విడుదల తేది : 11 మే 2012 |
దర్శకుడు : హరీష్ శంకర్ |
నిర్మాత : బండ్ల గణేష్ |
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ |
తారాగణం : పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ , అభిమన్యు సింగ్ |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ మరియు ‘మిరపకాయ్’ హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ బాబు నిర్మించారు. ప్రేక్షకుల తీర్పును కోరుతూ వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
చిన్నతనంలో తండ్రి చనిపోవడంతో మారు తండ్రిగా వచ్చిన నాయుడు (నాగినీడు) పై ద్వేషం పెంచుకున్న వెంకట రత్నం నాయుడు (పవన్ కళ్యాణ్) తన తల్లి (సుహాసిని) మరియు కుటుంబాన్ని వదిలేసి చిన్నప్పుడే ఇంట్లో నుండి వెళ్ళిపోయి హాస్టల్లో చదువుకుంటూ పోలీసుగా ఎదుగుతాడు. వెంకటరత్నం పేరు ఇష్టం లేకపోవడం మరియు తన చిన్నతనంలో బాగా చూసిన ‘షోలే’ సినిమాలోని ‘గబ్బర్ సింగ్’ పాత్రకి ఆకర్షితుడు కావడం వల్ల తన పేరును కాస్తా గబ్బర్ సింగ్ అని మార్చుకుంటాడు. కొండవీడు పోలిస్ స్టేషన్ ని కాస్తా గబ్బర్ సింగ్ పోలిస్ స్టేషన్ గా మార్చుకుంటాడు. తన పోలిస్ స్టేషన్లో తను పెట్టిందే రూల్స్. భాగ్యలక్ష్మి (శృతి హాసన్) ని మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. కొన్ని సంఘ వ్యతిరేక పనులు చేస్తున్న సిద్ధప్ప నాయుడుని (అభిమన్యు సింగ్) గబ్బర్ సింగ్ అడ్డుకోవటంతో అతను గబ్బర్ సింగ్ మీద వైరం పెంచుకుంటాడు. కొన్ని సంఘటనల తరువాత వారి వైరం కాస్తా కుటుంబాల మధ్య తగాదాలకు దారి తీస్తుంది. చివరకు గబ్బర్ సింగ్ కుటుంబానికి ధగ్గరయ్యాడా? ప్రేమించిన భాగ్య లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడా? సిద్ధప్ప నాయుడుతో వైరం ఏమైంది వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే గబ్బర్ సింగ్ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
గబ్బర్ సింగ్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఎనర్జీ లెవల్స్ అధ్బుతం. ఇంట్రడక్షన్ సీన్ నుండి మొదలు పెడితే పోలిస్ స్టేషన్లో రౌడీలతో అంత్యాక్షరి వంటి సన్నివేశాల వరకు అధ్బుతంగా అలరించాడు. అభిమానులను ఆకట్టుకుంటూ చెప్పిన డైలాగ్స్ కేక పెట్టించడం ఖాయం. పోలిస్ పాత్రలో పదేళ్ళ కిందటి పవన్ కళ్యాణ్ మళ్లీ తిరిగి వచ్చాడు అనేంతలా అలరించాడు. సినిమా మొదట్లోనే హీరో ఒక డైలాగ్ కొడతాడు, నాకు రౌడీలంటేనే ఇష్టం అని ఎందుకంటే చెడు పనులు చేస్తూ హీరోలుగా చెలామణి అవుతున్న వారి ఆట కట్టించే పోలిస్ కాబట్టి తాను రౌడి పోలిస్ అంటాడు. ఇలా సినిమాలోని చాలా సన్నివేశాలకు తన ఎనర్జీతో ప్రాణం పోసాడు. పిల్లా, మందు బాబులం పాటల్లో డాన్సులు అదరగొట్టాడు. ఇక భాగ్యలక్ష్మి పాత్రలో శృతి హాసన్ పర్వాలేదనిపించింది. దిల్ సే, పిల్లా పాటల్లో అందంగా ఉంది. సిద్ధప్ప నాయుడుగా అభిమన్యు సింగ్ పర్వాలేదనిపించాడు. గబ్బర్ సింగ్ కి తగ్గ విలన్ అని నిరూపించుకోవడంలో పాస్ మార్కులు దక్కించుకున్నాడు. రికవరీ రంజిత్ కుమార్ పాత్రలో బ్రహ్మానందం బాగా నవ్వించాడు. ఫాలోయింగ్ ఉన్నోడికి కట్ అవుట్ చాలు అంటూ అలరించాడు. సాంబ పాత్రలో అలీ కూడా బాగానే నవ్వించాడు. చిత్ర మొదటి భాగంలో ప్రతి సన్నివేశం అలరిస్తూ సాగుతుంది. స్క్రిప్ట్ కూడా చాలా వేగంగా సాగుతూ బోర్ కొట్టకుండా మరీ ముఖ్యంగా అభిమానులను అలరించే డైలాగులు చెబుతూ ఆకట్టుకున్నారు. చిత్ర రెండవ భాగంలో కూడా అంత్యాక్షరి సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించాయి.
