విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : నాగ శౌర్య, సాయి పల్లవి, వెరోనికా అరోరా
దర్శకత్వం : ఏ.ఎల్.విజయ్
నిర్మాతలు : లైకా ప్రొడక్షన్స్
సంగీతం : సామ్. సి.ఎస్
సినిమాటోగ్రఫర్ : నిరవ్ షా
ఎడిటర్ : ఆంటోనీ
స్క్రీన్ ప్లే : ఏ.ఎల్.విజయ్
సాయి పల్లవి, నాగ శౌర్యలు జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఏ.ఎల్.విజయ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం పలు వాయిదాల తర్వాత ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కథ:
తులసి (సాయి పల్లవి), కృష్ణ (నాగ శార్య)లు 19 ఏళ్ల వయసులోనే తొందరపడతారు. ఆ తొందరపాటు మూలంగా తులసి గర్భవతి అవుతుంది. ఆ విషయం తెలిసిన ఇరువురి కుటుంబ పెద్దలు బలవంతంగా తులసికి అబార్షన్ చేయిస్తారు.
అబార్షన్ జరిగిన ఐదేళ్లకు అబార్షన్ కారణంగా తులసి కడుపులోనే మరణించిన బిడ్డ ఆత్మ రూపంలో వచ్చి తులసి కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ బిడ్డ ఆత్మ ఎవరెవరిపై, ఎలా కక్ష సాధించింది అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాలో బాగా ఆకట్టుకునే అంశం తల్లి, బిడ్డల ఎమోషన్. అబార్షన్ మూలాన కడుపులోనే చనిపోయిన బిడ్డ తల్లి మీద ప్రేమతో ఆమెను చూడాలని ఆత్మ రూపంలో వెనక్కి రావడం, తల్లి చుట్టూ తిరగడం, ఆ తల్లి కూడ ప్రపంచాన్ని చూడకుండా కన్నుమూసిన తన బిడ్డను ఊహించుకుంటూ ఆ బిడ్డకు దియా అని పేరు పెట్టుకోడం వంటి భావోద్వేగాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
అంతేగాక దర్శకుడు విజయ్ ఈ సినిమా ద్వారా పెద్దలు చేసిన తప్పులకు శిశువుల్ని పుట్టకుండానే చంపడం ఎంతటి అనైతికం, ఏ స్థాయి దారుణం అనే విషయాల్ని వివరించారు. సినిమా రన్ టైమ్ కూడ తక్కువ కావడంతో సినిమా కథ చిన్న పాయింటే అయినా ఎక్కడా సాగదీసిన ఫీలింగ్ కలుగలేదు.
ఇక ఫస్టాఫ్లో బిడ్డ ఆత్మ పెద్దలపై పగ తీర్చుకునే కొన్ని సీన్స్, ఆ ఆత్మకు, తల్లికి మధ్యన నడిచే కొన్ని భావోద్వేగపూరిత సన్నివేశాలు, అస్సలు ఊహించని రీతిలో ఉండే ఎమోషనల్ క్లైమాక్స్ మంచి అనుభూతినివ్వగా సాయి పల్లవి, పాప దియా పాత్ర చేసిన బేబీ వెరోనికా అరోరా నటన ఆకట్టుకున్నాయి.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథ వినడానికి బాగానే ఉన్నా స్క్రీన్ మీద చూపడాని సరిపడినంత కథనాన్ని విజయ్ తయారుచేసుకోలేదు. ఒక్క క్లైమాక్స్ మినహా మిగతా అన్ని సన్నివేశాల్ని ముందుగానే ఊహించేయవచ్చు. ఫస్టాఫ్లో ఆత్మగా మారిన పాప పగ తీర్చుకోనే సన్నివేశాలు కొన్ని బాగానే ఉన్నా మిగిలినవి రొటీన్ అనిపించాయి.
అలాగే సినిమాలో సాధారణ ప్రేక్షకుల్ని అలరించే కమర్షియల్ అంశాలేవీ పెద్దగా లేవు. ఎక్కడా గ్లామర్ కానీ, కామెడీ కానీ మచ్చుకు కూడ తగలవు. కథనం సీరియస్ గా నడుస్తుంది అనుకునే సమయంలో మధ్యలో హాస్యం కోసం ఇరికించిన చేసిన ప్రియదర్శన్ పోలీస్ పాత్ర కొంత చికాకు పెడుతుంది. ఆయనపై వచ్చే కొన్ని సీన్స్ కూడ అనవసరం అనిపిస్తాయి. ఆ పాత్రను కామెడీగా కాకుండా కూడ సీరియస్ గా మలచి ఉంటే కథనం మరింత ఆసక్తికరంగా ఉండేది.
హీరో పాత్రలో ఏమంత డెప్త్ కనిపించలేదు. తల్లి, కూతుళ్ళ మధ్యన కూడ ఇంకొన్ని బలమైన ఎమోషనల్ సీన్స్ ఉండి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ముఖ్యమైన సామాజిక సందేశం కలిగిన కథను ఎంచుకున్నారు కానీ దానికి పూర్తిస్థాయిలో అలరించదగిన కథనాన్ని మాత్రం అందించలేకపోయారు. రన్ టైం తక్కువగా ఉన్న ఈ సినిమాలో ద్వితీయార్థం, క్లైమాక్స్ బాగా ఆకట్టుకోగా మొదటి అర్ధభాగం రొటీన్ గా నడించింది. కథలో ముఖ్యమైన తల్లి, బిడ్డల పాత్రల మధ్యన ఎమోషన్ ను కూడ ఇంకాస్త బిల్డప్ చేసి ఉండాల్సింది.
సామ్. సి.ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ సినిమాను చాలా సహజంగా ఉండేలా చేసింది. ఆంటోనీ ఎడిటింగ్ బాగానే ఉంది. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
సాయి పల్లవి, నాగ శౌర్యలు చేసిన ఈ చిత్రం మరీ గొప్ప చిత్రం కాకపోయినా పర్వాలేదనే స్థాయిలో అయితే ఉంది. ఏ.ఎల్.విజయ్ ఎమోషన్స్ కలిగిన కథ ద్వారా సామాజిక సందేశాన్ని చెప్పాలనుకోవడం బాగుంది. అలాగే సినిమాలోని ద్వితీయార్థం, తల్లి కూతుళ్ళ మధ్యన ఎమోషనల్ బాండింగ్, ఊహించని క్లైమాక్స్, సాయి పల్లవి నటన ఇందులో ఆకట్టుకునే అంశాలు కాగా ఊహాజనితమైన రొటీన్ ఫస్టాఫ్, మొదట్లో అడ్డుతగులుతున్నట్లు అనిపించిన ప్రియదర్శి ట్రాక్, రెగ్యులర్ ప్రేక్షకలకి కావాల్సిన కమర్షియల్ అంశాలు లేకపోవడం బలహీనతలుగా ఉన్నాయి. మొత్తం మీద కమర్షియల్ హంగుల్ని కోరుకునే ఆడియన్సుకు ఈ సినిమా అంతగా సూటవ్వకపోవచ్చు కానీ భిన్నమైన, ఎమోషన్స్ కలిగిన కథల్ని కోరుకునేవారికి ఈ చిత్రం సరిపడుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team