విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : మానస్, నిత్యా నరేష్, కారుణ్య
దర్శకత్వం : మల్లూరి హరిబాబు
నిర్మాత : భువనగిరి సత్య సింధు
సంగీతం : భరత్
సినిమాటోగ్రఫర్ : ముజీర్ మాలిక్
ఎడిటర్ : నందమూరి హరి
మానస్, నిత్యా నరేష్, కారుణ్యలు జంటగా నటించిన చిత్రం ‘సోడ గోలీసోడ’. నూతన దర్శకుడు మల్లూరి హరిబాబు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ :
శ్రీను (మానస్) హీరో అవ్వాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ వచ్చి మాయ మాటలతో తన దగ్గర డబ్బుందని దర్శకుడు కొరటాల వినాయక్ (అలీ)ని నమ్మించి అతని సినిమాలో హీరోగా కుదురుతాడు. కానీ సినిమా సగం పూర్తయ్యే సరికి శ్రీను తమని మోసం చేశాడని అందరికీ తెలిసిపోతుంది.
దాంతో అందరూ అతన్ని నిలదీసి ఎందుకు మోసం చేశాడో చెప్పమంటారు. అసలు శ్రీను ఎవరు, ఎందుకు హీరో అవ్వాలనుకున్నాడు, దర్శకుడు కొరటాల వినాయక్ ను ఎందుకు మోసం చేశాడు అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమా ద్వితీయార్ధంలో వచ్చే హీరో తాలూకు ప్రేమ కథ బాగుంటుంది. ఆ కథలో హీరోయిన్ నిత్యా నరేష్ పెర్ఫార్మన్స్ బాగుంది. లుక్స్ పరంగా కూడ ఆమె పర్వాలేదనిపించింది. ఆ లవ్ ట్రాక్ జరుగుతున్నంతసేపు కొద్దిగా రిలీఫ్ అనిపిస్తుంది.
దొంగగా తిరుగుతున్న హీరోని సర్పంచ్ కూతురైన హీరోయిన్ ప్రేమించడం, పెళ్లయ్యాక తనని అందరూ దొంగకి భార్య అని పిలవకుండా ఉండాలంటే అతను మారాలని చెప్పి తన సొంత డబ్బుతో ఊళ్ళో వాళ్ళందరి దగ్గర హీరో దొంగిలించిన సొమ్ముల్ని తిరిగిచ్చేయడం అనే పాయింట్, అక్కడక్కడా షకలక శంకర్ కామెడీ సినిమా మొత్తంలో నయమనిపించే అంశాలు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో వెతికితే ప్రతి చోట తప్పులు కనబడతాయి. రొటీన్ కథనే సినిమా కోసం తీసుకున్న దర్శకుడు హరిబాబు కనీసం అందులో మినిమమ్ అనేలా ఉండే కథనాన్ని, సన్నివేశాల్ని రాసుకోవాలి. కానీ ఇందులోని కథనం కోపం తెప్పించేదిగా, సన్నివేశాలు సహనాన్ని పరీక్షించేలా ఉంటాయి.
ద్వితీయార్థంలో వచ్చే ఒక్క లవ్ ట్రాక్ పర్వాలేదనిపించగా మిగతా మొత్తం సినిమా అనవసరమనిపిస్తుంది. ఫన్ ఫార్మాట్లో మొదలైన సినిమా లవ్ ట్రాక్ తీసుకుని ఆ తరవాత ఉన్నట్టుండి సోషల్ కోణంలోకి వెళ్లిపోవడం చూస్తే దిమ్మతిరుగుతుంది. ఇక క్రమశిక్షణలేని ఈ కథనానికి తోడు కంటెంట్ లేని సన్నివేశాలు మరింత చిరాకు పెట్టిస్తాయి.
ముఖ్యంగా ప్యాడింగ్ ఆర్టిస్టులు మరీ ఇబ్బంది పెట్టేస్తారు. కృష్ణ భగవాన్, అలీ, ఇంకో ఇద్దరు మినహా మిగతా అందరూ తమ ఓవర్ పెర్ఫార్మెన్స్ తో మొహం మొత్తేలా చేస్తారు. మధ్యలో వచ్చే పాటలు కూడ ఏమాత్రం రిలీజ్ ఇవ్వలేకపోయాయి.
సాంకేతిక విభగం :
దర్శకుడు మల్లూరి హరిబాబు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. సెండాఫ్ లవ్ ట్రాక్ మినహా రొటీన్ కథను తీసుకుని దానికి బోరింగ్ కథనాన్ని, సన్నివేశాల్ని రాసుకుని ఏమాత్రం ఊహించలేని సినిమాను బయటకి వదిలారు. సంగీతం కూడా ఆకట్టుకోలేదు.
నందమూరి హరి తన ఎడిటింగ్ ద్వారా ఇంకొన్ని అనవసరమైన సీన్లను తొలగించి ఉండాల్సింది. ముజీర్ మాలిక్ సినిమాటోగ్రఫీ ఎక్కడా ఇంప్రెస్ చేయలేకపోయింది. నిర్మాణ విలువలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
తీర్పు :
టైటిల్ కి తగ్గట్టే ఈ ‘సోడ గోలీసోడ’ చిత్రంలోగ్యాసే ఎక్కువగా ఉంది. పెద్దగా ఆకట్టుకోని కథకథనాలు, సన్నివేశాలు, ఇబ్బందిపెట్టే నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాలో నిరుత్సాహపరిచే అంశాలు కాగా.. సెకండాఫ్లో వచ్చే లవ్ ట్రాక్, అక్కడక్క పేలిన షకలక శంకర్ కామెడీ కొంత పర్వాలేదనిపిస్తాయి. మొత్తం మీద ఈ వారాంతంలో ఈ చిత్రాన్ని పక్కన పెట్టడం ఉత్తమం.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team