విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
నటీనటులు : వరుణ్ తేజ్, రాశి ఖన్నా, సుహాసిని మణిరత్నం
దర్శకత్వం : వెంకి అట్లూరి
నిర్మాత : బి వి ఎస్ ఎన్ ప్రసాద్
సంగీతం : S. థమన్
సినిమాటోగ్రఫర్ : జార్జి సి. విలియమ్స్
ఎడిటర్ : నవీన్ నూలి
వైజాగ్ నుండి హైదరాబాద్ కు వెళ్లే సమయంలో ఆదిత్య (వరుణ్ తేజ్ )కు వర్ష (రాశీఖన్నా) పరిచయమవుతుంది. ఆదిత్య తొలిచూపులోనే ఆమెను ప్రేమిస్తాడు. కొన్నికారణాల వల్ల ఆది ఆమెను మిస్సవుతాడు. ఆ తరువాత అతను చదివే ఇంజనీరింగ్ కాలేజీలోనే వర్ష చేరడంతో మళ్ళీ వీరి ప్రేమ ప్రయాణం మొదలవుతుంది.
వర్ష కూడా ఆదిని ప్రేమిస్తుంది. కానీ కాలేజీలో జరిగిన ఒక సంఘటన వలన ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలై విడిపోతారు. ఆ బాధతో ఆది తనకిష్టమైన జీవితాన్ని వెతుక్కుంటూ లండన్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆరు సంవత్సరాల తర్వాత వర్ష ఆదికి కనిపిస్తుంది. అసలు ఆది, వర్ష ఎందుకు విడిపోయారు ? 6 ఏళ్ల తర్వాత కలిసిన వీరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఎలా ఒక్కటయ్యారు ? అనేదే కథ.
ప్లస్ పాయింట్స్ :
దర్శకుడు వెంకీ అట్లూరి రచయితగా పూర్తిస్థాయిలో సక్సెస్ కావడంతో తొలిప్రేమ అనే కాన్సెప్ట్ బాగా పండింది. ఈతరం యువతలో పుట్టే తొలిప్రేమ ఎలా ఉంటుంది, అది చిన్న చిన్న కారణాల వలన ఎందుకు బ్రేకవుతుంది, విడిపోయిన తర్వాత కూడా ప్రేమికులను ఆ తొలిప్రేమ ఎలా సలుపుతుంది అనే అంశాలని చాలా ఆసక్తికరంగా చూపించారాయన. వరుణ్ తేజ్, రాశీఖన్నాల సహజమైన నటన సినిమాను ప్రేక్షకుల్ని మరింత దగ్గరయ్యేలా చేసింది.
ముఖ్యంగా వయసు పెరిగి, ప్రేమ విలువ తెలిసే సమయంలో తొలిప్రేమను నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు పడే తపన, వరుణ్ తేజ్ పాత్రలో అతని ఈగోకి, ప్రేమకి మధ్యన జరిగే ఘర్షణ, వాటి తాలూకు సన్నివేశాలు ఇంప్రెస్ చేస్తాయి. సినిమా ఆరంభం నుండి చివరి వరకు వరుణ్, రాశీల మధ్యన కెమిస్ట్రీ గొప్పగా పండి ప్రేక్షకులకి వాళ్ళ తొలిప్రేమను తప్పక గుర్తుచేస్తుంది.
ఈ ప్రేమ కథకి తోడు ఫస్టాఫ్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్లో విద్యుల్లేఖ రామన్ కామెడీ ట్రాక్, సెకండాఫ్లో హైపర్ ఆది, ప్రియదర్శి, నరేష్ ల హాస్యం బాగానే పనిచేసి వినోదాన్ని అందించాయి. లండన్లో జరిగే ద్వితీయార్థం మొత్తం అందంగా, ఆకర్షణీయంగా ఉంది. ప్రేమ తాలూకు డైలాగులు, సందర్భానుసారంగా వచ్చే ప్రతి ఒక్క పాట, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని మరింతగా పెంచాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథలో కొత్తదనం పెద్దగా కనబడదు. కథనంలో తర్వాత ఏం జరుగుతుంది అనేది సులభంగానే ఊహించవచ్చు. చాలా ప్రేమ కథల్లానే ప్రేమికులు విడిపోవడం, అర్థం చేసుకుని తిరిగి కలుసుకోవడం వంటి ప్లాట్ చాలా సినిమాల్లో మనం చూసిందే.
ద్వితీయార్థంలో కూడా కథనం కొంత నెమ్మదిస్తుంది. బలవంతంగా రెండు కీలక సీన్లను కథనంలో ఇరికించినట్టు ఉంటుంది. ఎక్కువ శాతం డ్రామాతో నడిచే ఈ సినిమా మాస్ ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. అంతకు మించి ఈ చిత్రంలో పెద్దగా బలహీనతలు కనబడవు.
సాంకేతిక వర్గం:
దర్శకుడు వెంకీ అట్లూరి మంచి కథనాన్ని, సంభాషణల్ని, బలమైన ముఖ్య పాత్రల్ని, ఎమోషనల్ సన్నివేశాలని రాసుకుని రచయితగా సక్సెస్ అయ్యాడు. అలాగే అనుకున్న కథను అందంగా, ఆకర్షణీయంగా తెరకెక్కించి దర్శకుడిగాను విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో అతను ప్రేమ కథల్ని బాగా డీల్ చేయగలడని నిరూపించుకున్నాడు.
సంగీత దర్శకుడు థమన్ ఉన్న అన్ని పాటలకు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సంగీతాన్ని, ఎమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించి ఇంప్రెస్ చేశాడు. కెమెరామెన్ జార్జ్ ప్రతి సన్నివేశాన్ని అందంగా కెమెరాలో బంధించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లండన్ కథనాన్ని బాగా చూపించాడు. ఎడిటింగ్ బాగానే ఉంది. ప్రసాద్ గారు పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
వరుణ్ తేజ్ చేసిన ఈ ‘తొలిప్రేమ’ చిత్రం అతని కెరీర్లో మరో మర్చిపోలేని విజయంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వెంకీ అట్లూరి రాసుకున్న కథ, కథనాలు, సన్నివేశాలు , డైలాగ్స్, చిత్రాన్ని తెరకెక్కించిన తీరు యువతలో పుట్టే తొలిప్రేమలోని అందమైన ఎమోషన్, వరుణ్ తేజ్, రాశీఖన్నాల పెర్ఫార్మెన్స్, థమన్ సంగీతం, జార్జ్ కెమెరా పనితనం, నవ్వించే కామెడీ ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా నెమ్మదైన డ్రామా రెగ్యులర్ మాస్ ప్రేక్షకులకు కొంత కనెక్ట్ కాలేకపోవచ్చు. మొత్తం మీద ఈ ‘తొలిప్రేమ’ మెజారిటీ ప్రేక్షకుల మనసుల్ని తాకుతుంది.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team