మైనస్ పాయింట్స్:
చిత్ర రెండవ భాగంలో చిత్ర వేగం మందగిస్తుంది. కోట శ్రీనివాసరావు పాత్ర మరియు అజయ్ పాత్రల్ని కథకు అనుగుణంగా వాడుకోవడంలో దర్శకుడు శ్రద్ధ వహిస్తే బావుండేది. సుహాసిని పాత్రని మరియు నాగినీడు పాత్రల్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు. ఈ చిత్ర ఒరిజినల్ వెర్షన్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణని తెలుగు వెర్షన్లో తనకు తగ్గట్లు మార్చుకోవడంలో దర్శకుడు పవన్ కళ్యాణ్ మీద దృష్టి పెట్టడంతో ఈ ఎపిసోడ్ సైడ్ ట్రాక్లో వెళ్ళింది. క్లైమాక్స్ సన్నివేశాలు కూడా బాగా తీసి ఉంటే ఇంకా బావుండేది. హారతి పాత్రలో గాయత్రి చేసిన చేష్టలు కూడా చిరాకు తెప్పిస్తాయి.
సాంకేతిక విభాగం:
దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో దేఖో దేఖో, దిల్ సే, పిల్లా పాటల చిత్రీకరణ చాలా బావున్నాయి. నేపధ్య సంగీతం కూడా బావుంది. జయనన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. హరీష్ శంకర్ రాసుకున్న డైలాగులు బావున్నాయి. అభిమానులను దృష్టిలో పెట్టుకుని రాసిన కొన్ని డైలాగులు చాలా బావున్నాయి. హరీష్ శంకర్ చిత్ర మొదటి భాగం మీద శ్రద్ధ రెండవ భాగం మీద ఇంకాస్త పెట్టి ఉంటే చాలా బావుండేది. నిర్మాత బండ్ల గణేష్ బాబు ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా తీసారు. హిట్ కొట్టాలన్న అయన తపన ఈ సినిమా రూపంలో నెరవేరింది.
గబ్బర్ సింగ్ సినిమాలోని కొన్ని డైలాగ్స్:
*విలన్ : ఎవడ్రా నువ్వు?
గబ్బర్ సింగ్ : పేర్లు గోత్రాలు చెప్పడానికి నేను ఏమైనా గుడి కొచ్చాను ఏంట్రా? తెలుసుకోవడాలు ఎముండవు .. తేల్చుకోవడాలే …
*విలన్ : కుక్కల్ని పెంచుకునేది అవతల వాళ్ళని కరవడానికి.. యజమానుల మీద అరవడానికి కాదు…
*నాక్కొంచెం తిక్కుంది.. కాని దానికో లెక్కుంది…
*గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటం అంటే పారిపోవటం కాదు పైకి పోవటం …
తీర్పు:
చిత్ర మొదటి భాగం ఎంటర్టైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ జోష్ హైలెట్ గా సాగుతూ రెండవ భాగంలో ఎమోషనల్ గా సాగే గబ్బర్ సింగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయం. సరదాగా కాలక్షేపం కోసం వెళ్ళిన సాధారణ ప్రేక్షకుడిని రెండున్నర గంటలు అలరించడంలో గబ్బర్ సింగ్ విజయం సాధించాడు.
123తెలుగు.కాం రేటింగ్ : గబ్బర్ సింగ్ చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. గబ్బర్ సింగ్ చిత్రం బావుంది చూసి ఎంజాయ్ చేయండి.
అశోక్ రెడ్డి -ఎం