పాటల సమీక్ష : ఛల్ మోహన్ రంగ – సరదాగా వినొచ్చు

హీరో నితిన్ నటించిన తాజా చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రంలోని పాటలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..

1. పాట : పెద్ద పులి

గాయనీ గాయకులు : రాహుల్ సిప్లిగంజ్
సాహిత్యం : సాహితి

‘రంగ రంగ రంగ చిందెయ్యి సామిరంగ’ అంటూ మొదలయ్యే ఈ పాట ఆరంభం నుండే మంచి ఊపుతో ఉండి ఆద్యంతం అలానే సాగింది. ‘అరె పొద్దుగాలే బైలెల్లు బోనం ఎత్తి బైలెల్లు గండి మైసికు మొక్కెల్లు’ అంటూ సాహితి తెలంగాణా యాసలో రాసిన లిరిక్స్ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక మాస్ బీట్స్ విషయంలో స్పెషలిస్ట్ ఐయాం తమన్ ఈ పాటను ఎంజాయ్ చేసేలా తీర్చిదిద్దారు. ఇక రాహుల్ సిప్లిగంజ్ పాడిన విధానం కూడ పాటలో మరోక ఆకర్షణగా నిలిచింది.

2. పాట : గ ఘ మేఘ
గాయనీ గాయకులు : రాహుల్ నంబియార్
సాహిత్యం : కృష్ణకాంత్

హీరో హీరోయిన్ల మధ్య పరిచయ సంభాషణలతో మొదలయ్యే ఈ పాట స్మూత్ గా సాగుతూ వినడానికి హాయిగా అనిపిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ హెవీ బీట్స్ కాకుండా వేగంగా ఉన్నా నెమ్మదిగా అనిపించే సంగీతాన్ని అందించి ఆకట్టుకున్నారు. కృష్ణకాంత్ సాహిత్యం బాగానే ఉంది. రాహుల్ నంబియార్ గాత్రం పాటకు ప్రధాన బలంగా నిలిచింది.

3. పాట : వెరీ వెరీ శాడ్
గాయనీ గాయకులు : యజిం నిజార్, సంజన కల్మన్జీ
సాహిత్యం : బాలాజీ

రెండక్షరాలె దాచేయడం.. అంటూ మొదలయ్యే ఈ పాటలో తమన్ అందించిన సంగీతం హైలెట్ గా నిలుస్తోంది. ‘విడిపోయేంతగా ముడిపడలేదుగా, మనసయ్యేంతలా మాటల్లేవుగా’ అంటూ బాలాజీ రాసిన్ లిరిక్స్ సింపుల్ గా, అందంగా ఉన్నాయి. యజిం నిజార్, సంజన కల్మన్జీలు పాటను పాడిన తీరు పాటను హాయిగా వినేలా చేశాయి.

4. పాట : వారం కాని వారం
గాయనీ గాయకులు : నకాష్ అజిజ్
సాహిత్యం : కేథారనాథ్

‘ఫస్ట్ లుక్ సోమవారం, మాట కలిపే మంగళవారం’ అంటూ మొదలయ్యే ఈ పాటకు తమన్ ఫాస్ట్ బీట్స్ ను అందించారు మాస్ అప్పీల్ కలిగించారు. ‘నీ రూపం చూస్తే సెగలు, నీ కోపం చూస్తే దిగులు, నువ్వర్థంకాని ఫజిలు’ వంటి లిరిక్స్ కొత్తగా, క్యాచీగా ఉన్నాయి. ఆల్బమ్ మొత్తంలో ఈ పాటను థియేటర్లో ఆడియన్స్ ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. నకాష్ అజిజ్ గాత్రం పాటను ఇంకోసారి వినాలి అనేలా చేసింది.

5. పాట : మియామి
గాయనీ గాయకులు : అదితి సింగ్ శర్మ, రీట, మనీష
సాహిత్యం : నీరజ కోన

మియామి మియామి అంటూ ఆరంభమయ్యే ఈ పాట పూర్తిగా వెస్ట్రన్ తరహా సంగీతంతో నిండి కొన్ని చోట్ల ఆసక్తిగా కొన్ని చోట్లా చాలా రొటీన్ గా అనిపిస్తోంది. ఈ పార్టీ పాటలో లిరిక్స్ కూడ పెద్దగా కొత్తగా ఏమీ లేవు. ఇప్పటి వరకు ఆల్బమ్ లో విన్న పాటల్లో ఇదే కొంత తక్కువ స్థాయిలో ఉంది.

6. పాట : అర్థంలేని నవ్వు
గాయనీ గాయకులు : శ్రీనిధి
సాహిత్యం : రఘురామ్

‘అర్థంలేని నవ్వు అర్థాలెన్ని అంటూ’ మొదలయ్యే ఈ పాటలోని క్లాసికల్ మ్యూజిక్ వినసొంపుగా అనిపిస్తోంది. సంగీత దర్శకుడు తమన్ సాంప్రదాయిక వాయిద్యాలతో కూర్చిన స్వరాలు బాగున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా గాయని శ్రీనిధి పాడిన తీరు బాగుంది.

తీర్పు:

ఈ ‘ఛల్ మోహన్ రంగ’లోని ఆరు పాటల్లో మొదటి నాలుగు పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ‘వెరీ వెరీ శాడ్, వారంకాని వారం, పెద్ద పులి’ పాటలు అమితంగా ఆకట్టుకోగా మొదటి పాట ‘గ ఘ మేఘ’ కూడ ఆలరించింది. ఇక మిగిలిన రెండు పాటల్లో ఐదవది ‘అర్థంలేని నవ్వు’ పాటలోని సంగీతం బాగుండగా నాల్గవ పాట ‘మియామి’ అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. మొత్తం మీద తమన్ యొక్క క్లాస్ టచ్ తో పాటు మాస్ టచ్ ను కూడ కలిగి ఉన్న ఈ పాటలను సరదగా వినొచ్చు.

Click here for English Music Review

Exit mobile version