విడుదల తేదీ : డిసెంబర్ 08, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : శ్రీను ఇమండి
నిర్మాత : ధన జమ్ము
సంగీతం : అజయ్ పట్నాయక్
నటీనటులు : నందు, శ్రీ ముఖి, అశ్విని
కథ:
‘బీటెక్ బాబులు’ సినిమా నలుగురు ఇంజినీరింగ్ విధ్యార్థుల కథ. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కథ ఉంటుంది. అలా ఈ నలుగురు లైఫ్ లో విడి విడిగా జరిగిన కొన్ని అనుభవాలతో సినిమా మొదలవుతుంది. అనుకోకుండా కలసిన నలుగురు స్నేహితులు వారి జీవితాల్లో ఏవిధంగా కష్టాలు పడ్డారు, చివరికి ఎలా విజయం సాధించారు ? అన్నది తెలుసుకోవాలంటే ఈ ‘బీటెక్ బాబులు’ చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో ప్రధానంగా శ్రీముఖి, నందులు చేసిన పాత్రలు బాగున్నాయి. వాళ్ళిద్దరి జంట స్క్రీన్ మీద బాగుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో వచ్చే వీరి తాలూకు సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. వారి మధ్య నడిచే లవ్ ట్రాక్ ను బాగా చూపించడం జరిగింది.
నలుగురు స్నేహితులు వాళ్ళ ప్రేయసిలు ఎవరి పాత్రల్లో వాళ్ళు బాగానే చేశారు. అలీ కనిపించేది కొద్దిసేపే అయినా ఆయన పాత్ర నవ్విస్తుంది. స్పూఫ్ లు చేసి అలరించాడు. నలుగురు స్నేహితుల్లో ఒకరైన షకలక శంకర్ కామెడీ టైమింగ్ తో పంచ్ డైలాగ్స్ వేసి మెప్పించాడు.
మైనస్ పాయింట్స్:
సినిమా కోసం డైరెక్టర్ ఎంచుకున్న కథ పాతగా ఉంది. కథనంలో కూడా కొత్తదనం లేకపోవడంతో సినిమా తేలిపోయింది. నలుగురు స్నేహితులు కలుసుకోవడం బావుంది కానీ వారి అలవాట్లు, వ్యసనాలు, పద్ధతులు, భాదలు రక్తికట్టించే విధంగా చూపించలేకపోయాడు డైరెక్టర్.
సినిమాలో సంగీతం కూడా గొప్పగా లేదు. పాటలు వినసొంపుగా లేకపోవడంతో కథకు అడ్డంకులుగా మారాయి. మంచి నటీనటులు ఉన్నా వారికి సరైన పాత్రలు, సన్నివేశాలు లేవు. ఫ్రెండ్స్ మద్య వచ్చే సీన్స్ చాలా సినిమాల్లో చూసిన వాటిలాగే రొటీన్ గా ఉండడంతో బోర్ కొట్టేస్తాయి. అసలు కథలోకి తాగుబోతు రమేష్ పాత్ర ఎందుకు వస్తుందో, ఎందుకు పోతుందో అస్సలు అర్థం కాదు.
సాంకేతిక వర్గం:
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అందించిన నేపధ్య సంగీతం బాగుంది. డైరెక్టర్ శ్రీను ఎంచుకున్న ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ రొటీన్ గా ఉండడంతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే. డైలాగ్స్ అక్కడక్కడ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.
సినిమా నిడివి తక్కువగా ఉండడంతో కాస్త మంచి విషయం. ఉన్న బడ్జెట్ లో డీసెంట్ గా తియ్యడంలో నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించిన రెండు సన్నివేశాలు బాగున్నాయి.
తీర్పు:
ఈ బీటెక్ బాబులది రెగ్యులర్ స్టోరినే. స్క్రీన్ ప్లే కూడా చాలా మూవీస్ లో చూసిన విధంగానే ఉండడంతో ఆడియన్స్ ఎంగేజ్ అవ్వకపోవచ్చు. కథ ఎంత పాతదైనా చూపించే విధానంలో కొత్తదనం ఉండి, సన్నివేశాలు బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. నిర్మాత మంచి బడ్జెట్ ఇచ్చినప్పుడు, మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్స్ ఉన్నప్పుడు శ్రద్ధ పెట్టి మంచి సీన్స్ రాసుకుంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ ఈ సినిమాలో అవేవి లేకపోవడంతో వినోదం కోసం ఈ సినిమా చూడ్డానికి వెళ్తే ప్రేక్షకులకు నిరాశ తప్పదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team