సమీక్ష : ‘జనతా హోటల్’ – విలువలు వర్సెస్ భావోద్వేగాలు

Janatha Hotel movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 14, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్

దర్శకత్వం : అన్వర్ రషీద్

నిర్మాతలు : సురేష్ కొండేటి

సంగీతం : గోపీ సుందరం

సినిమాటోగ్రఫర్ : ఎస్. లోకనాథన్

‘ఓకే బంగారం’తో హిట్ పెయిర్ అనిపించుకున్న దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. ఈ చిత్రాన్ని ‘జనతా హోటల్’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి అనువదించారు . అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ రోజే విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:

అబ్దుల్ రజాక్ తన భార్యకు మగ పిల్లాడు పుట్టాలని కలలు కంటుండగా.. అతనికి మాత్రం వరుసగా నలుగురూ ఆడపిల్లలే పుడతారు. అయినా ఆశ చంపుకోని అతడికి ఎట్టకేలకు ఐదో సంతానంగా మగ పిల్లాడు ఫైజి (దుల్కర్ సల్మాన్) జన్మిస్తాడు. కానీ తనకు జన్మని ఇచ్చి అతని తల్లి మరణిస్తోంది. దాంతో నలుగురు అక్కలే ఫైజిని అల్లారుముద్దుగా పెంచుతారు. దాంతో ఫైజీ ఎక్కువ సమయం వంటగదిలోని అక్కలతోనే గడుపుతూ పెరుగుతాడు. ఈ క్రమంలో అతని అక్కలందరికీ పెళ్లిల్లు అయిపోయి తన ఒంటరి వాడు అయిపోతాడు.

దాంతో స్విజర్ లాండ్ వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాని తండ్రికి అబద్దం చెప్పి చెఫ్ కోర్స్ చేసి తిరిగివస్తాడు. ఈ విషయం పెళ్లి చూపులకి వచ్చి షహానా (నిత్యా మీనన్)కి చెప్తే… అది కాస్త ఫైజీ తండ్రికి తెలిసి ఇద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ తర్వాత ఫైజీ ఇల్లు వదిలేసి కాకినాడలోని తన తాత కలామ్ దగ్గరకి వస్తాడు. అక్కడ ఫైజీ ఎదురుకున్న పరిస్థితులు ఏమిటి ? ఫైజీ తాత కలామ్ తన మనవడ్ని ఎలా తీర్చి దిద్దాడు ? ఫైజీ మనసు తెలుసుకున్న షహానా (నిత్యామీనన్) అతన్ని ప్రేమిస్తుందా ? ఒకప్పుడు తనను రిజెక్ట్ చేసిన షహానాని ఫైజీ ప్రేమిస్తాడా ? తన తాత జనతా హోటల్ ని ఫైజీ ఎలా బాగు చేశాడు ? లైఫ్ లో బిజినెస్ కి తప్ప దేనికి వాల్యూ ఇవ్వని అతని తండ్రని ఎలా మార్చాడు ? చివరకి ఫైజీ తన తాత చూపెట్టిన దారిలో విజయం సాధించాడా లేడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే

 

ప్లస్ పాయింట్స్ :

దర్శకుడు అన్వర్ రషీద్ జనతా హోటల్ నేపథ్యంలో రాసుకున్న కథే ఈ సినిమాకు ప్రధాన బలం. హోటల్ ని వంట వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూనే.. ఆకలి విలువ గురించి, మనం బతుకున్న సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని సంఘటనల గురించి విలువైన భావోద్వేగమైన సన్నివేశాలతో చాలా చక్కగా చూపించారు.

హీరో దుల్కర్ సల్మాన్ లుక్స్ పరంగా ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో షహానా పాత్రలో కనిపించిన నిత్యా మీనన్ కూడా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. దుల్కర్ – నిత్యా కెమిస్ట్రీ కూడా చాలా సరదాగా సాగుతూ మంచి ఫీల్ ని క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా మిడ్ నైట్ లో వచ్చే ‘లారీ సీక్వెన్స్’ తమ నటనతో ఆకట్టుకుంటారు.

