విడుదల తేది : 25 మే 2012 |
123తెలుగు.కాం రేటింగ్: 2.75/5 |
దర్శకుడు : జే.శివ కుమార్ |
నిర్మాత : బూరుగుపల్లి శివ రామ కృష్ణ |
సంగీత దర్శకుడు: విజయ్ అంటోనీ |
తారాగణం : రవి తేజ, తాప్సీ |
మాస్ మహారాజ రవితేజ మరియు తాప్సీ కాంబినేషన్లో శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘దరువు’. శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మ్నెట్స్ లిమిటెడ్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ అంటోనీ సంగీతం అందించారు. ఈ రోజే ప్రేక్షకుల తీర్పును వచ్చిన దరువు చిత్రం ఎలా ఉందొ చూద్దాం.
కథ :
బుల్లెట్ రాజా (రవితేజ) మరియు కాజా (వెన్నెల కిషోర్) డబ్బు కోసం ఎలాంటి పనైనా చేస్తుంటారు. శ్వేత (తాప్సీ) ని ఆమె బావ హార్బర్ బాబు (సుశాంత్ సింగ్) బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మొదటి చూపులోనే శ్వేతని చూసి ఇష్టపడిన బుల్లెట్ రాజా విద్యా బాలన్ (బ్రహ్మానందం) సహాయంతో ప్రేమలో పడేస్తాడు. ఇది తెలుసుకున్న హార్బర్ బాబు బుల్లెట్ రాజాని చంపేస్తాడు. చిత్ర గుప్తుడు (ఎమ్ఎస్ నారాయణ) చేసిన తప్పిదం వల్ల బుల్లెట్ రాజా ఆయుష్షు తీరకుండానే యమలోకానికి తీసుకు వచ్చామని యమ ధర్మరాజు (ప్రభు) గ్రహిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న బుల్లెట్ రాజా తనకు న్యాయం చేయాలని యమధర్మ రాజుతో గొడవ పడతాడు. ఈ సమయంలో యమ ధర్మరాజు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? బుల్లెట్ రాజాని తిరిగి భూలోకానికి పంపించడా? ఈ చిక్కుముడులన్నీ వీడాలంటే దరువు సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
బుల్లెట్ రాజా మరియు రవీంద్ర (హోం మినిస్టర్) రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ అలరించాడు. బుల్లెట్ రాజా పాత్రలో చిత్ర మొదటి భాగంలో విద్యా బాలన్ పాత్ర పోషించిన బ్రహ్మానందంతో కలిసి బాగానే నవ్వించాడు. ప్రజల కోసం పోరాడుతూ విలన్ల ఆట కట్టించే రవీంద్ర పాత్రలో కూడా బాగానే ఆకట్టుకున్నాడు. శ్వేతగా పాత్రలో తాప్సీ గ్లామర్ ఒలకబోసింది. ‘ఉసుమలరాసే’ పాటలో చేసిన స్కిన్ షో మాస్ అభిమానులని ఆకట్టుకుంటుంది. విద్యాబాలన్ పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించాడు. హార్బర్ బాబుగా నటించిన సుశాంత్ సింగ్ పర్వాలేదనిపించాడు. హోం మినిస్టర్ రవీంద్ర తల్లిగా సహజ నటి జయసుధ బాగా చేసింది. తల్లి కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు బావున్నాయి. పవిత్రానంద స్వామిగా రఘు బాబు, హోం మినిస్టర్ పిఎ పాత్రలో శ్రీనివాస రెడ్డి బాగా నవ్వించారు. రాజుల, ఉసుమలరాసే పాటలు అలరించాయి.
మైనస్ పాయింట్స్ :
శ్వేత పాత్రలో తాప్సీ అందాల ఆరబోత చేసినప్పటికీ ఆమె పాత్ర కేవలం పాటలు మరియు కొన్ని సన్నివేశాలకే పరిమితం అయింది. యమలోకం హైలెట్ ఊరించిన సన్నివేశాలు చప్పగా సాగాయి. గ్రాఫిక్స్ చాలా దారుణంగా ఉన్నాయి. యమలోకంలో వచ్చే సన్నివేశాల్లో మరియు బుల్లెట్ రాజా చనిపోయే సన్నివేశాల్లో సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఏ మాత్రం ఆకట్టుకోలేక పోగా సినిమా మీద ఆసక్తిని తగ్గించాయి. యమ ధర్మరాజుగా ప్రభు కూడా ఆకట్టుకోలేక పోయాడు. సీనియర్ నటుడు సత్య నారాయణ పాత్రని కూడా వృధా చేసారు. విలన్లుగా నటించిన షాయాజీ షిండే మరియు అవినాష్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు ఎల్బి శ్రీరామ్ వంటి వారిని కూడా సరిగా వాడుకోలేకపోయారు. చిత్ర మొదటి భాగం పెద్దగా ఆకట్టుకోలేపోయింది. నేపధ్య సంగీతం కూడా సినిమాకి ఏ మాత్రం సహాయపడలేదు.
సాంకేతిక విభాగం :
రమేష్ గోపి మరియు అనిల్ రాసిన కొన్ని డైలాగ్స్ బావున్నాయి. గౌతం రాజు ఎడిటింగ్ పర్వాలేదు.వెట్రి సినిమాటోగ్రఫీ కూడా పర్వాలేదు. శివ దర్శకత్వంలో కొత్తగా రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు.గతంలో యమలోకం నేపధ్యంగా వచ్చిన కొన్ని సినిమాల నుండి స్ఫూర్తి పొంది స్క్రిప్ట్ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది.
తీర్పు :
దరువు రొటీన్ రవితేజ మార్కు కామెడీ సినిమా. ఈ సినిమాలో కొత్తదనం ఏమీ ఆశించకుండా సరదాగా కాలక్షేపం కోసం అయితే చూడండి. దాదాపు సినిమా అంతా తన భుజాలపై నడిపించిన రవితేజ ఎనర్జీతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేసాడు.
123తెలుగు.కాం రేటింగ్ : 2.75/5
అశోక్ రెడ్డి -ఎం