సమీక్ష : చెన్నై చిన్నోడు – ఫస్టాఫ్ వరకు పర్వాలేదు

Chennai Chinnodu movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 27, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : జివి.ప్రకాష్, ఆనంది, నిక్కీ గల్రాని

దర్శకత్వం : ఎం.రాజేష్

నిర్మాతలు : వి.జయంత్ కుమార్

సంగీతం : జి. వి. ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫర్ : శక్తి శరవణన్

ఎడిటర్ : వివేక్ హర్షన్

స్క్రీన్ ప్లే : ఎమ్. రాజేష్

తమిళ చిత్రం ‘కడవల్ ఇరుక్కాన్ కుమారు’ సినిమాకి అనువాదంగా వచ్చిన చిత్రమే ఈ ‘చెన్నై చిన్నోడు’. జివి.ప్రకాష్, ఆనంది, నిక్కీ గల్రాని జంటగా నటించిన ఈ సినిమా ఈరోజే విడులైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
సరదగా కాలం గడిపే కుర్రాడు కుమార్ (జివి.ప్రకాష్) ప్రియ (నిక్కీ గల్రాని) అనే అమ్మయిని పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలవ్వాలని అనుకుంటాడు. కానీ అతని మాజీ ప్రియురాలు నాన్సీ (ఆనంది)తో ప్రేమ అతన్ని వెంటాడుతుంటుంది.

ప్రియతో నిశ్చితార్థం తర్వాత కుమార్ స్నేహోఇటులతో కలిసి పార్టీ కోసం పుదుచ్చేరి వెళ్లి అక్కడ మణిమారన్ (ప్రకాష్ రాజ్) తో సమస్యల్లో పడతాడు. ఈ అన్ని సమస్యల నుండి కుమార్ ఎలా బయటపడ్డాడు, చివరికి తన జీవిత భాగస్వామిగా ప్రియ, నాన్సీల్లో ఎవర్ని ఎంచుకున్నాడు అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్:

హీరో పాత్రలో జివి. ప్రకాష్ మంచి నటనను కనబర్చాడు. నిర్లక్ష్యమైన ప్రవర్తన కలిగిన కుర్రాడిగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. లాగే హీరోయిన్లు నిక్కీ గల్రాని, ఆనంది ఇద్దరూ తమ పాత్రల పరిధి మేర బాగానే నటించారు.

జివి. ప్రకాష్, ఆనందిల లవ్ ట్రాక్ బాగుంది. వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ యువతను బాగా ఆకట్టుకుంటాయి. హీరో స్నేహితుడిగా ఆర్జే. బాలాజీ సినిమా మొత్తం కనిపిస్తూ నవ్వించాడు. అలాగే ప్రకాష్ రాజ్ కూడ తన పాత్రలో బాగానే నటించగా ఫస్టాఫ్లో వచ్చే 5 నిముషాల సీరియల్ ఎపిసోడ్ బాగా నవ్వించింది.

మైనస్ :

పర్లేదు బాగుందనిపించే ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ రకరాల డైవర్షన్స్ తీసుకుని చివరికి ప్రేక్షకుల మూడ్ ను చెడగొట్టింది. అనవసరంలేని, సంబంధంలేని, బలహీనమైన సన్నివేశాలు చాలా కథనంలోకి ప్రవేశించి చికాకు పెడతాయి. సినిమా మొత్తాన్ని ఫస్టాఫ్ లాగానే లవ్ ట్రాక్ చుట్టూ తిప్పి ఉన్నా కొంచెం బెటర్ గా ఉండేది.

ప్రకాష్ రాజ్ బాగానే నటించినా ఆయన పాత్ర మరీ బలహీనంగా ఉండటమేగాక అతను, అతని బృందంపై నడిచే సన్నివేశాలు మరీ సిల్లీగా అనిపిస్తూ, కథతో సంబంధ లేకుండా సాగుతూ విసిగించాయి. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్లకి కథలో సరైన జస్టిఫికేషన్ ఇవ్వలేదు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రత్యేక గీతం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు ఉంది.

సాంకేతిక విభాగం :
‘నేనే అంబానీ’ లాంటి ఫన్ ఉన్న సినిమాని అందించిన దర్శకుడు ఎం.రాజేష్ ఈసారి తన టార్గెట్ ను మిస్సయ్యాడు. మొదటి అర్థ భాగాన్ని బాగానే హ్యాండిల్ చేసిన ఆయన సెకండాఫ్లో మాత్రం అనవసరమైన అంశాల జోలికి వెళ్లి సినిమాను పక్కదారి పట్టించి సినిమా ఫలితాన్ని తలకిందులయ్యేలా చేశారు.

వివేక్ హర్షన్ ఎడిటింగ్ పర్వాలేదు. ద్వితీయార్ధంలో కొన్ని అవసరంలేని సన్నివేశాల్ని తొలగించాల్సింది. శక్తి శరవణన్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. జివి.ప్రకాష్ అందించిన సంగీతం పర్వాలేదు. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘చెన్నై చిన్నోడు’ అనే రొమాంటిక్ డ్రామా ప్రేక్షకుల్ని అలరించడంలో విఫలమైంది. మంచి లవ్ ట్రాక్ కలిగిన ఫస్టాఫ్ అలరించినా సెకండాఫ్ మాత్రం అనవసరమైన డైవర్షన్స్ తీసుకుని, కథకు దూరంగా వెళ్ళిపోయి నిరుత్సాహానికి గురిచేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్టాఫ్ వరకు పర్వాలేదనిపించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడటంకన్నా టీవీల్లో ప్రసారం చేసినప్పుడు చూడటం నయం.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

 

Click here for English Review

Exit mobile version