథ కూడా నిజ జీవిత కథను పోలి ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ప్రేమిస్తే చిత్ర స్థాయిలోనే రియలిస్టిక్ సన్నివేశాలు ఉండటంతో చూసే వారికి కూడా సినిమాలో పాత్రలు మాత్రమే కనిపిస్తాయి.

మైనస్ పాయింట్స్:
చిత్ర మొదటి భాగం మరీ నత్తనడకన సాగుతూ వేణు, జ్యోతిల మీదే దాదాపు మొదటి భాగం ఉండటంతో ప్రేక్షకులు కొంత అసహనానికి గురవుతారు. రెండవ భాగంలో చిత్రం మంచి కథనంతో సాగుతున్న సమయంలో ఐటెం సాంగ్ మరియు అందులో ఈ చిత్ర నిర్మాత సురేష్ కొండేటి వేసే డాన్సులు చిరాకు తెప్పిస్తాయి. ఈ పాట సినిమాలో తీసేసి ఉంటే బావుంటుంది. స్క్రీన్ప్లే కూడా నత్తనడకన సాగుతూ సహనాన్ని పరీక్షిస్తుంది. సినిమాలో కమర్షియల్ అంశాలు లేకపోవడం కేవలం ప్రేమికులను ఆకట్టుకునే ప్రయత్నం బాగా మైనస్ అయ్యాయి. అదేవిధంగా సినిమా అంతా తమిళ నేటివిటీతో ఉండటం తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకొని పరిస్థితి.

సాంకేతిక విభాగం :
ఈ సినిమా కోసం EOS 7D అనే ప్రత్యేకమైన కెమెరా వాడారు. విజయ్ మిల్టన్ సినిమాటోగ్రఫీ అధ్బుతంగా సాగుతూ రియలిస్టిక్ గా ఉంది. అర. ప్రసన్న అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయింది. చిత్ర మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలకు కత్తెర వేసి ఉంటే బావుండేది.

తీర్పు :
ఈ చిత్ర దర్శకుడు ముఖ్యంగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తీసాడు కాబట్టి ఆ వర్గాన్ని బాగా మెప్పించినప్పటికీ తెలుగులో రియలిస్టిక్ గా ఉండే కథలు కోరుకునే వారిని మాత్రమే మెప్పించగలిగాడు. కొంత మందిని మాత్రమే మెప్పించినప్పటికీ తమిళంలో అవార్డుల పంట పండిచడం మాత్రం ఖాయం.

123తెలుగు.కాం రేటింగ్ : 3/5

Clicke Here For ‘Prema Lo Padithe’ English Review

అనువాదం – అశోక్ రెడ్డి -ఎం

Exit mobile version