సమీక్ష : జంబ‌ల‌కిడి పంబ‌ – మ్యాజిక్ మిస్సైంది

 Jamba Lakidi Pamba movie review

విడుదల తేదీ : జూన్ 22, 2018

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

సమీక్ష : జంబ లకిడి పంబ – మ్యాజిక్ మిస్సైంది
ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
సంగీతం : గోపీ సుంద‌ర్‌
ఎడిటర్ : తమ్మిరాజు

మాటలు : శ్రీనివాస్ ఆంకాలపు

సినిమాటోగ్రఫర్ : స‌తీశ్ ముత్యాల‌

నిర్మాత‌లు : ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్

న‌టీన‌టులు : శ‌్రీనివాస‌రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి మరోసారి సోలో హీరోగా నటిస్తూ చేసిన చిత్రం ‘జంబ లకిడి పంబ’. మంచి అంచనాలతో ఈరోజే విడుదలైన ఈ సినిమా ఏ మేరకు నవ్వించిందో ఇప్పుడు చూద్దాం..

కథ :
వరుణ్ (శ్రీనివాస్ రెడ్డి), అతన భార్య (సిద్ది ఇద్నాని) గొడవల కారణంగా విడాకులు తీసుకోవాలనుకుంటారు. అలాంటి సందర్భంలోనే ఒక చిత్రమైన సంఘటన జరిగి వరుణ్ అతని భార్యగా, అతని భార్య వరుణ్ గా మారిపోతారు. ఆ తర్వాత ఏమైంది ? అమ్మాయిగా మారిన వరుణ్ తన సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు ? చివరికి అతని విడాకుల వ్యవహారం ఏమైంది ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలోని నటీనటుల పెరఫామెన్స్ బాగుంది. అందరూ స్టార్ కామెడియన్లే కావడం ఈ సినిమాకి కొంత బలాన్నిచ్చింది. కమెడియన్ వెన్నెల కిశోర్ ఎప్పటిలానే తన మార్క్ పంచులతో డైవర్స్ లాయర్ గా నవ్వించారు. ఆసాంతం విసిగించే ఈ చిత్రంలో నవ్వుకోదగ్గ మొమెంట్స్‌ కొన్ని అన్నా ఉన్నాయంటే శ్రీనివాస్ రెడ్డి నటనే కారణం. హీరోగా తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.

కీలకమైన పాత్రలో నటించిన పోసాని తన నటనతో చిత్రంలో కొంత తీవ్రతను తీసుకొచ్చారు. జబర్దస్త్ అప్పారావు, సత్యం రాజేష్ లు తమ తమ పాత్రల్లో బాగానే నటించారు. సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుండటంతో సెకండాఫ్ పై కొంత ఆసక్తి కలిగింది. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు కూడ బాగానే ఉన్నాయి.

మైనస్ పాయింట్స్ :

అసలు సినిమాలో మెయిన్ పాయింట్‌ ఏంటనేది ఇంటర్వెల్‌ సీన్‌ దగ్గర కానీ రివీల్‌ అవ్వదు. ఫస్ట్‌ హాఫ్‌ సాగతీత సీన్లతో విసుగు తెప్పించే హాస్యంతో నెట్టుకొచ్చేశారు. కనీసం ప్లో కూడా లేకుండా సాగే ప్రథమార్ధం చూసే సరిగే ఆడియన్స్ విసుగెత్తిపోతారు. కథకి ప్లాట్ పాయింట్ అయిన ఇంటర్వెల్‌ సీన్‌ చూశాక ఇక సెకెండ్ హాఫ్ లోనైనా సినిమా గాడిన పడుతుందనుకుంటే.. అవే సీన్లను అటు తిప్పి, ఇటు తిప్పి అదే రొటీన్‌ తంతుతో పండని కామెడీ వ్యవహారంతో ఇంకొంత బోర్ కొట్టిస్తారు.

కథ ద్వారానే ఎక్కడికక్కడ ఫన్ జనరేట్ చేస్తూ, ప్రధాన పాత్రల చేష్టలతో కడుపుబ్బా నవ్వించే ఫన్ మంత్రం ఈ సినిమాలో లోపించింది. అందుకే ఆశించిన స్థాయి కామెడీ ఈ చిత్రంలో కొరవడింది. శ్రీనివాస్ రెడ్డి, వెన్నల కిషోర్, పోసాని కృష్ణ మురళి లాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ లు ఉన్నా వారి టాలెంట్‌ని పూర్తిగా వాడుకునేంతగా సన్నివేశాలు లేకపోవడంతో వాళ్ళు కూడా చాలా సేపు చేష్టలుడిగి చూస్తుండిపోయారు.

మంచి స్టోరీ లైన్ ఉన్న ఈ సినిమాలో విలువైన భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రెండు కూడా కనిపించవు. ప్రతి సన్నివేశం సినిమాటిక్ గానే ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా ఊహాజనితంగా నడుస్తుంది. దీంతో ప్రేక్షకుడికి సినిమాలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ ఎక్కడా కలగలేదు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడాలంటే ముందుగా సతీష్ ముత్యాల కెమెరా వర్క్ ఈ సినిమాకే హైలెట్. బలం లేని స్క్రీన్ ప్లే లో తన విజువల్స్ తో కొంతైనా ఊరట కలిగించాడు. సినిమాలో ఎక్కడా విజువల్ బ్యూటీ తగ్గకుండా ఆయన చాలా బాగా చిత్రీకరించారు. శ్రీనివాస్ అంకాలపు రాసిన డైలాగ్స్ అక్కడక్కడ పేలాయి.

దర్శకుడుకి మంచి ఆర్టిస్ట్ లు, మంచి టీమ్ కుదిరినా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. తనే స్వయంగా రాసుకున్న ట్రీట్మెంట్, స్క్రీన్ ప్లే పగడ్బందీగా లేకపోవడంతో ఫలితం తారుమారైంది. ఎక్కడా కూడ కడుపుబ్బా నవ్వుకునే హాస్యం పండలేదు. సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన ట్యూన్స్, నేపధ్య సంగీతం బాగానే ఉన్నాయి కానీ ఆయన స్థాయికి తగ్గ పనితనం, తన క్లాసిక్ టచ్ ఎక్కడా ఈ చిత్రంలో కనిపించదు. తమ్మిరాజు ఎడిటింగ్ బాగున్నా, ఫస్ట్ హాఫ్ లోని సాగతీత సన్నివేశాలను ఇంకా కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

తీర్పు :
ఈవివి సత్యనారాయణగారి దర్శకత్వంలో రూపొందిన ‘జంబ లకిడి పంబ’ లాంటి గొప్ప కామెడీ చిత్రాన్ని రీక్రియెట్ చేయాలనుకున్నప్పుడు కథనం, పాత్రలు ఫన్ జనరేట్ చేసే ఎలిమెంట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. కానీ ఈ కొత్త ‘జంబ లకిడి పంబ’ విషయంలో మాత్రం అసలు సిసలైన ఆ మ్యాజిక్ మిస్సైంది. పెద్ద పెద్ద హాస్య నటులు, వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్, బాగుందనిపించే స్టోరీ లైన్ మినహా ఈ చిత్రంలో ఆస్వాదించదగిన అంశాలేవీ లేవు. మొత్తం మీద చెప్పాలంటే పూర్తిస్థాయి ఫన్ ఆశించి సినిమాకు వెళితే మాత్రం తీవ్ర నిరుత్సాహం తప్పదు.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

 

Exit mobile version