సమీక్ష : డా.సత్యమూర్తి – లిమిటెడ్ థ్రిల్స్

Dr Satyamurthy movie review

విడుదల తేదీ : జూన్ 02, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : రెహమాన్, అదితి గురురాజ్

దర్శకత్వం : సెంథిల్ నాథన్

నిర్మాత : డి.వెంక‌టేష్

సంగీతం : ప‌్రేమ్ కుమార్‌

సినిమాటోగ్రఫర్ : శ‌ర‌వ‌ణ పాండియ‌న్‌

ఎడిటర్ : ఎస్‌.పి.అహ్మ‌ద్‌

స్క్రీన్ ప్లే : సెంథిల్ నాథన్

తమిళ నటుడు రెహమాన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం ‘ఒరు ముగతిరై’. 2017లో విడుదలైన ఈ చిత్రాన్ని తెలుగులో ‘డా.సత్యమూర్తి’ పేరుతో అనువదించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

సైకాలజీ స్టూడెంట్ అయిన కల్పన (అదితి గురురాజ్) ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అర్జున్ అనే వ్యక్తిని గుడ్డిగా నమ్మి ఇంట్లో వాళ్ళను కాదని చెన్నై వెళ్ళిపోతుంది. కానీ అర్జున్ ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె చదివిన కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసిన డా.సత్యమూర్తి ఆమెకు తన ఇంట్లో ఆశ్రయమిస్తాడు.

కొన్ని రోజుల తర్వాత తనకు ఆశ్రయమిచ్చిన సత్యమూర్తి, తనకు పేస్ బుక్ ద్వారా పరిచయమైన అర్జున్ ఇద్దరూ ఒక్కరేనని కల్పనకు తెలుస్తుంది. అసలు సత్యమూర్తి అర్జున్ అనే పేరుతో కల్పనను ఎందుకు మోసం చేశాడు, నిజం తెలుసుకున్న కల్పనను ఎలా ఇబ్బందిపెట్టాడు, చివరికి కల్పన కథ ఏమైంది అనేదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు సెంథిల్ నాథన్ ఈ సినిమా ద్వారా అమాయకులైన అమ్మాయిలు సోషల్ మీడియా ద్వారా ఎలా మోసపోతున్నారు అనే అంశాన్ని తెలియజెప్పడం బాగుంది. అలాగే డా.సత్యమూర్తి పాత్రను ఆయన చిత్రికరించిన విధానం కూడ ఆకట్టుకుంది. మంచితనం, తెలివితో పాటు కొంచెం మోసపూరితమైన వ్యక్తిత్వం కలగలిసిన డా. సత్యమూర్తి పాత్రలో నటుడు రెహమాన్ చాలా బాగా నటించారు. పాత్రలోని ప్రతి కోణాన్ని తెరపై అద్భుతంగా కనబడేలా పెర్ఫార్మ్ చేశారాయన.

ముఖ్యంగా సెకండాఫ్లో హీరోయిన్ నిజం తెలుసుకున్న తర్వాత పూర్తిగా నెగెటివ్ షేడ్ లోకి మారిపోయిన డా.సత్యమూర్తి ప్రాణంగా ప్రేమించిన కల్పనను తన చేతులతో కాకుండా వేరే విధంగా చంపాలని అనుకోవడం, అందుకోసం వేసే ప్లాన్ థ్రిల్ కలిగించాయి. కథలోని ఇంటర్వెల్ బ్లాక్, ముగింపు రెండూ ప్రేక్షకుడికి సంతృప్తినిచ్చే విధంగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకి ప్రధాన మైనస్ దర్శకుడు సెంథిల్ నాథన్ కథకి మూలాధారమైన రెండు ప్రేమ కథల్ని సరిగ్గా సింక్ చేయలేకపోవడం. సినిమా ఒక కథ నుండి ఇంకో కథలోకి మారుతుప్పుడు ప్రేక్షకులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి తోడు ఫస్టాఫ్లో ఎక్కువ సేవు కనిపించే ప్రేమ కథను అవసరానికి మించి సాగదీశారు.

మొదటి అర్ధభాగంలో వచ్చే హీరోయిన్ కాలేజ్ ఎపిసోడ్స్, ఆమెకు, ఆమె స్నేహితురాలికి మధ్యన నడిచే గొడవల తాలూకు సన్నివేశాలు కూడ ఎక్కువగా ఉండి బోర్ కొట్టించాయి. ఇంటర్వెల్ ముందు వరకు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, అసలు కథేమిటి అనేది రివీల్ కాకపోవడం నీరసాన్ని తెప్పించింది.

ఇక కథ ఓపెన్ అయిన తరవాత ద్వితీయార్థం మెల్లగా వేగం పుంజుకుంటుంది అనే సమయానికి మధ్యలో వచ్చే కామెడీ ఎపిసోడ్స్ ఫ్లోను చెడగొడుతూ చిరాకు పెట్టాయి.

సాంకేతిక విభాగం:

దర్శకుడు సెంథిల్ నాథన్ సోషల్ మీడియా వలన కలిగే ప్రమాదాన్ని ఆధారంగా చేసుకుని దానికి ఆసక్తికరమైన డా.సత్యమూర్తి పాత్రను జోడించి రాసుకున్న స్టోరీ లైన్, ద్వితీయార్థం కథనం బాగానే ఉన్నా ఫస్టాఫ్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షపెట్టేలా ఉండటంతో సినిమా ఫలితం కొంత దెబ్బతింది.

ప‌్రేమ్ కుమార్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. శ‌ర‌వ‌ణ పాండియ‌న్‌ సినిమాటోగ్రఫీ ఏదో కొన్నేళ్ల క్రితం నాటి సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలిగించింది. ఎస్‌.పి.అహ్మ‌ద్‌ సినిమా మొదటి అర్ధభాగంలో అనవసరమైన కాలేజ్ ఎపిసోడ్స్ కొన్నింటిని తొలగించి ఉండాల్సింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

తెలుగులోకి అనువాదమయ్యే తమిళ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడమంటే కొంచెం కష్టమైన పనే. ఈ ప్రాసెస్ లో చాలా సినిమాలు మొత్తానికి చతికిలబడుతుండగా ఇంకొన్ని సినిమాలు పూర్తిస్థాయి ఫలితాన్ని రాబట్టుకోలేవు. ఈ ‘డా. సత్యమూర్తి’ రెండవ క్యాటగిరీలోకి వస్తుంది. దర్శకుడు సెంథిల్ నాథన్ రాసుకున్న స్టోరీ లైన్, ప్రధానమైన సత్యమూర్తి పాత్ర, సెకండాఫ్ కథనం బాగానే ఉన్నా ప్రథమార్థం, కొన్ని అనవసరమైన సన్నివేశాలు, కామెడీ ట్రాక్స్ విసిగించాయి. మొత్తం మీద ఈ ‘డా.సత్యమూర్తి’ చిత్రం ప్రేక్షకులకు లిమిటెడ్ థ్రిల్స్ మాత్రమే ఇవ్వగలదని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version