ఇక సినిమాకే కీలకమైన తాత పాత్రలో కనిపించిన సీనియర్ నటులు తిలకన్ ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని అబ్బురపరుస్తారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన నటన హృదయానికి హత్తుకుపోతుంది. అలాగే హీరోని మార్చే సన్నివేశాల్లో కూడా ఆయన ఒకపక్క నవ్విస్తూనే, మరో పక్క ఎమోషనల్ గా కదిలిస్తారు. అక్క పాత్రల్లో నటించిన నటీమణులు, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

దర్శకుడు అన్వర్ రషీద్ చాలా చక్కని పనితనం కనబర్చాడు. బరువైన సన్నివేశాలన్ని కూడా ఎక్కువగా ఓవర్ గా డీల్ చేయకుండా బ్యాలెన్స్ డ్ గా నడిపిన విధానం బాగుంది. ”అన్నం కడుపుతో పాటు మనసును కూడా నింపాలి” అని సినిమాలో అంతర్లీనంగా ఇచ్చిన చక్కని మెసేజ్ బాగా ఆకట్టుకుంటుంది. ఇక గోపిసుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ మరియు మెసేజ్ తో పాటు కొన్నిసన్నివేశాల్లో మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు అన్వర్ కథనంలో మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా కనిపించారు. ముఖ్యంగా సెకెండాఫ్ మొదట్లో సాగే సన్నివేశాల్లో ఉత్సుకతను పెంచటంలో విఫలమయ్యారు. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం సింపుల్ గా నే కథనాన్ని నడపటం అంతగా రుచించదు.

ఇక కథను మలుపు తిప్పే ప్రదాన పాత్ర అయిన తిలకన్ పాత్ర, జనతా హోటల్ బాగు అయిన తరువాత కూడా చూసి ఆనందించి ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆ పాత్ర పట్ల పూర్తి సంతృప్తి చెందేవారు.

లండన్ వెళ్లిపోవాలని కలలు కనే హీరో, మారడానికి ఇంకా బలమైన సంఘటనలు ఉండి ఉంటే ఆ పాత్రకి ఇంకా బాగా జస్టిఫికేషన్ వచ్చి ఉండేది. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా అనిపించదు.

ఓవరాల్ గా జనతా హోటల్ లో బలమైన ఎమోషన్ తో పాటు బలమైన మెసేజ్ ఉన్నప్పటికీ ఆ ఎమోషన్ని ఆ మెసేజ్ ని అంతే బలంగా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ చేయగల తెలుగు నటులు లేకపోవడం కొంతవరకు ఈ సినిమాకు మైనసే.

 

సాంకేతిక విభాగం :

అన్వర్ రషీద్ దర్శకుడిగా ఈ ‘జనతా హోటల్’కి దాదాపుగా పూర్తి న్యాయం చేశారు. మంచి కథ, ఆసక్తికరమైన పాత్రలతో చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది.

సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన సంగీతం వినసొంపుగా ఉండటంతో పాటు సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. ఎస్. లోకనాథన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కిచన్ లోని షాట్స్ మరియు బీచ్ లోని హోటల్ విజువల్స్ చాలా ప్లజెంట్ గా అనిపిస్తాయి.

ఇక ఎడిటింగ్ బాగున్నప్పటికీ సెకెండాఫ్ లో స్లో సీన్స్ ని ఇంకాస్త ఉంటే ఇంకా బాగుండేది. ఇంతటి మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన సురేష్ కొండేటిని అభినందించి తీరాలి.

 

తీర్పు:

హోటల్ నేపథ్యంలో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్స్‌గా వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని మరియు ‘ఏ’ సెంటర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చెఫ్ లకు హోటల్ కు సంబంధించిన వ్యక్తులకు ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమాలో హోటల్ ని ఆ వాతవరణాన్ని చాలా అందంగా ఆహ్లాదకరంగా చూపిస్తూనే.. ఆకలి విలువ గురించి, సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని సంఘటనల గురించి భావోద్వేగమైన సన్నివేశాలతో చాలా చక్కగా చూపించారు. అయినప్పటికీ, సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్ స్లో సాగుతాయి. ఓవరాల్ గా డబ్బింగ్ సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version